పంద్రాగస్టు గిఫ్ట్: రూ.5 భోజన క్యాంటీన్ల ఏర్పాటు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. అందుబాటులోకి తీసుకొచ్చిన అన్న క్యాంటీన్ల కాన్సెప్ట్ మరో రాష్ట్రంలో అమలులోకి రాబోతోంది.
దేశ రాజధానిలో అయిదు రూపాయలకే కడుపు నిండా భోజనం పెట్టేలా క్యాంటీన్లు ఏర్పాటు కానున్నాయి. వీటికి- అటల్ క్యాంటీన్ అని పేరు పెట్టింది అక్కడ ముఖ్యమంత్రి రేఖా గుప్తా సారథ్యంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం. అలాగే-ప్రతి మురికివాడ నివాసికి పక్కా గృహాలు అందిస్తామని ఆమె హామీ ఇచ్చారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి హోదాలో రేఖా గుప్తా తన తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. అయిదు రూపాయలకే భోజనం అందించే అటల్ క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. తొలి విడతలో ఢిల్లీ మురికివాడల్లో 100 క్యాంటీన్లను ప్రారంభించనున్నట్లు చెప్పారు. దీనికోసం 100 కోట్ల రూపాయల బడ్జెట్ ను కేటాయించామని గుర్తు చేశారు.
ఆహారం ప్రతి వ్యక్తికి ప్రాథమికమని, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలవారికి ఆహార భద్రతను కల్పించడానికి, పోషకాహారాన్ని అందించడానికి అటల్ క్యాంటీన్లను నెలకొల్పనున్నట్లు రేఖా గుప్తా పేర్కొన్నారు. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి శతజయంత్యుత్సవాలను పురస్కరించుకుని ఢిల్లీ వ్యాప్తంగా 100 అటల్ క్యాంటీన్లను ప్రారంభిస్తున్నామని చెప్పారు.
రూ. 5కే భోజనాన్ని అందించాలనే ఉద్దేశంతో 2013లో అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అమ్మ క్యాంటీన్లను ప్రారంభించిన విషయం తెలిసిందే. క్రమంగా అవి అత్యంత ప్రజాదరణ పొందాయి. ప్రారంభంలో 15 క్యాంటీన్లతో మొదలైన ఈ పథకాన్ని జయలలిత మూడు నెలల్లోనే 200లకు విస్తరించారు.
ఈ క్యాంటీన్లలో ఒక రూపాయికి ఇడీ, మూడు రూపాయలకు పెరుగన్నం, అయిదు రూపాయలకు సాంబర్ అన్నం లభించేవి. స్వయం సహాయక బృందాల మహిళలు ఆహారాన్ని వండటం, వడ్డించడం చేసేవారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన ఏఐఏడీఎంకే ముఖ్యమంత్రులు పళనిస్వామి, పన్నీర్ సెల్వం దీన్ని కొనసాగించారు.
అధికారం డీఎంకే చేతుల్లోకి వెళ్లినప్పటికీ.. అమ్మ క్యాంటీన్లు కొనసాగాయంటే దానికి గల ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగిస్తోంది. ప్రస్తుతం 400లకు పైగా అమ్మ క్యాంటీన్లు తమిళనాడులో కొనసాగుతున్నాయి. లక్షలాదిమందికి కడుపు నింపుతున్నాయి.
ఇదే కాన్సెప్ట్ ను ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా అమలు చేయడం మొదలు పెట్టాయి. తమిళనాడు తర్వాత కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ పేరుతో ఈ క్యాంటీన్లను నెలకొల్పింది. అయిదు రూపాయలకే టిఫిన్ కింద పొంగల్ లేదా, వెజిటబుల్ పలావ్ లభిస్తుందిక్కడ. రూ.10లతో మధ్యాహ్నం, రాత్రి భోజనం కింద అన్నం, సాంబార్, ఏదైనా ఓ కర్రీ, పెరుగు వడ్డిస్తారు.
ఇది అక్కడా విజయవంతం కావడంతో 2018లో చంద్రబాబు ఏపీలో అన్న క్యాంటీన్లను నెలకొల్పారు. 2024 ఎన్నికల్లో విజయం సాధించి, రెండోసారి అధికారంలోకి వచ్చాక దీన్ని మరింత విస్తరించారాయన. వాటి సంఖ్యను భారీగా పెంచారు.












Click it and Unblock the Notifications