విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖపట్నంలో ‘క్రిమినల్ గ్యాంగ్‌లు’: వాట్సాప్ గ్రూపు ద్వారా సెటిల్‌మెంట్లు, ‘మర్డర్ చేసి సొంతూరు వెళ్లిపోతున్నారు’

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
విశాఖపట్నం

హైపర్ బాయ్స్, దండుపాళ్యం, త్రీస్టార్ గ్యాంగ్, ఖాసీం గ్యాంగ్, చిట్టిమామూ గ్యాంగ్.. సినిమా టైటిళ్లకు సరిగ్గా సరిపోయేలా కనిపిస్తున్న ఈ పేర్లన్ని విశాఖ నగరంలోని క్రిమినల్ గ్యాంగ్స్ పేర్లు.

కొందరు గ్రూపులుగా ఏర్పడి గ్యాంగుల పేర్లు పెట్టుకుని విశాఖలో దందాలు, సెటిల్‌మెంట్లు చేస్తున్నారు. హైపర్ గ్యాంగ్ పేరుతో ఇటీవల కత్తులతో 8 మంది పోలీసులకు చిక్కారు.

విశాఖపట్నం

'టూరిస్టులే కాదు, నేరగాళ్లు వస్తున్నారు’

విశాఖ పర్యాటక నగరం... ఇక్కడికి అన్ని రాష్ట్రాల నుంచి పర్యటకులు వస్తుంటారు. టూరిస్టులతో పాటు విశాఖకు నేరస్థులు కూడా వస్తున్నారు.

నగరంలో ఏ నేరం జరిగినా, అది ఏ తరహా నేరమైనా.. దీని వెనుక ఏదో ఒక రాష్ట్రానికి చెందిన గ్యాంగు పేరు వినిపిస్తుంటుంది. గ్యాంగులుగా ఏర్పడి నేరాలు చేస్తున్న వీరు వారి ప్రాంతాల పేర్లతోనే చలామణీ అవుతున్నారు.

“బిహార్ చైన్ స్నాచర్స్, వెస్ట్ బెంగాల్ ఫేక్ నోట్ ముఠా, ఒడిశా హౌస్ బ్రేకర్స్, జార్ఖండ్ కిడ్నాపర్స్, కర్నాటక హిట్ మెన్స్, హరియాణా గ్యాంగ్, ఒడిశా గ్రూప్స్ వంటి పేర్లతో కొందరు నేరాలకు పాల్పడుతున్నారు. వీరంతా ఉపాధి, ఉద్యోగాల కోసం వివిధ రాష్ట్రాల నుంచి విశాఖకు వచ్చిన వారే. వీరి వద్ద సరైన ధ్రువపత్రాలు ఉండవు. దీంతో వీరిని పట్టుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. వీరిలో ఎక్కువ మంది గంజాయి వ్యాపారం చేస్తుంటారు. పోలీసులకు చిక్కిన ఈ గ్యాంగుల్లోని చాలా మంది ప్రస్తుతం జైళ్లలో ఉన్నారు. ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే నేర ముఠాల సంఖ్య తగ్గింది” అని ఏసీపీ గోవిందరావు చెప్పారు.

హైపర్ బాయ్స్

'లోకల్ గ్యాంగ్... హైపర్ బాయ్స్’

విశాఖకు చెందిన కొందరు యువకులు 'హైపర్‌ బాయ్స్‌’ పేరుతో ఓ వాట్సాప్‌ గ్రూపు ఏర్పాటు చేసుకుని సెటిల్‌మెంట్లు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందిందని నగర పోలీస్ కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్ చెప్పారు.

మారణాయుధాలు, గంజాయితో సంచరిస్తున్న హైపర్ బాయ్స్ టీంను అరెస్ట్ చేశామని, నగరంలో క్రైం వివిధ రూపాల్లో జరుగుతుందని ఆయన వివరించారు. తాను చిన్నతనంలో చూసిన విశాఖకకు, ఇప్పటి విశాఖకు చాలా తేడా ఉందన్నారు. సీపీ శ్రీకాంత్ విశాఖ వాసే.

“కంచరపాలెం ఊర్వశి జంక్షన్ వద్ద మారణాయుధాలతో అనుమానాస్పదంగా కొందరు వ్యక్తులు సంచరిస్తున్నట్లు సమాచారం వచ్చింది. అక్కడకు పోలీసులు వెళ్తే... ఎనిమిది మంది 6 కిలోల గంజాయితో దొరికారు. ఇంతకుముందు ఇలాగే ఇరానీ గ్యాంగ్ పేరుతో ఒక టీం సెటిల్‌మెంట్లు చేసేది. వడ్డీలకు డబ్బులు ఇచ్చేవారు కొందరు తమకు అప్పులు వసూలు కాకపోవడంతో, ఇటువంటి బృందాలను సంప్రదిస్తున్నారు. హైపర్ బాయ్స్ పేరుతో ఏర్పడిన గ్యాంగులోని సభ్యులంతా 20 నుంచి 25 ఏళ్ల వారే. గతంలో చిట్టిమామూ గ్యాంగ్, దండుపాళ్యం గ్యాంగ్ పేరుతో కూడా కొన్ని గ్యాంగులుండేవి. ఇప్పుడు వాటి సంఖ్య తగ్గింది. ఇప్పుడంతా సైబర్ నేరాలే ఎక్కువ” అని సీపీ శ్రీకాంత్ చెప్పారు.

పోలీస్ కమిషనర్ శ్రీకాంత్

'స్మార్ట్, సైబర్ నేరాల ముఠాలు పెరిగాయి’

గత కొంతకాలంగా విశాఖలో సైబర్ నేరాల సంఖ్య పెరిగింది. అన్‌లైన్ ద్వారా సరికొత్త మోసాలు వెలుగులోకి వస్తున్నాయని పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ చెప్పారు.

''గత కొంత కాలంగా విశాఖలో నేరాల సంఖ్య పెరుగుతోంది. వీటిని నియంత్రించే విషయంలో పోలీసులు చాలా చర్యలు తీసుకున్నారు. ఇక్కడ పెరుగుతున్న జనాభాతో పాటు కొత్త నేరాలు కూడా ఎదురవుతున్నాయి’’అని ఆయన అన్నారు.

“సైబర్ క్రైం గత రెండు, మూడు సంవత్సరాలుగా చాలా ఎక్కువగా రిపోర్ట్ అవుతోంది. సైబర్ క్రైం బాధితులు పెరుగుతున్నారు. ప్రధానంగా సైబర్ నేరాలపై అవగాహన లేకపోవడం, ఫోన్‌కు వచ్చే ప్రతి లింక్‌పై క్లిక్ చేయడం వంటి పనుల వల్ల మన సమాచారాన్ని మనమే నేరగాళ్లకు అందిస్తున్నాం. సరైన సైబర్ సెక్యూరిటీ ఉన్న ఫోన్లను, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను వాడకపోవడమే వల్లే ఈ నేరాలు ఎక్కువ అవుతున్నాయి. మేం వీటిపై ప్రజలకు వివిధ రూపాల్లో అవగాహన కల్పిస్తున్నాం” అని పోలీస్ కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్ చెప్పారు.

హైపర్ గ్యాంగ్ నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలు

'క్రైం అంటే తెలిసేది కాదు’

''విశాఖ అంటే ప్రకృతి అందాలకు నెలవు. అందుకే ఈ నగరమంటే నాకు ఎంతో ఇష్టం. 50 ఏళ్ల క్రితం విశాఖలో పెద్దగా నేరాలు జరిగినట్లు గుర్తే లేదు. అంత ప్రశాంత నగరం ఇది. అయితే క్రమంగా ఈ నగరం కూడా నేరాలకు నిలయంగా మారిపోయింది, ప్రతి రోజూ ఏదో ఒక క్రైం వార్త వింటూనే ఉన్నాం’’అని విశాఖకు చెందిన సీనియర్ సిటిజన్ శాంతారాం అన్నారు.

“నేను ఏవీఎన్ కాలేజీలో చదువుకునే వాడిని. 1966లో విశాఖ జనాభా దాదాపు 4 లక్షలు. ఇప్పుడు 23 లక్షలకు చేరింది. నేను ఏవీఎన్ కాలేజీలో చదువుకునే రోజుల్లో వన్‌టౌన్ ఏరియాలో ఒక దొంగతనం జరిగిందని అంతా అనుకున్నారు. అప్పుడు కాలేజీ నుంచి స్నేహితులతో కలిసి అక్కడకు వెళ్లాం. అక్కడ చాలా హడావిడిగా ఉంది. ఆ ఘటనపై మూడు, నాలుగు రోజులు చర్చ జరిగింది. అక్కడ ఒక మహిళ మంగళసూత్రాన్ని మెడలో నుంచి లాక్కునిపోయారు. అదే ఇప్పుడైతే రోజు రక్తం, హింసకు సంబంధించిన వార్తలు చూడకుండా, వినకుండా గడవటం లేదు” అని శాంతారాం చెప్పుకొచ్చారు.

'మర్డర్ చేసి సొంతూరు వెళ్లిపోతున్నారు’

''విశాఖపట్నంలో జర్నలిస్టుగా పనిచేసేటప్పుడు, అంటే 35ఏళ్ల క్రితం క్రైం వార్తల కోసం తిరిగే వాళ్లం. రోజుకు ఒకటో రెండో తగిలేవి. అవి కూడా పిక్ పాకెటింగ్, ఇంటి వద్ద వస్తువులు ఎత్తికెళ్లిపోవడం, మహిళలు, పిల్లలు వంటిపై బంగారం ఉంటే వాటిని మాయమాటలు చెప్పి పట్టుకుపోవడం ఇలాంటివివే ఉండేవి’’అని ఆంధ్రా యూనివర్సిటీ జర్నలిజం విభాగాధిపతి డీవీఆర్ మర్తి చెప్పారు.

“ఒకప్పుడు గ్యాంగులు కనిపించేవి కాదు. కానీ ఇప్పుడు విశాఖలో నేరస్థుల ముఠాలు చాలా కనిపిస్తున్నాయి. పది మంది వరకు ఒక జట్టుగా ఏర్పడి నేరాలు చేస్తున్నారు. వీరంతా కూడా 25 ఏళ్ల వయసు లోపు వారే ఉంటున్నారు. ఇటీవల కత్తులతో పోలీసులకు చిక్కిన హైపర్ బాయ్స్ గ్యాంగ్ అలాంటిందే. పైగా వీరు వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకుని, దాని ద్వారా ఎవరైనా సంప్రదించవచ్చునంటూ చెప్పడం ఆశ్చర్యంగా అనిపించింది. గతంలో ఉపాధి అవకాశాల పేరుతో విశాఖకు వచ్చి ఇక్కడ నేరం చేసి, తమ రాష్ట్రాలకు వెళ్లిపోయే వారు. కానీ ఇప్పుడు ఇక్కడే ఉండిపోయి కొందరు హైపర్ బాయ్స్, ఖాసీం గ్యాంగ్, చిట్టిమామూ గ్యాంగ్ పేర్లతో నేరాలు చేస్తున్నారు.” అని డీవీఆర్ మూర్తి చెప్పారు.

విశాఖపట్నం

''ఈ కల్చర్ విశాఖకి కొత్తే, కానీ...’

విశాఖ నగరంలో సెప్టెంబర్ 20వ తేదీన ఒకే రోజు గాజువాక, సుజాతనగర్, పెందుర్తిలో మూడు హత్యలు జరిగాయి. ఒక వైపు క్రిమినల్ గ్యాంగ్స్, మరో వైపు నగరంలో జరుగుతున్న హత్యలతో నగర వాసుల్లో ఆందోళన పెరుగుతోంది.

ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు నగరంలో పెరుగుతున్న నేరాలపై ఆందోళన కూడా నిర్వహించాయి. పోలీసులు నేర నియంత్రణలో విఫలమయ్యారంటూ సీపీఐ పార్టీ విమర్శలు చేసింది.

''విశాఖలో క్రిమినల్ గ్యాంగ్స్ ఒకప్పుడు ఒకటో, రెండో ఉండేవి. అవి కూడా నగరంలోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యేవి. కానీ ప్రస్తుతం స్థానిక యువకులే క్రిమినల్ గ్యాంగ్స్ అంటూ తెలిసీతెలియని వయసులో మారణాయుధాలతో తిరగడం ఆందోళన కలిగిస్తోంది’’అని ఏయూ సోషల్ సైన్సెస్ రిటైర్డ్ ప్రొఫెసర్ దేవిప్రసాద్ అన్నారు.

“పెరుగుతున్న జనాభాతో పాటు మార్పు సహజమే కానీ, ఇలా నేరాలు పెరగడం మంచిది కాదు. పోలీసులు చెప్తున్న నేరాల సంఖ్యలో ఒక్క హత్యలే కాదు, అత్యాచారాలు, డ్రగ్స్, కిడ్నాపులు, హత్యాయత్నాలు, వైట్ కాలర్ నేరాలు, రియల్ ఎస్టేట్ మోసాలు, చివరకు ఆత్మహత్యలు కూడా ఉంటాయి. అంటే ఇవి మన సమాజంలో చోటు చేసుకుంటున్న మార్పుని సూచిస్తూ, ప్రజలపై ప్రభావం చూపుతాయి” అని దేవి ప్రసాద్ చెప్పారు.

'నియంత్రిస్తున్నాం’

నగరంలో హల్‌చల్ చేస్తున్న గ్యాంగుల్లో సభ్యులు ఈ మధ్య కాలంలో గంజాయి కేసుల్లో దొరుకుతున్నారు. హైపర్ బాయ్స్‌ను పట్టుకున్నప్పుడు కూడా మారణాయుధాలతో పాటు గంజాయి కూడా దొరికింది.

'త్రీ స్టార్ గ్యాంగ్, హైపర్ బాయ్స్, దండుపాళ్యం బ్యాచ్, చిట్టిమామూ గ్యాంగ్, ఖాసీం గ్యాంగ్ ఇలాంటి గ్యాంగులను ఇటీవల కాలంలో పట్టుకున్నాం. వీరంతా గంజాయి కేసుల్లో దొరికిన వారే. గ్యాంగులుగా ఏర్పడి నేరాలకు పాల్పడుతున్నారు. ఈజీ మనీ కోసం కొందరు స్థానిక యువకులే ఇలా చేస్తున్నారు. ఇటువంటి వారిపై దృష్టి పెట్టి.. వారికి, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వడం జరుగుతోంది” అని ఏసీపీ గోవిందరావు చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
'Criminal gangs' in Visakhapatnam: Settlements through WhatsApp group, 'Murder and going home'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X