టీవీకే ఎమ్మెల్యే పెద్ద మనసు- రెండు నెలల జీతం మొత్తం పేద, అనాథ విద్యార్థులకు విరాళం
తమిళనాడులోని మధురైలో ఓ అద్భుత మానవీయ కోణం వెలుగుచూసింది. మధురై నార్త్ కు చెందిన అధికార టీవీకే ఎమ్మెల్యే విజయ్ అన్బన్ కల్లనై కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. అనాథలు, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల ఉన్నత చదువులకు ఆయన అండగా నిలిచారు. ఎమ్మెల్యేగా తనకు అందిన రెండు నెలల వేతనం రెండు లక్షల రూపాయను ఆ విద్యార్థుల విద్యావకాశాల కోసం విరాళంగా ఇచ్చారు. తన పెద్ద మనసు చాటుకున్నారు.
ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ ఒక్క విద్యార్థి కూడా ఉన్నత చదువులకు దూరం కాకూడదనే ఉద్దేశంతో విజయ్ అన్బన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. సమాజంలో నిరుపేద వర్గాల పిల్లలకు మెరుగైన విద్యావకాశాలు కల్పించడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలోని తమ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకున్నానని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ విరాళాలతో కూడిన చెక్కులను ఎంపిక చేసిన 18 మంది పేద, అనాథ విద్యార్థులకు అందజేశారు.

ఈ విరాళం ఇవ్వడంతోనే సరిపెట్టకుండా, విద్యార్థులకు నిరంతరాయంగా సహాయం అందించేందుకు వీలుగా ఆయన ఓ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విజయ్ కల్వి కరమ్ పేరుతో ఒక కొత్త స్వచ్ఛంద కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని ద్వారా మొదటి విడత కింద మధురై ప్రాంతానికి చెందిన 18 మంది కాలేజీ విద్యార్థులకు నేరుగా ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేశారు. ఈ సహాయం ఒకేసారి ఇచ్చే నిధులతో ముగిసిపోదని, ఆ పిల్లలందరూ వారి కాలేజీ విద్యను పూర్తి చేసేంత వరకు తన వంతు పూర్తి మద్దతు ఇస్తానని స్పష్టం చేశారు.
నేటి తరం యువత చదువుకుంటేనే దేశ భವಿష్యత్తు మెరుగ్గా మారుతుందని, అందువల్లే విద్యకు పెద్దపీట వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎంతో మంది ప్రతిభావంతులైన పేద విద్యార్థులు సరైన ఆర్థిక వనరులు లేక, ఫీజులు కట్టలేక మధ్యలోనే చదువును ఆపేస్తున్నారు. అలాంటి దుస్థితి ఎవరికీ రాకూడదనే ఉద్దేశంతో విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో మంది పేద కుటుంబాలకు కొండంత భరోసాను ఇచ్చింది. ఒక ఎమ్మెల్యే తన సొంత వేతనాన్ని చదువుల కోసం కేటాయించడం పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
విజయ్ కల్వి కరమ్ పథకం కింద ప్రయోజనం పొందిన ఆ 18 మంది పేద విద్యార్థులు ప్రస్తుతం మదురై నగరంలోని వివిధ రకాల ప్రభుత్వ మరియు ప్రైవేటు కాలేజీలలో డిగ్రీ లేదా వృత్తి విద్యా కోర్సులు చదువుతున్నారు.ఈ ఆర్థిక సాయం వారి ఉన్నత చదువుల కలలను నిజం చేసుకోవడానికి ఎంతో దోహదపడుతుందని స్థానిక ఉపాధ్యాయులు సైతం సంతోషం వ్యక్తం చేశారు. మొన్నటి ఎన్నికల్లో టీవీకే తరఫున పోటీ చేసిన విజయ్ కల్లనై మధురై నార్త్ నియోజకవర్గం నుంచి 18,000లకు పైగా ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు.












Click it and Unblock the Notifications