భారత్ లో క్షీణిస్తున్న కరోనా సెకండ్ వేవ్ ..40 వేల దిగువకు కొత్త కేసులు, తగ్గుతున్న మరణాలు
భారతదేశంలో నేడు కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. 40 వేల కంటే తక్కువగా కరోనా కేసులు నమోదు కావటంతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే ప్రజలు మళ్లీ సాధారణ జీవితాన్ని కొనసాగించటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక భారతదేశంలో తాజాగా నమోదైన కేసులు కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తగ్గుతుందని స్పష్టంగా సూచిస్తున్నాయి.

గత 24 గంటల్లో 37,566 కొత్త కేసులు , 907 మరణాలు
భారతదేశంలో గత 24 గంటల్లో 37,566 కొత్త కరోనావైరస్ కేసులను నివేదించగా, గత 24 గంటల్లో 907 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. నిన్న 46,148 కొత్త కేసులు నమోదు కాగా ఇక తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం భారీగా కేసులు తగినట్లుగానే తెలుస్తుంది. వంద రోజుల తర్వాత రోజువారీ కేసులు ఈ స్థాయిలో క్షీణించటం భారత్ కు భారీ ఊరట నిస్తుంది. కరోనా మహమ్మారి కారణంగా సోమవారం 979 మంది మరణించిన విషయం తెలిసిందే.

మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,03,16,897
ఇక 24 గంటల్లో మరణాల సంఖ్య పడిపోయిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం తెలుస్తుంది . గత 24 గంటల్లో 907 మంది మహమ్మారికి బలయ్యారు. దీంతో కరోనా కారణంగా ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 397,637 కు చేరుకుంది. ఇక ప్రస్తుతం భారతదేశంలో ఉన్న మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,03,16,897 కు చేరుకుందని వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి.గత 24 గంటల్లో రికవరీ అయిన వారి సంఖ్య 56,994 గా నమోదు కాగా, సోమవారం, కరోనా మహమ్మారి నుండి కోలుకున్న రోగుల సంఖ్య 58,578. దేశం యొక్క రికవరీ రేటు 96.80 శాతంగా ఉంది.

ఐదున్నర లక్షలకు తగ్గిన కరోనా క్రియాశీల కేసులు
దేశం యొక్క క్రియాశీల కేసుల సంఖ్య 5,52,659 కు తగ్గింది. భారతదేశంలో చురుకైన కేసులు మొత్తం కేసులలో 1.89 శాతం ఉన్నాయి.ఆరోగ్య పరీక్షల మంత్రిత్వ శాఖ సోమవారం దేశ పరీక్షా సామర్థ్యాన్ని మరింత పెంచుతోందని పేర్కొంది. డేటా ప్రకారం, సోమవారం వరకు, దేశంలో కరోనా మహమ్మారిని గుర్తించడానికి 600 మిలియన్లకు పైగా పరీక్షలు జరిగాయి. కోవిడ్ -19 కు వ్యతిరేకంగా టీకా డ్రైవ్‌లో దేశం సోమవారం ఒక మైలురాయిని సాధించింది.

దేశంలో 320 మిలియన్లకు పైగా వ్యాక్సిన్ డోసులు
ఇప్పటి వరకు ఇచ్చిన మొత్తం వ్యాక్సిన్ మోతాదుల పరంగా అమెరికాను అధిగమించింది. జనవరి 16 న ప్రపంచంలోనే అతిపెద్ద టీకా డ్రైవ్ ప్రారంభమైనప్పటి నుండి దేశంలో 320 మిలియన్లకు పైగా వ్యాక్సిన్ మోతాదులను అందించారు. ఇంకా దేశ ప్రజలందరికీ వ్యాక్సినేషన్ త్వరితగతిన సాగించడానికి యుద్ధ ప్రాతిపదికన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. కరోనా థర్డ్ వేవ్ రాకముందే సగానికిపైగా జనాభాకు వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకొని ప్రభుత్వాలు ముందుకు వెళుతున్నాయి.












Click it and Unblock the Notifications