ఏఏపీపై అవమ్ తీవ్ర ఆరోపణ, కిరణ్‌బేడీ నైస్ లేడీ కానీ సారీ: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీకి, ఆ పార్టీ సమన్వయకర్తకు వరుస షాకులు వస్తున్నాయి. పలువురు సీనియర్ నేతలు పార్టీని వీడారు. ఇప్పటికే హైకోర్టు ఆయన స్థానికత పైన నోటీసులు జారీ చేసింది. తాజాగా ఏఏపీ వాలంటీర్ యాక్షన్ మార్చ్ (అవమ్) కేజ్రీవాల్, ఏపీపీ పైన తీవ్ర ఆరోపణలు చేసింది.
సోమవారం నాడు ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అవమ్ సభ్యులు మాట్లాడారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఫండింగులో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. నాలుగు బోగస్ కంపెనీలు ఒక్కో కంపెనీ రూ.50 లక్షలు ఇచ్చినట్లుగా చెప్పారు.
తాము ఏఏపీ వెబ్ సైట్‌ను చూసామని, అన్నింటిని పరిశీలించామని, వారు పేర్కొన్న కంపెనీలు ఉన్నట్లుగా ఎక్కడా లేదన్నారు. అందులో ఓ కంపెనీ శాంతిలో ఉన్నట్లుగా చిరునామాలో పేర్కొన్నారని చెప్పారు. మొత్తం 31 బోగస్ కంపెనీలు ఫండ్స్ ఇచ్చినట్లుగా ఉందన్నారు. ఇది స్పష్టంగా మనీ లాండరింగ్ అని తెలుస్తోందన్నారు.

తాము నిరూపించలేని వాస్తవాలు ఏం చెప్పడం లేదన్నారు. క్లీన్ రాజకీయాలు అని పల్లె వేస్తుంటే.. అసలు డర్టీ పాలిటిక్స్ అంటే ఏమిటో చెప్పాలని ఎద్దేవా చేశారు.
ఇతర పార్టీల విషయమై ఎందుకు మాట్లాడటం లేదని విలేకరులు ప్రశ్నించారు. దానికి అవమ్ స్పందిస్తూ.. తాము క్లీన్ అని ఏఏపీ చెబుతోందని గుర్తు చేశారు.
కిరణ్ బేడీ నైస్ లేడీ... కేజ్రీవాల్
బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ అంటే తనకు ఇప్పటికీ అభిమానమేనని, ఆమె చాలా మంచి మహిళ అని, ఆమెను అభిమానిస్తానని చెప్పారు. ఆమెను చూస్తుంటే అయ్యోపాపం అనిపిస్తోందన్నారు. తనను విషపు మనిషి అంటూ కిరణ్ బేడీ చేసిన వ్యాఖ్యలపై ఆయన పైవిధంగా స్పందించారు.
తమ రాజకీయ ప్రయోజనాల కోసం కిరణ్ బేడీని బీజేపీ పావుగా వాడుకుంటోందన్నారు. ఈ విషయాన్ని ఆమె గుర్తించలేకపోతున్నారన్నారు. ఆమెతో చర్చకు సిద్ధమని చెప్పారు. కిరణ్ బేడీ పైన తాను వ్యక్తిగత విమర్శలు చేయలేదని, బీజేపీ నాయకులే తనను, తన కుటుంబాన్ని టార్గెట్ చేశారన్నారు.












Click it and Unblock the Notifications