యూపీలో దళిత బాలుడిపై దాష్టీకం; మోకాళ్ళపై కూర్చోబెట్టి, కాళ్ళు నాకించిన దారుణం; వీడియో వైరల్
ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75సంవత్సరాలు కావస్తున్నా, శాస్త్ర సాంకేతిక రంగాలలో అన్నిటిలో అభివృద్ధి చెందుతున్నా దళితులపై ఇంకా వివక్ష మాత్రం కొనసాగుతుంది అని చెప్పడానికి ఇటువంటి ఘటనలు ఉదాహరణగా చూపించవచ్చు.

దళిత బాలుడిపై రాయబరేలిలో దాష్టీకం
ఉత్తరప్రదేశ్ లోని రాయబరేలిలో జరిగిన కుల ఆధారిత హింస యొక్క షాకింగ్ సంఘటనలో, దళిత వర్గానికి చెందిన మైనర్ బాలుడిపై దాడి చేసి, అతడిని దారుణ హింసకు గురి చేసిన ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మైనర్ బాలుడిని అగ్ర వర్ణాలకు చెందిన కొందరు యువకులు ఘోరంగా అవమానించారు.

నాలుకతో కాళ్ళు నాకమని హుకుం... భయంతో చేసిన బాలుడు
సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన 2 నిమిషాల 30 సెకన్ల వీడియో బాలుడు తన చెవులు పట్టుకుని గుంజీలు తీస్తూ నేలపై కూర్చున్నట్టు ఉంది. ఆపై నిందితులు మోటారు బైక్ లపై కూర్చొని బాధితుడిని తీవ్రంగా దూషించారు. బాధితుడు నేలపై నేరం చేసినట్టు కూర్చోబెట్టారు. భయంతో వణికిపోతున్న బాలుని చూసి వారిలో కొందరు పైశాచికంగా నవ్వుకున్నారు. ఆపై బాలుడిని సదరు వ్యక్తులు తమ కాళ్ళు నాలుకతో నాకమని హుకుం జారీ చేయగా, భయంతో ఉన్న బాలుడు నాలుకతో వారి కాళ్ళను నాకాడు.

కేసు నమోదు.. ఏడుగురు అరెస్ట్
దాడికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 10న ఈ ఘటన జరిగిందని, బాధితులు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో అరెస్ట్ చేశామని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో నిందితులు కొందరు అగ్రవర్ణాలకు చెందిన వారు. బాధితుడైన విద్యార్థి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసాడని, ఆ తర్వాత అతనిపై దాడి చేసిన వారిపై చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద ఉత్తర ప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేసారు. అదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అని అశోక్ సింగ్, సీనియర్ పోలీసు అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.

పొలంలో పని చేసిన డబ్బులు అడిగినందుకు.. యూపీలో దారుణం
బాధితుడు 10వ తరగతి విద్యార్థి. అతను తండ్రి మరణించడంతో తల్లితో కలిసి జీవనం సాగిస్తున్నాడు. బాధితుడి తల్లి కొంతమంది నిందితుల పొలాల్లో పని చేసిందని, ఆ పని కోసం బాలుడు వారిని డబ్బు అడిగేందుకు వెళ్లిన క్రమంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకున్నట్లుగా స్థానిక నివేదికలు సూచిస్తున్నాయి. డబ్బులు అడిగినందుకు కోపంతో నిందితులు బాలుడిని పట్టుకుని నోటికొచ్చినట్టు తిట్టి, దాడి చేసి నిందితుల్లో ఒకరి పాదాలను నాకమని బలవంతం చేసినట్లు తెలుస్తోంది. దళిత మైనర్ బాలునిపై జరిగిన ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications