పట్టాలపై బడబాగ్ని- పగుళ్లతో కొత్త అనుమానాలు
తమిళనాడులోని తిరువళ్లూరులో ఈ ఉదయం డీజిల్ లోడుతో వెళ్తోన్న గూడ్స్ రైలులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. చెన్నై పోర్టు నుంచి డీజిల్‌తో వెళ్తున్న గూడ్స్ రైలు తిరువళ్లూరు సమీపంలో ఒక్కసారిగా పట్టాలు తప్పింది. ఆ తర్వాత రైలులోని ఇంధన ట్యాంకర్‌కు మంటలు అంటుకున్నాయి.
భారీగా పొగ, మంటలు వ్యాపించాయి. రైలులో భారీగా ఇంధనం ఉండటంతో మంటలు శరవేగంగా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు అయిదు డీజిల్ ట్యాంకర్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందిన వెంటనే 10కి పైగా అగ్నిమాపక యంత్రాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. మంటలను ఆర్పివేశాయి.

మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. మంటలు మరింత వ్యాప్తి చెందకుండా ఉండటానికి పోలీసులు సమీపంలోని నివాస ప్రాంతాలను ఖాళీ చేయించారు. భద్రతా కారణాల దృష్ట్యా విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేశారు. రైల్వే ఓవర్ హెడ్ లైన్లల్లో విద్యుత్ సరఫరాను ఆపివేశారు.
సంఘటన స్థలం నుంచి కొన్ని మీటర్ల వరకు మంటల సెగ వ్యాపించింది. వేల కొద్దీ లీటర్ల డీజిల్ ఉన్న ట్యాంకర్లు మంటల బారిన పడటం వల్ల దాని తీవ్రత చుట్టు పక్కల కొన్ని మీటర్ల వరకు పడింది. దట్టమైన పొగ అలముకుంది. భగభగమంటూ మంటలు వ్యాపించాయి. పేలుళ్లు సంభవించాయి.
భద్రతా కారణాల దృష్ట్యా ప్రమాద స్థలానికి సమీపంలోని ఇళ్లలో ఉన్న ఎల్‌పీజీ సిలిండర్లను సైతం తొలగించారు. మంత్రి ఎస్ఎం నాజర్ కూడా సంఘటనా స్థలాన్ని సందర్శించారు. తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ ఎం ప్రతాప్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం.
తిరువళ్లూరు జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి మేరకు సహాయక చర్యల కోసం 50 మంది రెస్క్యూ సిబ్బందితో కూడిన రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సంఘటనా స్థలానికి తరలించారు. కాగా ప్రమాదం జరిగిన స్థలం నుంచి 100 మీటర్ల దూరంలో పట్టాలపై పగుళ్లను గుర్తించారు రైల్వే అధికారులు. ఇది పలు అనుమానాలకు తెర తీసినట్టయింది.
రైలు సర్వీసులకు అంతరాయం
ఈ ఘటనతో తిరువళ్లూరులో దక్షిణ రైల్వే ఓవర్ హెడ్ విద్యుత్ సరఫరాను నిలిపివేసింది. ఎనిమిది రైళ్లను దారి మళ్లించింది. పలు రైళ్లను రద్దు చేసింది. అలాగే- హెల్ప్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేసింది. రైళ్ల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ప్రయాణికులు 044-25354151, 044-24354995 హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించవచ్చని సూచించింది.












Click it and Unblock the Notifications