ఆకాశంలో ఊగిపోయిన ఎయిర్ ఇండియా విమానం-ప్రయాణికులకు గాయాలు..
విమానం ఆకాశంలో ప్రయాణిస్తున్న సమయంలో కుదుపులకు గురైతే ఎలా ఉంటుందో గతంలో పలు ఘటనలు నిరూపించాయి. ఇవాళ అలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియాకు చెందిన ఓ అంతర్జాతీయ విమానం గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో తీవ్ర కుదుపులకు గురైంది. దీంతో ప్రయాణికులు ప్రాణాలు అరచేత్తో పెట్టుకుని విలవిల్లాడారు. కుదుపులకు వీరిలో కొందరు కింద పడిపోయారు. చివరికి విమానం సురక్షితంగా ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ల్యాండ్ అయింది.
ఢిల్లీ నుంచి సిడ్నీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా అంతర్జాతీయ సర్వీసు విమానం ఇవాళ ఆకాశంలో ఉండగా ఉన్నట్లుండి తీవ్ర కుదుపులకు గురైంది. డీజీసీఏ వర్గాల సమాచారం ప్రకారం విమానం కుదుపులకు గురి కావడంతో ఏడుగురు ప్రయాణికులు గాయపడ్డారు. అయితే వీరికి తీవ్ర గాయాలు కాలేదని తెలుస్తోంది. చివరికి సిడ్నీ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తర్వాత సదరు ప్రయాణికులకు అత్యవసర చికిత్స అందించినట్లు సమాచారం.

ఎయిర్ ఇండియా విమానం కుదుపులకు గురైన సమయంలో అదే విమానంలో ప్రయాణిస్తున్న ఓ డాక్టర్, ఓ నర్సు గాయపడ్డ వారికి అత్యవసర చికిత్స అందించినట్లు తెలుస్తోంది. అయితే విమానం కుదుపులకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. దీనిపై వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు డీజీసీఏ వర్గాలు వెల్లడించాయి. సాధారణంగా గాలి ఒత్తిడి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో విమానాలు ఇలా కుదుపులకు గురవుతుంటాయి. అయితే వీటిపై ముందుగానే సమాచారం ఉంటుంది. కానీ కొన్నిసార్లు అనూహ్యంగా గాల్లో ఒత్తిడి పెరిగితే ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి.












Click it and Unblock the Notifications