వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీకాపై ఫత్వా జారీ చేయనున్న దేవ్‌బంద్, ముస్లింలు వేచిచూడాలని వినతి: ప్రెస్ రివ్యూ

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
టీకాపై ఫత్వా

టీకా కోసం ఫత్వా జారీ చేస్తామని యూపీలోని ఉలూమ్ దేవ్‌బంద్ చెప్పినట్లు ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది.

కరోనా టీకా వేసుకునేముందు తాము ఫత్వా జారీ చేస్తామని, అప్పటిదాకా ముస్లింలు వేచి చూడాలని యూపీలోని దారుల్‌ ఉలూమ్‌ దేవ్‌బంద్‌ సంస్థ పేర్కొంది.

టీకా తయారీలో పంది మాంసం నుంచి తీసిన గెలాటిన్‌ను ఉపయోగించారని ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు ఆందోళన చెందుతున్నారు.

ఈ నేపథ్యంలో దేవ్‌బంద్‌ ప్రతినిధి మాట్లాడారు. టీకాలో ఏం వాడారు? దాన్ని ఇస్లాంలో అనుమతించారా లేదా? అనేది పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు.

వైరస్‌కు విరుగుడుగా వచ్చే వ్యాక్సిన్‌ ముస్లింలకు సురక్షితమైనదా కాదా? అనేది ఫత్వా విభాగం నిర్ణయిస్తుందని తెలిపారు.

వ్యాక్సిన్‌ను సురక్షితంగా నిల్వ చేసేందుకు, రవాణా చేసేందుకు పంది మాంసం నుంచి తీసిన గెలాటిన్‌ను స్టెబిలైజర్‌గా ఉపయోగిస్తారని చెప్పారు.

ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ వేసుకునే ముందు ఫత్వా కోసం వేచి ఉండాలని ముస్లింలకు పిలుపునిచ్చారు. మరోవైపు పంది మాంసం నుంచి తీసిన గిలెటిన్‌ ఉన్నాసరే ముస్లింల కోసం ఆ వాక్సిన్‌లను ఆమోదిస్తామని యూఏఈలోని ఫత్వా కౌన్సిల్‌ ప్రకటించిందని ఆంధ్రజ్యోతి వివరించింది.

ఏపీఎస్ ఆర్టీసీ

ఒకే యాప్‌లో ఏపీఎస్ ఆర్టీసీ సేవలు

ఏపీఎస్ ఆర్టీసీ సేవలన్నింటినీ ఒకే యాప్‌లోకి తీసుకొచ్చినట్లు ఈనాడు దినపత్రిక కథనం ప్రచురించింది.

విజయవాడ నుంచి విశాఖకు బయల్దేరిన ఆర్టీసీ బస్‌లో సీట్లు ఖాళీ ఉంటే, ఆ బస్‌ ఏలూరు బస్టాండ్‌కు చేరిన తర్వాతే డ్రైవర్‌ను అడిగి తెలుసుకొని ప్రయాణికుడు ఎక్కాల్సి ఉంటుంది.

ఇకపై ప్రయాణిస్తున్న (రన్నింగ్‌) బస్‌లో సైతం ఎన్ని సీట్లు ఖాళీ ఉన్నాయో చూసుకొని వాటిని యాప్‌లో బుక్‌ చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది.

ముందుగా టికెట్‌ బుక్‌ చేసుకున్న బస్‌ను ప్రయాణికుడు అందుకోలేకపోయినా.. అదే రూట్‌లో తర్వాత వచ్చే మరో సర్వీసులోకి మార్చుకునే అవకాశం రానుందని ఈనాడు చెప్పింది.

ఇలా దాదాపు 12-15 రకాల సేవలను ఒకే యాప్‌లో లభించేలా యూనిఫైడ్‌ టికెటింగ్‌ సొల్యూషన్‌ యాప్‌ (గతంలో ప్రథమ్‌)ను ఏపీఎస్‌ఆర్టీసీ సిద్ధం చేస్తోంది.

ప్రస్తుతం ఆర్టీసీలో ఆన్‌లైన్‌ అడ్వాన్స్‌ టికెట్‌ బుకింగ్‌, బస్‌ ట్రాకింగ్‌, పార్శిల్‌ బుకింగ్‌లకు మూడు వేర్వేరు యాప్‌లున్నాయి. ఇకపై ఈ సేవలన్నీ ఒకే యాప్‌లో లభిస్తాయి.

సెంట్రల్‌ కమాండ్‌ సెంటర్‌, ట్రాకింగ్‌ డివైజులు, సర్వర్‌, ఈ పోస్‌ యంత్రాలు తదితరాల కోసం ఈ ప్రాజెక్ట్‌ మొత్తానికి రూ.70 కోట్ల వరకు వ్యయమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారని పత్రికలో రాశారు.

డిజిటలైజేషన్‌ ప్రోత్సాహంలో భాగంగా ఈ ప్రాజెక్ట్‌కు కేంద్రం రూ.10-20 కోట్లు సాయం అందించనుంది. వచ్చేనెలలో టెండర్లు పిలవనున్నారు. ఇప్పటికే నాలుగు సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి.

యాప్‌ ద్వారా బుక్‌ అయ్యే ఒక్కో టికెట్‌కు సగటున 15 పైసల చొప్పున టెండరు దక్కించుకునే సంస్థకు కమిషన్‌కు లభించే వీలుందని అంచనా వేస్తున్నారు.

పల్లెవెలుగు, సిటీ బస్సులు మొదలుకొని దూర ప్రాంతాలకు వెళ్లే అన్ని తరహా బస్సుల టికెట్లను యాప్‌లో బుక్‌ చేసుకోవచ్చని ఈనాడు వివరించింది.

దేశీయ యా‌ప్‌ల జోష్

టిక్ టాక్‌పై నిషేధంతో దేశీయ యాప్‌ల 'జోష్'

టిక్ టాక్‌పై నిషేధంతో దేశీయ స్టార్టప్‌ల దశ తిరిగిందని, దాని స్థానంలో జోష్ నంబర్ వన్ అయ్యిందని సాక్షి కథనం ప్రచురించింది.

టిక్‌టాక్‌పై నిషేధంతో దేశీయ స్టార్టప్‌లకు ఊహించని అవకాశం తలుపుతట్టినట్టయింది. టిక్‌టాక్‌కు ఉన్న భారీ యూజర్లను సొంతం చేసుకునేందుకు చాలా సంస్థలు వేగంగా ఈ మార్కెట్‌ వైపు అడుగులు వేశాయి.

దేశీయ వినియోగదారుల డేటా రక్షణ, దేశ భద్రతతోపాటు, చైనా ద్వంద్వ వ్యవహారశైలికి తగిన చెక్‌ పెట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం వందలాది చైనా మద్దతు కలిగిన యాప్‌లను ఈ ఏడాది నిషేధ జాబితాలో పెట్టేసింది.

అందులో భాగంగానే టిక్‌టాప్‌పై జూన్‌లో వేటు పడింది. టిక్‌టాక్‌కు యూజర్లు భారీగా జత కూడుతున్న తరుణంలో ఈ నిషేధం ఆ సంస్థకు మింగుడుపడలేదు. కానీ, ఇది కొత్త వేదికలకు ప్రాణం పోసింది.

డైలీహంట్‌కు చెందిన 'జోష్‌' యాప్‌ సహా దేశీయ షార్ట్‌ వీడియో యాప్‌లు 40% వాటాను ఇప్పటికే సొంతం చేసుకున్నట్టు బెంగళూరుకు చెందిన కన్సల్టింగ్‌ సంస్థ రెడ్‌సీర్‌ ఓ నివేదికలో వెల్లడించింది.

2020 జూన్‌లో నిషేధం విధించే నాటికి చైనాకు చెందిన టిక్‌టాక్‌ (బైట్‌డ్యాన్స్‌కు చెందిన ప్లాట్‌ఫామ్‌)కు 16.7 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు.

కానీ, సరిగ్గా అంతకు రెండేళ్ల క్రితం నాటికి 2018 జూన్‌ వరకు.. ఈ సంస్థకు 8.5 కోట్ల వినియోగదారులే ఉండడం గమనార్హం. రెండేళ్లలోనే యూజర్లను రెట్టింపు చేసుకుని వేగంగా దూసుకుపోతున్న టిక్‌టాక్‌కు బ్రేక్‌ పడింది.

దీంతో ప్రత్యామ్నాయ వేదికల కోసం యూజర్ల అన్వేషణ మొదలైంది. ఈ క్రమంలో జోష్, ఎమ్‌ఎక్స్‌ టకాటక్, రోపోసో, చింగారి, మోజ్‌ మైట్రాన్, ట్రెల్‌ ఇలా ఎన్నో వేదికలు పుట్టుకొచ్చాయి.

షార్ట్‌ వీడియో మార్కెట్‌పై దిగ్గజ సంస్థలైన ఫేస్‌బుక్, గూగుల్‌ కూడా ఆశపడ్డాయి. ఫలితంగా రీల్స్‌ పేరుతో ఫేస్‌బుక్, షార్ట్స్‌ పేరుతో యూట్యూబ్‌ సంస్థలు కొత్త వేదికలను తీసుకొచ్చాయి.

టిక్‌టాక్‌ మార్కెట్‌ వాటాలో 40 శాతాన్ని భారత ప్లాట్‌ఫామ్‌లు సొంతం చేసుకున్నట్టు రెడ్‌సీర్‌ సంస్థ తెలిపింది.

ఇందులో జోష్‌ ముందంజలో ఉందని.. నాణ్యమైన కంటెంట్, విస్తృతమైన కంటెంట్‌ లైబ్రరీ జోష్‌ బలాలుగా పేర్కొందని సాక్షి కథనం వివరించింది.

హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలకు బ్రేక్

సైబరాబాద్ పరిధిలో కొత్త సంవత్సరం వేడుకలను నిషేధిస్తున్నట్లు పోలీసు శాఖ ప్రకటించిందని నమస్తే తెలంగాణ కథనం ప్రచురించింది.

న్యూ ఇయర్‌ వేడుకలకు ఫుల్‌స్టాప్‌ పడింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో సామూహికంగా సంబురాలు చేసుకునేందుకు పోలీసుశాఖ నో చెప్పింది.

సైబరాబాద్‌ పరిధిలో కొత్త సంవత్సర వేడుకలకు ఎలాంటి అనుమతి లేదని సీపీ సజ్జనార్‌ వెల్లడించగా, హైదరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో సందిగ్ధం నెలకొంది.

శుక్రవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ కమిషనరేట్‌లో సీపీ మీడియాతో మాట్లాడారు.

' సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో రిసార్టులు, పబ్‌లు, హోటళ్లల్లో కొత్త సంవత్సర సంబురాలకు ఎలాంటి అనుమతి లేదు. రిసార్టులు, పబ్‌లపై నిఘా ఉంచాం. గేటెడ్‌ కమ్యూనిటీస్‌, అపార్టుమెంట్లు, కాలనీల్లో కూడా వేడుకలు నిషేధం. ఎవరైనా న్యూఇయర్‌ సెలబ్రేషన్లు నిర్వహించినా, ఈవెంట్ల పేరిట టికెట్లు విక్రయించినా, వినోదాత్మక కార్యక్రమాలు పెట్టినా చట్టరీత్యా చర్యలు తప్పవు.' అని అన్నారని పత్రిక రాసింది.

ఎక్కడైనా వినోదాత్మక కార్యక్రమాలు పెట్టినా, నిర్వహిస్తున్నట్లు తెలిసినా వెంటనే సైబరాబాద్‌ పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.

31వతేదీ రాత్రి యథావిధిగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహిస్తామని సీపీ పేర్కొన్నారని నమస్తే తెలంగాణ వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
What is used in the vaccine? Is it allowed in Islam? A spokesman for Deoband said the matter needed to be looked into and waited for.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X