ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రకంపనలు.. హైదరాబాద్ తో పాటు 30ప్రాంతాల్లో ఏకకాలంలో ఈడీ దాడులు!!
దేశ రాజధాని ఢిల్లీలో ప్రకంపనలు రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తోంది. దేశంలోని 30 ప్రదేశాలలో ఈ దాడులు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీతో పాటు ముప్పై ప్రాంతాలలో ఏకకాలంలో దాడులు చేస్తున్న ఈడీ ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకుంది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రకంపనలు .. ఢిల్లీ తో పాటు అనేక చోట్ల ఈడీ దాడులు
ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇల్లు, ఆయన కార్యాలయం మినహా 30కి పైగా ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఢిల్లీతో పాటు, యూపీలోని లక్నో, హర్యానాలోని గురుగ్రామ్, చండీగఢ్, పంజాబ్, మహారాష్ట్రలోని ముంబై, తెలంగాణలోని హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తున్నారని, ఈ ఉదయం ప్రారంభమైన సోదాలు కొనసాగుతున్నాయని ఈడీ అధికారులు చెబుతున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్... సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఎఫ్ఐఆర్ ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కేసు నమోదు చేశారు . సిసోడియాను సీబీఐ తన ఎఫ్‌ఐఆర్‌లో నంబర్‌వన్‌గా పేర్కొంది. ఐపీసీలోని 120-B (నేరపూరిత కుట్ర) మరియు 477-A (ఖాతాల తప్పుడు సమాచారం) కింద సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది . మద్యం వ్యాపారులకు రూ.30 కోట్ల మినహాయింపు ఇచ్చారనే ఆరోపణలతో ఈ కేసు నమోదైంది . లైసెన్స్‌దారులకు వారి ఇష్టానుసారం గడువు పొడిగించారని , ఎక్సైజ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ పాలసీ రూల్స్ రూపొందించారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి .

ఢిల్లీ లిక్కర్ స్కామ్ నిందితుడు సమీర్ మహేంద్ర కార్యాలయాల్లో ఈడీ దాడులు
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, అప్పటి కమిషనర్ (ఎక్సైజ్) అర్వ గోపీ కృష్ణ, అప్పటి డిప్యూటీ కమిషనర్ (ఎక్సైజ్) ఆనంద్ తివారీ మరియు అసిస్టెంట్ కమిషనర్ (ఎక్సైజ్) పంకజ్ భట్నాగర్, ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో సిఫార్సులు చేయడంలో, నిర్ణయాలు తీసుకోవడంలో కీలక పాత్ర పోషించారని అభియోగాలున్నాయి. ఇక ఢిల్లీలో జోర్బాగ్ లోనో ఇండో స్పిరిట్ కంపెనీ ఎండి, కేసులో నిందితుడు అయిన సమీర్ మహేంద్ర కు సంబంధించిన ప్రాంతాలలో ఈడీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్ లోనూ ఈడీ సోదాలు ... సర్వత్రా ఉత్కంఠ
ఇదిలా ఉంటే ప్రస్తుతం మద్యం వర్తకులు ఉండే ప్రాంతాలలో ఈ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఉందని ఆరోపణలు దుమారం రేపిన కారణంగా హైదరాబాద్లోనూ ఈడీ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారంలో ఎవరి పేరు బయటకు వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications