ఢిల్లీలో హై అలెర్ట్ : డ్రోన్స్ తో నిఘా, దుర్భేద్యమైన కోటని తలపిస్తూ ఢిల్లీలో భద్రత
కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. రిపబ్లిక్ డే రోజున కిసాన్ పరేడ్ ఘర్షణల తర్వాత , రైతులపై కేసులు పెట్టి అరెస్టులు చెయ్యటం , కొన్ని సంఘాలు ఆందోళన నుండి తప్పుకోవటంతో తిరిగి రైతుల ఉద్యమం కొనసాగుతుందా అన్న అనుమానాల నేపథ్యంలో కూడా, రైతులు ఉద్యమాన్ని వీడలేదు. ఇక తాజాగా 'చక్కాజామ్' ద్వారా కేంద్రం తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రతరం చేస్తామని, దేశవ్యాప్తంగా 12 గంటల నుండి మూడు గంటల మధ్య రాష్ట్ర జాతీయ రహదారులను దిగ్బంధించాలని రైతులు పిలుపునిచ్చారు. దీంతో ఢిల్లీలో చక్కా జామ్ కొనసాగనుంది.
రైతులపై నిందలు అందుకే , దీప్ సిద్దూను ఎందుకు అరెస్ట్ చెయ్యలేదు : సంజయ్ రౌత్ ఫైర్
దేశ రాజధాని ఢిల్లీలో మోహరించిన డ్రోన్ లు
ఢిల్లీ, యూపీ , ఉత్తరాఖండ్ మినహా మిగతా దేశమంతా 'చక్కా జామ్' ఉంటుందని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికాయత్ ప్రకటించారు.
రిపబ్లిక్ డే రోజున జరిగిన కిసాన్ పరేడ్ హింసాత్మక ఘటనల నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు ఢిల్లీ సరిహద్దుల భద్రతను కట్టుదిట్టం చేశారు. ఘాజీపూర్,తిక్రీ , సింఘూ వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. అంతేకాదు పరిస్థితిని పర్యవేక్షించడం కోసం దేశ రాజధాని వ్యాప్తంగా డ్రోన్లను మోహరించారు. డ్రోన్ల ద్వారా ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి రంగం సిద్ధం చేశారు. దుర్భేద్యమైన కోటని తలపిస్తూ ఢిల్లీలో భద్రత కొనసాగనుంది .
50 వేల మంది పోలీసులు, పారా మిలటరీ , రిజర్వు ఫోర్స్ సిబ్బందితో పహారా
50 వేల మంది పోలీసులు, పారా మిలటరీ , రిజర్వు ఫోర్స్ సిబ్బందితో ఢిల్లీ సరిహద్దుల్లో భారీగా బందోబస్తు నిర్వహిస్తున్నారు. రిపబ్లిక్ డే కిసాన్ పరేడ్ తరువాత రైతులు నిర్వహిస్తున్న అతి పెద్ద కార్యక్రమం కావడంతో అందరూ అలర్ట్ అయ్యారు.
మధ్యాహ్నం 12 గంటల నుండి మూడు గంటల వరకు నిర్వహించే చక్కా జామ్ తో ఢిల్లీలో ఎలాంటి ప్రభావం ఉండదని రైతు నాయకులు చెబుతున్నారు. ఎక్కడా హింసాత్మక ఘటనకు పాల్పడవద్దని పదేపదే హెచ్చరిస్తున్నారు.
సాగు చట్టాలను ఉపసంహరించుకోవాలని , రైతులపై నిరంకుశ విధానాలకు నిరసనగా చక్కా జామ్
ఇక ఢిల్లీలోనూ ఐటివో కూడలి వద్ద పోలీసులు బారికేడ్లతో పాటు ముళ్ళ కంచెలు ఉంచారు. బహుళస్థాయి భద్రతా ఏర్పాట్లను చేశారు. ఎర్రకోటకు సమీపంలో ఉన్న మింటో రోడ్డు వద్ద కూడా భారీగా బారికేడ్లను ఏర్పాటు చేశారు.
రైతులకు ఇంటర్నెట్ నిలిపివేత, సెక్యూరిటీ, ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన ప్రాంతాల చుట్టూ అదనపు భద్రతకు వ్యతిరేకంగా, కేంద్ర రైతులపై తీసుకుంటున్న నిరంకుశ విధానాలను నిరసిస్తూ ఈరోజు చక్కాజామ్ కొనసాగుతుంది.దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటికే 12 మెట్రో స్టేషన్లను అప్రమత్తం చేసిన అధికారులు, అన్ని విధాలుగా భద్రతా చర్యలు తీసుకుంటున్నారు . ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, డ్రోన్లను సైతం ఏర్పాటు చేసి పహారా కాస్తున్నారు.
రైతు సంఘాల నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని , ఎలాంటి అల్లర్లకు పాల్పడవద్దని పదే పదే చెప్తున్నారు .
వ్యవసాయ చట్టాల రద్దుకు నవంబర్ నుండి రైతుల ఆందోళనలు
గతేడాది నవంబర్ నుంచి పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తర ప్రదేశ్ సహా దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వేలాది మంది రైతులు కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేస్తున్నారు. వ్యవసాయ సంస్కరణలను రైతు వ్యతిరేకమని పిలుస్తూ నిరసనకారులు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) పై చట్టపరమైన హామీని కూడా వారు కోరుతున్నారు.