అరవింద్ కేజ్రివాల్ కు సీబీఐ షాక్-లిక్కర్ స్కాంలో ఎల్లుండి విచారణకు రావాలని నోటీసులు..
ఢిల్లీ మద్యం కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. ఇవాళ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ కు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ డిప్యూటీ సీఎంగా ఉన్న మనీష్ సిసోడియాను అరెస్టు చేసిన సీబీఐ.. ఇప్పుడు కేజ్రివాల్ ను విచారణకు రావాలంటూ నోటీసులు పంపింది. ఎల్లుండి ఆదివారం విచారణకు రావాలని ఈ నోటీసుల్లో పేర్కొంది. దీంతో ఇప్పుడు సీబీఐ నోటీసుల వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
ఢిల్లీలో గతంలో రూపొందించిన మద్యం పాలసీ ప్రకారం ఆప్ నేతలతో పాటు పలువురు సౌత్ గ్రూప్ సభ్యులకు ముడుపులు అందాయని సీబీఐ ఆరోపిస్తోంది. ఇప్పటికే సౌత్ గ్రూప్ సభ్యులతో పాటు ఆప్ కీలక నేత అయిన మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టులు చేసింది. అయితే ఈ కేసులో తదుపరి దర్యాప్తులో భాగంగా ఇప్పుడు కేజ్రివాల్ కు నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆప్ వర్గాలు స్వయంగా నిర్ధారించాయి.

ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో కేంద్రం, సీబీఐ తీరుపై మండిపడుతున్న కేజ్రివాల్.. ఇప్పటికే ఆప్ కీలక నేత మనీష్ సిసోడియాఅరెస్టును తప్పుబడుతున్నారు. అయితే నిర్దిష్ట ఆధారాలతో సీబీఐ ముందుకెళ్తున్న నేపథ్యంలో వీటిని అడ్డుకునేందుకు ఆప్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు.ఇప్పుడు సీబీఐ విచారణకు కేజ్రివాల్ హాజరవుతారా లేదా అన్నది చూడాల్సి ఉంది. ఒకవేళ సీబీఐ విచారణకు వెళ్లకపోతే కేజ్రివాల్ ఏం చేయబోతున్నారనేది కూడా ఉత్కంఠ రేపుతోంది.













Click it and Unblock the Notifications