
ఉలిక్కిపడ్డ రాజధాని: పూల మార్కెట్‌లో భారీ పేలుడుకు కుట్ర: పెద్ద మొత్తంలో ఐఈడీ
న్యూఢిల్లీ: ఏపీ, తెలంగాణ సహా దేశంలోని పలు రాష్ట్రాలు వేర్వేరు రూపాల్లో సంక్రాంతి పండగను జరుపుకొంటున్నాయి. పండగ కోలాహలం నెలకొని ఉంది. కరోనా వైరస్ ఆంక్షలు ఉన్నప్పటికీ.. మార్కెట్లన్నీ ఎప్పట్లాగే కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. మరోవంక- ఢిల్లీకి ఆనుకుని ఉన్న పంజాబ్, ఉత్తర ప్రదేశ్ సహా అయిదు రాష్ట్రాల్లో ఎన్నికల కోలాహలం నెలకొని ఉంది. అటు కేంద్రంలో, ఇటు ఢిల్లీలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, ఆమ్ ఆద్మీ.. ఎన్నికల ప్రచారంపై దృష్టి సారించాయి.

భారీ పేలుడుకు కుట్ర..
విస్తృతంగా పర్యటనలను నిర్వహిస్తోన్నాయి. ఈ పరిస్థితుల మధ్య భారీ పేలుడుకు కుట్ర పన్నారు గుర్తు తెలియని వ్యక్తులు. మారణకాండకు తెర తీయడానికి ప్రయత్నాలు చేశారు. పండగ వాతావరణం, ఎన్నికల కోలాహలం మధ్య విధ్వంసం సృష్టించడానికి పావులు కదిపారు.
ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. విఫలం అయ్యాయి. పేలుడుకు పాల్పడి దేశంలో అశాంతియుత వాతావరణం లేవదీయడానికి, నరమేధానికి పన్నిన కుట్రను పోలీసులు, భద్రత బలగాలు భగ్నం చేశారు. పెను విధ్వంసాన్ని సకాలంలో నివారించగలిగారు.

ఘాజీపూర్ మార్కెట్‌లో..
సకాలంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకోగలిగారు. పెను విధ్వంసాన్ని ఢిల్లీ పోలీసులు, నేషనల్ సెక్యూరిటీ గార్డులు సకాలంలో నివారించగలిగారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. విస్తృత దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన దేశ రాజధానిలో తాజాగా చోటు చేసుకుంది. ఢిల్లీలోనే అతిపెద్దదైన ఘాజీపూర్ కూరగాయలు, పూల మార్కెట్‌లో ఓ బ్యాగ్‌లో ఉంచిన ఇంప్రువైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ)ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాంబును డిఫ్యూజ్ చేయగలిగారు.

బ్యాక్‌ప్యాక్‌లో..
ఢిల్లీ తూర్పు ప్రాంతంలో ఉంటుందీ మార్కెట్. ఘాజీపూర్ కూరగాయలు, పూల మార్కెట్ ఎప్పట్లాగే ఇవ్వాళ కూడా కొనుగోలుదారులతో క్రిక్కిరిసిపోయి కనిపించింది. అదే సమయంలో మార్కెట్‌లో నల్లరంగు బ్యాక్‌ప్యాక్‌ను స్థానిక వ్యాపారులు గుర్తించారు. అది ఎవరిదంటూ ఆరా తీశారు. చాలాసేపటి నుంచి అది అలాగే పడి ఉండటంతో అప్రమత్తం అయ్యారు. స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘాజీపూర్ మార్కెట్ వద్దకు చేరుకున్నారు.

విస్తృత దర్యాప్తు..
బ్యాగులో పేలుడు పదార్థాలు ఉండొచ్చనే అనుమానంతో నేషనల్ సెక్యూరిటీ గార్డులకు సమాచారం ఇచ్చారు. తొలుత ఢిల్లీ పోలీసులకు చెందిన బాంబు డిస్పోజల్ స్క్వాడ్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బ్యాగ్‌ను తెరచి చూడగా.. అందులో పెద్ద మొత్తంలో ఐఈడీ కనిపించింది. వెంటనే చుట్టు పక్కల వారిని అప్రమత్తం చేశారు. ఖాళీ చేయించారు. బాంబును డిఫ్యూజ్ చేశారు.
అనంతరం దాన్ని నేషనల్ సెక్యూరిటీ గార్డులకు అందజేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టామని ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేష్ అస్థానా తెలిపారు. ఘాజీపూర్ మార్కెట్ కొనుగోలుదారులతో నిండిపోయిన సమయంలో పేలుడు సంభవించి ఉంటే ప్రాణనష్టం భారీగా ఉండేదనే అనుమానాలు పోలీసు వర్గాల్లో వ్యక్తమౌతున్నాయి.