'అతను' గుజరాత్ రాకుండా ఉంటే మోడీ గెలిచినట్లే!?
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన కేసులో ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సీబీఐ మందు హాజరు కానున్నారు. కార్యాలయానికి బయలుదేరే ముందు తన తల్లి నుంచి ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ కేసులో దర్యాప్తు సంస్థకు పూర్తిగా సహకరిస్తానన్నారు. ట్విటర్ లో సిసోడియా వరుసగా ట్వీట్లు చేశారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఉండేందుకే కేంద్రం ఇలా చేస్తోందని, తనను నకిలీ కేసులో అరెస్ట్ చేయబోతున్నారని ప్రకటించారు.

మోడీకి ఓటమి భయం పట్టుకుంది
గుజరాత్ ప్రచారానికి వెళ్లకుండా ఆపడమే వారి ఉద్దేశమని, సొంత రాష్ట్రంలో ఓటమిపాలవుతామని వారికి భయం పట్టుకుందని, బీజేపీ ప్రణాళికలో భాగంగా తనను ఒక నకిలీ కేసులో అరెస్ట్ చేయబోతున్నారని సిసోడియా వెల్లడించారు. తాను గుజరాత్ ప్రచారానికి వెళ్లినప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి అద్భుతమైన పాఠశాలలు అక్కడ కూడా నిర్మిస్తానని ప్రజలకు చెప్పానని, కానీ అది కొందరు పెద్దలకు నచ్చడంలేదన్నారు. తనను జైలుకు పంపించడంవల్ల ఈ ప్రచారం ఆగదని, రానున్న రోజుల్లో ఎన్నికలు ఉద్యమంలా మారబోతున్నాయన్నారు.

తప్పు చేయనప్పుడు సాక్ష్యాలు ఎలా వస్తాయి?
తన ఇంట్లో సోదాలు నిర్వహించారని, వారికి ఏమీ దొరకలేదని, ఈరోజు కూడా వారికి ఏమీ దొరకదన్నారు. అసలు తప్పే చేయనప్పుడు ఎక్కడి నుంచి సాక్ష్యాలు పుట్టిస్తారని మనీష్ ప్రశ్నించారు. తనను జైలులో పెట్టి బీజేపీ ఎన్నికల్లో విజయం సాధించలేదని వ్యాఖ్యానించారు. సిసోడియాకు సీబీఐ సమన్లు జారీచేయడంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మండిపడ్డారు. ఉప ముఖ్యమంత్రి సిసోడియా, ప్రస్తుతం జైల్లో ఉన్న మంత్రి సత్యేంద్ర జైన్ నేటి తరం భగత్‌సింగ్‌లని ఆయన అభివర్ణించారు. కేంద్రంతో ఆప్ ప్రభుత్వం చేస్తోన్న పోరాటాన్ని రెండో స్వాతంత్య్ర సంగ్రామంతో కేజ్రీవాల్ పోల్చారు.

ఆప్ ను నియంత్రించినట్లుగా ప్రజలను నియంత్రించలేరు!
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటికే సీబీఐ పలువురిని అరెస్ట్ చేసింది. ఆప్ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందంటూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈడీతో, సీబీఐతో దాడులు చేయిస్తోందని అరవింద్ కేజ్రీవాల్ నిప్పులు చెరుగుతున్నారు. గుజరాత్ లో ఓటమి భయం పట్టుకోవడంవల్లే ఇలా చేస్తున్నారని, ప్రచారంలో పాల్గొనకుండా తమను నియంత్రించినట్లుగా ప్రజలను నియంత్రించలేరన్నారు. హిమాచల్ ప్రదేశ్ తోపాటు గుజరాత్ కు కూడా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాల్సి ఉన్నప్పటికీ ఎన్నికల సంఘం వాయిదా వేసింది. బీజేపీ నేతలు ప్రచారం చేయడానికి అనుకూలంగా ఉండేందుకే వారు వాయిదా వేయించారంటూ ఆప్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.












Click it and Unblock the Notifications