కోవిడ్ వ్యాక్సిన్ కొరత.... దేశంలో 35 శాతం మేర పడిపోయిన వ్యాక్సినేషన్...
దేశంలో కరోనా వ్యాక్సిన్ కొరత కారణంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ నత్త నడకన సాగుతోంది. కేవలం రెండు కంపెనీలు మాత్రమే వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తుండటంతో జనాభాకు తగినంత వ్యాక్సిన్ అందుబాటులో లేదు. వ్యాక్సిన్ కొరత కారణంగా 18-44 ఏళ్ల లోపు వారికి వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ ముందుకు సాగట్లేదు. చాలా రాష్ట్రాలు ఇప్పటికే దీన్ని నిలిపివేశాయి.
దేశంలో వ్యాక్సిన్ కొరతపై తాజాగా ఓ ఆసక్తికర రిపోర్ట్ తెర పైకి వచ్చింది. దాని ప్రకారం... గత వారం దేశంలో ఒక మిలియన్ జనాభాకు గాను 1455 మందికి వ్యాక్సిన్ ఇవ్వగా ఈ వారం అది 980 మందికి పడిపోయింది. అంటే గత వారం కంటే ఈ వారం వ్యాక్సినేషన్ 35 శాతం మేర పడిపోయింది. ప్రపంచ దేశాల సగటుతో పోల్చితే ఇది చాలా తక్కువ. ప్రస్తుతం ప్రపంచ దేశాల వ్యాక్సినేషన్ సగటు ఒక మిలియన్ జనాభాకు 3564గా ఉంది.

ప్రస్తుతం దేశంలో భారత్ బయోటెక్,సీరమ్ ఇన్‌స్టిట్యూట్ మాత్రమే కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ రెండు కంపెనీలు కలిపి నెలకు 8.5 కోట్ల డోసుల మేర ఉత్పత్తి చేస్తున్నాయి. ఉత్పత్తి జరుగుతున్నంత స్థాయిలో కూడా దేశంలో ప్రస్తుతం వ్యాక్సినేషన్ జరగట్లేదు. వ్యాక్సినేషన్ పుంజుకోవాలంటే గ్లోబల్ టెండర్లే మార్గమని భావించినప్పటికీ విదేశీ కంపెనీలు అందుకు తిరస్కరిస్తున్నాయి. పంజాబ్,ఢిల్లీ ప్రభుత్వాలు గ్లోబల్ టెండర్లు పిలవగా మోడెర్నా,ఫైజర్ కంపెనీలు అందుకు తిరస్కరించాయి. తాము నేరుగా రాష్ట్రాలకు వ్యాక్సిన్ సప్లై చేయలేమని తేల్చేశారు. కేంద్రంతోనే డీల్ చేస్తామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకుంటుందనేది చర్చనీయాంశంగా మారింది.
వ్యాక్సినేషన్ మందగించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడం కాస్త ఊరట కలిగించే అంశం. మే 23 నాటికి వరుసగా రెండో వారం దేశంలో కేసుల సంఖ్య తగ్గింది. రోజువారి కేసులు 22 శాతం తగ్గాయి. మే 6న అత్యధికంగా 4.14 లక్షల కేసులు నమోదైన సంగతి తెలిసిందే. బహుశా సెకండ్ వేవ్‌లో ఇదే పీక్‌గా పరిగణిస్తున్నారు. ఈ లెక్కన సెకండ్ వేవ్ పీక్‌ను దాటి కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.
ప్రస్తుతం రోజుకు సగటున 2.5లక్షల కరోనా కేసులు నమోదవుతున్నాయి. మే 16 వరకు రోజూ 3.3 లక్షల కేసులు నమోదవగా... ఆ తర్వాత నుంచి క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో కేసుల సంఖ్య మరింత తగ్గింది. కేవలం 1,96,427 కొత్త కేసులు నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications