డెల్టాతోపాటు ఆల్ఫా, బీటా, గామా కరోనా వేరియంట్లపైనా ఈ 2 వ్యాక్సిన్లు సమర్థవంతం: ఐసీఎంఆర్
న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం అందిస్తున్న కరోనా వ్యాక్సిన్లు కోవిషీల్డ్, కోవాగ్జిన్.. కరోనా వేరియంట్లయిన డెల్టా, ఆల్ఫా, బీటా, గామాలపైనా సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్లు వ్యాప్తి జరుగుతున్న విషయం తెలిసిందే.
Recommended Video

డెల్టా, ఆల్ఫా, బీటా, గామా వేరియంట్లపైనా కోవాగ్జిన్, కోవిషీల్డ్ ప్రభావం
ఈ నేపథ్యంలో ఢిల్లీలో బలరాం మీడియాతో మాట్లాడారు. డెల్టా ప్లస్ రకం వైరస్‌పై ఈ రెండు వ్యాక్సిన్ల ప్రభావం విషయమై ప్రస్తుతం అధ్యయనాలు కొనసాగుతున్నట్లు తెలిపారు. కోవాగ్జిన్ టీకా కరోనా తొలిరకంపై ఎంత సమర్థవంగా పనిచేస్తోందో అదేస్తాయిలో ఆల్ఫా రకం వైరస్‌పైనా పూర్తి సమర్థతో పనిచేస్తోందని వెల్లడించారు. ఈ రకంపై కోవిషీల్డ్ వ్యాక్సిన్ సామర్థ్యం స్వల్పస్థాయిలో తగ్గుతోందన్నారు. కొద్ది తేడాలున్నా కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లు ఆల్ఫా, బీటా, గామా, డెల్టా వైరస్‌లపై బాగా పనిచేస్తున్నట్లు అధ్యయనంలో తేలందని బలరాం భార్గవ వివరించారు.

డెల్టా ప్లస్ రకంపై వ్యాక్సిన్ల ప్రభావంపై ప్రారంభమైన అధ్యయనం..
డెల్టా ప్లస్ రకానికి సంబంధించి టీకాల సామర్థ్యం ఎంతమేరకు ఉందన్న అంశంపై ప్రయోగశాలల్లో పరిశీలిస్తున్నట్లు బలరాం తెలిపారు. ఈ అధ్యయన ఫలితాలు 10 రోజుల్లో వెల్లడేయ్య అవకాశం ఉందన్నారు. దీంతో ప్రపంచంలో అందుబాటులోకి వచ్చిన తొలి ఫలితాలు ఇవే అవుతాయన్నారు. అవసరమైతే వీటి ఆధారంగా వ్యాక్సిన్లలో మార్పులపై నిర్ణయం తీసుకోవచ్చని తెలిపారు.

దేశంలో కరోనా చాప్టర్ ముగిసిపోలేదు..
దేశంలో కరోనా ఉధృతి ఇప్పుడే ముగిసిపోలేదని, ఇప్పటికీ 75 జిల్లాల్లో ఇంకా 10 శాతానికి మించి పాజిటివిటీ రేటు ఉందని బలరాం భార్గవ అప్రమత్తం చేశారు. మరో 92 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5 నుంచి 10 శాతం మధ్యలో ఉందన్నారు. దేశంలో థర్డ్ వేవ్ ఉధృతిని తప్పించాలంటే మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం లాంటి కరోనా నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్ వేగంగా జరగాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో కరోనావైరస్ ఆందోళనకర రకాలను 35 రాష్ట్రాల్లోని 174 జిల్లాల్లో గుర్తించినట్లు జాతీయ అంటువ్యాధుల నియంత్రణ సంస్థ(ఎన్సీడీసీ) డైరెక్టర్ సుజీత్ కుమార్ సింగ్ తెలిపారు.

దేశంలో డెల్టా ప్లస్ వేరియంట్ కలకలం
దేశంలో 11 రాష్ట్రాల్లో 51 డెల్టా ప్లస్ కేసులు బయటపడినట్లు చెప్పారు. మహారాష్ట్రలో 22 డెల్టా ప్లస్ కేసులు నమోదు కాగా, తమిళనాడులో 9, మధ్యప్రదేశ్ లో 7, కేరళలో 3, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల్లో 2 కేసుల చొప్పున, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, హర్యానా, కర్ణాటక రాష్ట్రాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదైంది. ఏపీలో ఆల్ఫా కేసులు 80, బీటా కేసులు 7, డెల్టా కేసులు 742 కేసులు నమోదు కాగా, తెలంగాణలో ఆల్ఫా కేసులు 293, బీటా కేసులు 94, డెల్టా కేసులు, 740 కేసులు వెలుగుచూశాయి. జమ్మూకాశ్మీర్‌లోనూ ఒక కేసు నమోదైంది. దేశంలో డెల్టా ప్లస్ కేసులు తక్కువ స్థాయిలోనే ఉన్నాయని, వేగంగా వ్యాప్తి చెందే స్వభావం ఉన్నట్లు ఇప్పటి వరకు గుర్తించలేదన్నారు.












Click it and Unblock the Notifications