బెంగాల్‌లో బాంబు పేలుళ్లు... ఒకరి మృతి... ఆరో విడత పోలింగ్‌కు ముందు కలకలం...
బెంగాల్‌లో ఆరో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు ముందు మూడు వేర్వేరు చోట్ల పేలుళ్లు చోటు చేసుకున్నాయి. పోలింగ్ జరగనున్న నియోజకవర్గాల పరిధిలో మంగళవారం(ఏప్రిల్ 20) నాటు బాంబు పేలుళ్లు కలకలం సృష్టించాయి. ఈ పేలుళ్లలో ఒకరు మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు.
24 నార్త్ పరగణాలు జిల్లాలోని తితాగఢ్‌లో ఉన్న జీసీ రోడ్‌లో మొదటి పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఇద్దరు గాయపడగా... రాజ్‌కిశోర్ జాదవ్(28) అనే యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం(ఏప్రిల్ 21) తెల్లవారుజామున మృతి చెందాడు. మరో వ్యక్తి ప్రస్తుతం కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఇదే తితాగఢ్‌లో ఎన్‌జేఎంసీ పత్తి మిల్లు ప్రాంతంలో గుర్తు తెలియని దుండగులు కొందరు నాటు బాంబులు విసిరి పారిపోయారు. అక్కడికి సమీపంలోనే బీజేపీ నేత సంతోష్ జేనా ఇల్లు ఉండటం గమనార్హం. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు రెండు పేలని నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. తితాగఢ్ బరాక్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పరిధిలో ఉన్నది. గురువారం(ఏప్రిల్ 22) ఇక్కడ ఆరో విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది.
మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జగత్‌దల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని భట్‌పారా ప్రాంతంలోనూ నాటు బాంబుల కలకలం రేగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆ ప్రాంతంలో నాటు బాంబులు విసిరారని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాని వెనుక బీజేపీ నేతలే ఉన్నారని ఆరోపించారు. అయితే పోలీసులు మాత్రం అక్కడ ఎలాంటి బాంబులు దొరకలేదని స్పష్టం చేశారు. జగత్‌దల్ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ గురువారం పోలింగ్ జరగనుంది.
బెంగాల్‌లో మొత్తం ఎనిమిది విడతల్లో పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. నాలుగో,ఐదో విడత ఎన్నికల పోలింగ్ హింసాత్మకంగా మారడంతో ఈసీ మరింత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. దాదాపు 1071 కంపెనీల కేంద్ర బలగాలను రంగంలోకి దించారు. ఆరో విడతలో మొత్తం 43 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనున్నాయి. ఈ స్థానాల్లో మొత్తం 306 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
కరోనా తీవ్రత నేపథ్యంలో ఆరు,ఏడు,ఎనిమిదో విడతల ఎన్నికల పోలింగ్‌ను ఒకే దఫాలో నిర్వహించాలన్న తృణమూల్ కాంగ్రెస్ ప్రతిపాదనను ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. అందుకు అవకాశం లేదని స్పష్టం చేసింది. తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే పోలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. మే 30తో ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగుస్తున్నందునా ఎన్నికలు వాయిదా వేయడం కుదరదని తెలిపింది.












Click it and Unblock the Notifications