ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా రాజీనామా
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ ఢిల్లీ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలైన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎంసీడీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 134 సీట్లు సాధించగా.. బీజేపీ 104 స్థానాల్లో దక్కించుకుని రెండో స్థానంలో నిలిచింది.
క్లిష్ట పరిస్థితుల్లో కూడా బీజేపీకి 104 సీట్లు కట్టపెట్టిన ఢిల్లీ ప్రజలకు ఆదేశ్ గుప్తా ధన్యవాదాలు తెలిపారు. పార్టీ గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన బీజేపీ కార్యకర్తలు, నాయకులను అభినందించారు. కాగా, 2012 నుంచి మొన్నటి వరకు ఎంసీడీని బీజేపీనే పాలిస్తుండటం గమనార్హం.

ఎంసీడీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవిని వీడినట్లు గుప్తా తెలిపారు. ప్రస్తుతం ఎంసీడీలో బలమైన ప్రతిపక్ష పాత్రను బీజేపీ పోషిస్తుందని ఆదేశ్ గుప్తా వ్యాఖ్యానించారు. తాము మేయర్ పోస్టును దక్కించుకునేందుకు ఎలాంటి ప్రయత్నం చేయడం లేదని స్పష్టం చేశారు.
కాగా, ఈ ఏడాది మొదట్లో ఛండీగ్ మున్సిపల్ ఎన్నికల్లో 35 స్థానాలకు గానూ 14 సీట్లు సాధించి ఆప్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. అయితే, మేయర్ పదవిని మాత్రం అత్యధిక స్థానాలు దక్కించుకున్న బీజేపీ కైవసం చేసుకుంది.
ఎంసీడీలోని 250 మంది కౌన్సిలర్లు, ఏడుగురు లోక్ సభ ఎంపీలు, ముగ్గురు రాజ్యసభ ఎంపీలు, 14 మంది స్పీకర్ నామినేట్ చేసిన ఎమ్మెల్యేలు కలిసి మేయర్‌ను ఎన్నుకుంటారు. కాగా, 2020లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమితో అప్పటి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మనోజ్ తివారీ తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు ఎంసీడీ ఓటమితో గుప్తా ఆ పదవికి రాజీనామా చేశారు. గుప్తా రాజీనామాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదించారు. ఢిల్లీ బీజేపీ ఉపాధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు.












Click it and Unblock the Notifications