కేజ్రీవాల్‌పై పోరు: 6- పీ ఫార్ములాతో బేడీ సంకేతాలు
న్యూఢిల్లీ: పాత మిత్రులు కొత్త ఢిల్లీలో కొత్తగా పోరులోకి దిగారు. ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌ను ఎదుర్కోవడానికి బిజెపి తరఫున బరిలోకి దిగిన కిరణ్ బేడీ సిద్ధపడ్డారు. ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజల సమస్యల పరిష్కారానికి 6-పి ఫార్ములాను అమలు చేస్తామని ఆ పార్టీ ప్రచార సారధి కిరణ్ బేడీ అన్నారు. బీజేపీలో చేరిన కిరణ్ బేడీ శనివారం పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే ఆమె 6-పి ఫార్ములాను ప్రతిపాదించారు. ఆ రకంగా బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థిని తానేనని కిరణ్ బేడీ సంకేతాలు ఇచ్చారు.
సమావేశం తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ ప్రజలు అనునిత్యం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక వ్యవస్థను రూపొందిస్తామని చెప్పారు. కిరణ్ బేడీ పేర్కొన్న 6-పీ ఫార్ములాలో జైళ్ళ సంస్కరణలు (ప్రిజన్స్), వేగవంతమైన కేసుల విచారణ (ప్రాసిక్యూషన్), ప్రజలకు చేరువలో ప్రభుత్వం (పబ్లిక్ ఔట్ రీచ్), తల్లిదండ్రులకు సహాయం (పేరెంట్స్), పోలీస్ వ్యవస్థ మెరుగుదల, కమ్యూనిటీ పోలీసింగ్ (పోలీస్), మీడియా వ్యవహారాలు (ప్రెస్) ఉన్నాయి.

తాము ప్రతిపాదించిన అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని చెప్పారు. ఈ పనులన్నీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి నేరుగా జరుగుతాయన్నారు. మహిళల భద్రతలో ఎలాంటి లోటుపాట్లున్నాయనే విషయాలపై సమీక్ష చేపడతామని కిరణ్ బేడీ చెప్పారు. ఎవరికి ఎలాంటి సాయం కావాలన్న అంశాలపై మీడియా, పోలీసులు తమకు సమాచారం అందిస్తారని అన్నారు. ఢిల్లీలో స్వచ్ఛంద సంస్ధలు ఎంతో కృషి చేస్తున్నాయని, స్వచ్ఛంద సంస్థలనూ కలుపుకుని పోతామని ఆమె తెలిపారు.
కాగా కిరణ్ బేడీ వ్యాఖ్యలతో ఢిల్లీ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్ధి తానేననే సంకేతాన్ని ఆమె పరోక్షంగా వెల్లడించినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు కిరణ్ బేడీ నాయకత్వాన్ని ఢిల్లీ కార్యకర్తలు కూడా స్వాగితిస్తున్నారు. ఇదిలాఉండగా ఆమ్‌ఆద్మీకి ధీటుగా, ఆ పార్టీని ఎన్నికల్లో ఓడించడానికి కిరణ్ బేడీ నాయకత్వం సరైనదనే యోచనలో బిజేపీ అధినాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా కిరణ్ బేడీ పేరును ఖరారు చేసే అవకాశం ఉందని ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications