Bihar Polls: తొలిదశలో బీహార్ లెక్క తేలిపోయిందా ? చరిత్ర ఏం చెబుతోంది ?
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి దశ పోలింగ్ పూర్తయింది. వచ్చేవారం రెండోదశ పోలింగ్ కూడా జరగబోతోంది. అయితే తొలి దశ పోలింగ్ లో రికార్డు స్ధాయిలో 64.66 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లో అతి కొద్దిసార్లు మాత్రమే ఇలా 60 శాతం పైగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ఈసారి కూడా అలాగే జరగడంతో ఎన్నికల్లో ఎన్డీయే, మహాకూటమిలో ఎవరు గెలవబోతున్నారనే దానిపై దాదాపు క్లారిటీ వచ్చేసిందన్న చర్చ జరుగుతోంది.
గతంలో బీహార్ లో పోలింగ్ శాతాల ఆధారంగా అధికార పీఠంపై ఎవరు కూర్చోవాలన్నది ఓటర్లు తేల్చేసిన చరిత్ర ఉంది. లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ మధ్య గతంలో జరిగిన పోరులోనూ ఇలాగే పోలింగ్ శాతాలే విజేతల్ని నిర్ణయించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 60 శాతం పోలింగ్ దాటితే లాలూ ప్రసాద్ యాదవ్ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసేవారు. 60 శాతం కంటే లోపు పోలింగ్ జరిగినప్పుడల్లా నితీశ్ కుమార్ గెలిచి సీఎం అయ్యేవారు. దీంతో ఈ 60 శాతం పోలింగ్ కు ఇక్కడ ప్రత్యేకత ఏర్పడింది.

ఈసారి బీహార్ తొలి దశ ఎన్నికల్లో 64.66 శాతం పోలింగ్ నమోదు కావడంతో విజయం తమదంటే తమదని ఎన్డీయేతో పాటు మహాకూటమి నేతలు కూడా చెప్పుకుంటున్నారు. చరిత్రను గమనిస్తే 45.85 శాతం పోలింగ్ మాత్రమే నమోదైన 2005ఎన్నికల్లో నితీశ్ కుమార్ గెలిచి సీఎం అయ్యారు. 2010లో నితీష్ కుమార్ నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్లగా.. 52.73 శాతం పోలింగ్ నమోదైంది. దీంతో ఆయనే సీఎం కాగలిగారు.
2015లో నితీష్ కుమార్ తన బద్ద విరోధి లాలూ ప్రసాద్ యాదవ్ తో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తే 52.73 శాతం పోలింగ్ నమోదైంది. దీంతో నితీష్ మరోసారి సీఎం అయ్యారు. 2020 ఎన్నికల్లోనూ 57.29 శాతం పోలింగ్ నమోదు కాగా.. మరోసారి నితీష్ సీఎం పీఠం కైవసం చేసుకున్నారు. అయితే గతంలో 1990లో లాలూ ప్రసాద్ సీఎం అయినప్పుడు 62.04 శాతం పోలింగ్ నమోదైంది. అలాగే 1995లో 61.79 శాతం పోలింగ్ నమోదై మరోసారి లాలూ సీఎం అయ్యారు. 2000 సంవత్సరంలో 62.75 శాతం పోలింగ్ నమోదు కాగా.. లాలూ భార్య రబ్రీదేవి సీఎం అయ్యారు.

అంతే కాదు గతం కంటే 5 శాతం పోలింగ్ పెరిగితే ప్రభుత్వం కచ్చితంగా మారింది. ఈసారి ఏకంగా గతంతో పోలిస్తే 8.5 శాతం ఎక్కువ పోలింగ్ నమోదైంది. 2020లో 56.1 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈసారి 64.66 శాతం పోలింగ్ జరిగింది. దీంతో బీహార్ లో ప్రభుత్వ మార్పు తథ్యమన్న చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications