డేరా బాబాపై మళ్లీ విచారణ! ఈసారి రెండు హత్య కేసుల్లో.. పంచకులలో భద్రత కట్టుదిట్టం..

పంచకుల: రెండు అత్యాచార కేసుల్లో ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌ను శనివారం మళ్లీ విచారించనున్నారు. సిర్సాకు చెందిన జర్నలిస్టు రామ్ చందర్ ఛత్రపతి, డేరా మాజీ మేనేజర్ రంజిత్ హత్య కేసుల్లో గుర్మీత్ హస్తం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి.
దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. దీనిపై శనివారం హరియాణాలోని పంచకుల సీబీఐ కోర్టు న్యాయమూర్తి జగ్దీప్ సింగ్ విచారణ చేపట్టనున్నారు. ఈ సందర్భంగా పంచకులలో భద్రత కట్టుదిట్టం చేశారు.

గుర్మీత్‌పై అత్యాచార కేసులను ఇదే కోర్టులో విచారించారు. ఆగస్టు 25న జరిగిన ఈ విచారణలో గుర్మీత్‌ను దోషిగా తేలుస్తూ న్యాయమూర్తి జగ్దీప్ సింగ్ తీర్పు చెప్పారు. ఆ సమయంలో పంచకులలో పెద్దయెత్తున ఆందోళనలు చెలరేగాయి.
గుర్మీత్ అనుచరులు భారీ విధ్వంసానికి పాల్పడ్డారు. పోలీసులపైకి రాళ్లు రువ్వడమేగాక.. వందల సంఖ్యలో వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ ఘర్షణల్లో 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
ఈ అల్లర్ల నేపథ్యంలో గుర్మీత్ శిక్ష ఖరారు రోజున.. రోహ్‌తక్‌లోని జైల్లోనే కోర్టు ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. ఈ కేసులో గుర్మీత్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!