వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోవిడ్-19 వ్యాక్సీన్: రాష్ట్రాల దగ్గర లేదు...కానీ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎలా దొరుకుతోంది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ప్రైవేటు ఆసుపత్రులలో టీకాలు దొరుకుతుండగా, ప్రభుత్వ ఆసుపత్రులలో స్లాట్లు దొరకడం లేదు.

దిల్లీ పక్కనే గ్రేటర్‌ నోయిడాలో ఉండే ప్రశాంత్‌ కుమార్‌ తన కుటుంబ సభ్యులకు వ్యాక్సీన్ స్లాట్ బుక్ చేయడానికి గత కొన్ని రోజులుగా ప్రయత్నిస్తున్నారు. గవర్నమెంట్‌ వ్యాక్సీన్‌ సెంటర్లలో కుదరక పోతే ప్రైవేట్‌గా అయినా తీసుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారు.

''ప్రైవేటు ఆసుపత్రులలో స్లాట్ లభించడం నాకు ఆశ్చర్యంగా ఉంది. గవర్నమెంట్ సెంటర్లలో ఎక్కడా స్లాట్ దొరకడం లేదు.'' అని ప్రశాంత్ కుమార్ బీబీసీతో అన్నారు. డబ్బులిచ్చి వ్యాక్సీన్‌ తీసుకోవడానికి తనకు ఇబ్బంది లేదని, కానీ, ప్రైవేటు ఆసుపత్రులు ఎక్కువ వసూలు చేస్తున్నాయని ఆయన అన్నారు.

''ప్రతి ఆసుపత్రి సొంత రేటును ప్రకటిస్తోంది. ఒక్కో డోసుకు వెయ్యి రూపాయల వరకు ఖర్చవుతోంది. ఇంట్లో ఇద్దరు మనుషులుంటే రూ.4వేలు ఖర్చు పెట్టాలి. వాస్తవానికి టీకా అంత ఖరీదు కాదు'' అని ప్రశాంత్ కుమార్ అన్నారు.

నోయిడాలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో టీకా ధర ఎలా ఉందో తెలుసుకోవడానికి కోవిడ్ యాప్‌ ద్వారా బీబీసీ ప్రతినిధులు ప్రయత్నించినప్పుడు ప్రశాంత్ చెప్పిన మాట నిజమని తేలింది.

ప్రభుత్వ ఆసుపత్రులలో స్లాట్‌లకు చాలా రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితి కనిపించగా, ప్రైవేట్ ఆసుపత్రులలో మాత్రం టీకా ముఖ్యంగా 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు వారికి సులభంగా దొరుకుతోంది. వ్యాక్సీన్ ధర రూ.250 నుండి రూ.1000 రూపాయల వరకు ఉంది.

కేంద్రం తీసుకువచ్చిన వ్యాక్సీన్ పాలసీ సరిగా లేదని దిల్లీ ప్రభుత్వం విమర్శించింది.

దిల్లీ ప్రభుత్వ అభ్యంతరాలు

టీకా విషయంలో కేంద్ర ప్రభుత్వ విధానాలను దిల్లీ ప్రభుత్వం తప్పుబట్టింది. ఇక్కడి ప్రభుత్వ ఆసుపత్రులకు కోవిన్ యాప్‌లో స్థానం దక్కకపోగా, ప్రైవేటు ఆసుపత్రులలో రూ.600 నుంచి రూ.1000 వరకు చెల్లించి వ్యాక్సీన్ తీసుకోవచ్చు.

https://twitter.com/AtishiAAP/status/1398645854752296965

''వ్యాక్సీన్ ఉచితంగా ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి సప్లై లేదు. కానీ ప్రైవేటు ఆసుపత్రులలో డబ్బులు పెట్టి టీకాను కొనుక్కోవచ్చు. ప్రపంచంలో ఇలాంటి పరిస్థితి ఉన్న ఏకైక దేశం భారత దేశమే'' అంటూ కోవిన్ యాప్‌ ఫొటోను ట్వీట్ చేస్తూ ఆప్ ఎమ్మెల్యే అతిషి వ్యాఖ్యానించారు.

https://twitter.com/BJP4India/status/1397810599279529986

అయితే, దిల్లీ ప్రభుత్వం టీకాను సకాలంలో కొనుగోలు చేయలేదని, ప్రైవేటు ఆసుపత్రులు రాష్ట్ర ప్రభుత్వం కన్నా ముందే వ్యాక్సీన్ ఆర్డర్లు ఇచ్చాయంటూ బీజేపీ ఆప్ ఆరోపణలను ఖండించింది.

టీకాను అందించే బాధ్యతల నుండి కేంద్ర ప్రభుత్వం తప్పించుకుంటోందంటూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ 11 మంది ముఖ్యమంత్రులకు లేఖ రాశారు.

ఇది కేవలం దిల్లీ, నోయిడాకు మాత్రమే పరిమితం కాదు. మహారాష్ట్రలో కూడా 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయస్సు వారికి టీకాలు వేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆపేసింది. త్వరలో వ్యాక్సినేషన్ మొదలు పెడతామని ప్రకటించింది.

https://twitter.com/vijayanpinarayi/status/1399323343162003458

అయితే, మహారాష్ట్రలోని ప్రైవేట్ ఆసుపత్రులలో వ్యాక్సీన్ అందుబాటులో ఉంది. కోవిన్ యాప్‌లో 18-44 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు వ్యాక్సీన్‌ స్లాట్‌లను పుణె, నాసిక్, ముంబైతో సహా పలు నగరాల్లోని ప్రైవేట్ ఆసుపత్రులలో బుక్ చేసుకోవచ్చు.

ముంబైలో 40 నుంచి 50 శాతం వ్యాక్సీన్‌ను ప్రైవేట్ ఆసుపత్రులకు కేటాయించారని 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ రాసింది. దీనివల్ల వ్యాక్సీన్ కోసం 16 నుంచి 66 శాతం అధిక ధర చెల్లించాల్సి ఉంటుంది.

ఇక దేశ వ్యాప్తంగా అనేక నగరాలలో ప్రైవేటు ఆసుపత్రులు ఆఫీసులు, కాలనీలలో క్యాంపులు పెట్టి అధిక ధరలకు టీకాలను అందిస్తున్నాయి. మరి ప్రభుత్వానికి టీకా అందుబాటులో లేక స్లాట్‌లు దొరక్కపోతుంటే, ప్రైవేటు ఆసుపత్రులకు వ్యాక్సీన్ ఎక్కడి నుంచి వస్తోంది ?

దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో కోవిడ్ వ్యాక్సీన్ అందుబాటులో లేదు.

ప్రభుత్వ పాలసీపై ప్రశ్నలు

మే 1 నుంచి అమలులోకి వచ్చిన ప్రభుత్వ విధానం ప్రకారం:

  • వ్యాక్సీన్ తయారీదారులు టీకా డోసుల్లో 50 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేదా బహిరంగ మార్కెట్లో ముందుగా నిర్ణయించిన ధరకు అమ్మవచ్చు.
  • 18 ఏళ్లు ఆపై బడిన వారికి వ్యాక్సీన్‌ను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు డోసులు నేరుగా వ్యాక్సీన్‌ తయారీదారుల నుంచి కొనుగోలు చేయవచ్చు.
  • మునుపటిలాగే, భారత ప్రభుత్వం ఫ్రంట్‌లైన్ కార్మికులకు, 45 ఏళ్లు పైబడిన వారికి, పేదలకు ఉచితంగా వ్యాక్సీన్లు వేయడం కొనసాగిస్తుంది.

అయితే, ఈ పాలసీ వల్ల వ్యాక్సీన్ ప్రైవేటు ఆసుపత్రులకే ఎక్కువగా చేరుతోందని, రాష్ట్ర ప్రభుత్వాలకు అందడం లేదని నిపుణులు అంటున్నారు.

''వ్యాక్సినేషన్ సరఫరా పూర్తిగా జరిగుంటే బాగుండేది. ఒక పక్క 45 సంవత్సరాలు దాటిన వారికి, ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి వ్యాక్సీన్ అందుబాటులో లేదు. ఈ పరిస్థితుల్లో ప్రైవేటు రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం సరైంది కాదు'' అని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ప్రొఫెసర్ కె. శ్రీనాథ్ రెడ్డి బీబీసీతో అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వాలకు పోటీగా ప్రైవేటు సంస్థలు ఎక్కువ డబ్బు చెల్లించి వ్యాక్సీన్లను కొనుగోలు చేసే అవకాశం ఉంది.

''రాష్ట్ర ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు పోటీ పడినప్పుడు, ఎవరు ఎక్కువ ధర ఇవ్వడానికి సిద్ధపడితే తయారీదారుడు వారికే ముందు వ్యాక్సీన్ ఇస్తారు'' అని శ్రీనాథ్ రెడ్డి విశ్లేషించారు.

''టీకాలు ఎప్పుడూ కేంద్ర ప్రభుత్వం నుంచే రావాలి. ఇలాంటి వికేంద్రీకృత సరఫరా పెద్ద దేశాలలో చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తుంది'' అన్నారాయన.

సుప్రీంకోర్టు సందేహాలు

టీకాకు దేశమంతా ఒకే ధర ఉండాలని జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. టీకాలకు రకరకాల ధరలు ఉండటంపై కేంద్ర ప్రభుత్వానికి కోర్టు ప్రశ్నలు సంధించింది.

''మేం టీకాను తక్కువ ధరకు పొందుతున్నామని కేంద్రం చెబుతోంది. మరి రాష్ట్రాలు ఎక్కువ ధరకు ఎందుకు కొనాల్సి వస్తోంది ? దేశం మొత్తం ఒకే ధర ఉండాలి కదా'' అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

''వ్యాక్సీన్‌ కొనడం లక్ష్యమైతే కేంద్ర ప్రభుత్వం 45 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే ఎందుకు పరిమితం చేస్తోంది ? 45 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిని రాష్ట్రాలకు ఎందుకు వదిలేస్తోంది ? పేద, వెనుకబడిన వర్గాలను ఎలా చూడబోతున్నారు మీరు?'' అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది.

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యాక్సీన్ పాలసీపై సుప్రీం కోర్టు అనేక సందేహాలు లేవనెత్తింది.

టీకా పాలసీని సమర్ధించుకున్న కేంద్ర ప్రభుత్వం

''ప్రజారోగ్యం రాష్ట్రాలకు సంబంధించిన అంశం. ఎక్కువ అధికారాలు ఇవ్వాలని రాష్ట్రాలు అభ్యర్ధించిన తర్వాత సరళతరమైన వ్యాక్సీన్ పాలసీని తీసుకొచ్చాం'' అని మే 27న నీతీఆయోగ్ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది.

దీని ప్రకారమే కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన తర్వాత మిగిలిన 50శాతం వ్యాక్సీన్‌లో 25శాతం వ్యాక్సీన్‌ను రాష్ట్రాలకు, 25 శాతం వ్యాక్సీన్‌ను ప్రైవేటు సంస్థలకు ఇస్తున్నామని ఈ ప్రకటనలో పేర్కొంది.

ప్రైవేట్ ఆస్పత్రులు టీకాలు ఎలా కొంటున్నాయి?

టీకా విషయంలో ప్రైవేట్ ఆస్పత్రులు పారదర్శకతను కొనసాగిస్తున్నాయా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. రాబోయే 20 రోజులకు సరిపడా వ్యాక్సీన్ తమ వద్ద ఉందని దిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి చెందిన అధికారి వెల్లడించారు.

తన పేరు బయటపెట్టద్దనే షరతుపై ఆయన ఈ సమాచారం ఇచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేస్తున్న రేటుకే, మీరు వ్యాక్సీన్ పొందుతున్నారా అన్న ప్రశ్నకు ఆయన తెలియదని సమాధానం ఇచ్చారు. తయారీదారులు ఆసుపత్రులతో చర్చలు జరుపుతాయని, వాటి ప్రకారం కొనుగోళ్లు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.

దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న అపోలో ఆసుపత్రులలో కోవిన్ యాప్ ద్వారా టీకాకు స్లాట్‌లు లభిస్తున్నాయి. అపోలో ఎన్ని వ్యాక్సీన్‌లు కొనుగోలు చేశారు, ఎంత రేటుకు అందిస్తున్నారు అన్న అంశంపై బీబీసీ ఆదివారం మెయిల్ ద్వారా వివరణ కోరింది.

అయితే, ఈ ప్రశ్నలకు సమాధానం ఇస్తామని అపోలో ప్రతినిధులు తెలిపినా, ఈ కథనం రాసే సమయానికి వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఒకవేళ ఆ ఆసుపత్రి నుంచి సమాచారం వస్తే ఈ వార్త అప్‌డేట్ అవుతుంది.

వ్యాక్సీన్ విషయంలో కేంద్ర విధానాలను విమర్శిస్తూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కొందరు ముఖ్యమంత్రులకు లేఖ రాశారు.

హోటళ్లలో టీకాల వివాదం

ఇటీవల కొన్ని హోటళ్లు తాము టీకాలు కూడా ఇస్తామంటూ ప్యాకేజీలు ప్రకటించాయి. ఈ ప్రకటనలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే, వీటిని వెంటనే ఆపాలని ప్రభుత్వం ఆదేశించింది.

కోవిడ్-19 మార్గ దర్శకాలకు భిన్నంగా కరోనా టీకా ప్యాకేజీలు ప్రకటిస్తున్న సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Covid-19 vaccine: Not available in the states,but how is it available in private hospitals
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X