గవర్నమెంట్ స్కూల్స్ ఎలా అభివృద్ధి అయ్యాయో వివరించిన నారా లోకేష్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. విద్యా వ్యవస్థలో సమూల మార్పులను తీసుకుని రావడంపై ప్రత్యేక దృష్టి సారించింది. పీఎం శ్రీ పథకం కింద కేంద్రం నుంచి అదనపు నిధులను రాబట్టుకోవడానికి చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పర్యటనను దీనికోసం వినియోగించుకుంటోంది.
విజయనగరం జిల్లా భోగాపురంలోని పీఎం శ్రీ (ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా-PM SHRI) ఏపీ మోడల్ పాఠశాలను ఈ ఉదయం ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ సందర్శించారు. విద్యలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంపై చర్చించారు. ఇందులో భాగంగానే పీఎం శ్రీ పాఠశాలల పురోగతిని పరిశీలించడానికి ఈ పర్యటన చేపట్టారు.

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం శ్రీ పథకం కింద ఎంపిక చేసిన పాఠశాలల్లో విద్యార్థులకు అందుతున్న వసతులు, విద్యా ప్రమాణాలను ఈ ఇద్దరు నేతలు క్షేత్రస్థాయిలో స్వయంగా సమీక్షించారు. డిజిటల్ తరగతులు, అత్యాధునిక సైన్స్ ప్రయోగశాలలు, కంప్యూటర్ ల్యాబ్‌లు, క్రీడా ప్రాంగణాలు వంటి మౌలిక వసతుల కల్పన ఏ విధంగా సాగుతుందనే విషయాలను వారు ఉన్నతాధికారులను అడిగి తెలుసుకోనున్నారు.
ఏపీలో విద్యా విధానాన్ని సమూలంగా మార్చాలని, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను ప్రభుత్వ పాఠశాలల్లో తీసుకురావాలని మంత్రి నారా లోకేష్ భావిస్తోన్న విషయం తెలిసిందే. కేంద్ర పథకాలను సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా రాష్ట్రంలోని సర్కారీ బడులను కార్పొరేట్ స్థాయికి తీర్చిదిద్దవచ్చని ఆయన నిశ్చయించుకున్నారు. పీఎం శ్రీ పథకం కింద అదనపు నిధులను రాష్ట్రానికి కేటాయించేలా నారా లోకేష్ ఈ సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్ కు విజ్ఞప్తి చేశారు.
విద్యార్థుల్లో పుస్తక జ్ఞానమే కాకుండా సృజనాత్మకత, విశ్లేషణాత్మక ఆలోచనలను పెంపొందించేలా ఇక్కడ బోధనా పద్ధతులను ప్రవేశపెట్టాలని నారా లోకేష్ కోరారు. భోగాపురం ఏపీ మోడల్ స్కూల్‌లో జరుగుతున్న ఈ అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతమైతే, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణకు ఇది గైడ్‌లైన్‌గా మారే అవకాశం ఉంది.
ఈ పర్యటనకు విచ్చేసే ముందు ధర్మేంద్ర ప్రధాన్ మొదట ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ జరిగిన పవిత్ర దేవస్నాన పూర్ణిమ వేడుకలలో పాల్గొన్నారు. స్వామివారికి పవిత్ర స్నాన సమర్పణ ఘట్టాన్ని దర్శించుకున్నారు. లోక కల్యాణం కోసం, దేశ సౌభాగ్యం కోసం పూరీ జగన్నాథుని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని ఆకాంక్షించిన ఆయన, ఆ ఆధ్యాత్మిక యాత్ర ముగిసిన వెంటనే ఏపీలోని విద్యా రంగ పర్యటనకు తరలివచ్చారు.












Click it and Unblock the Notifications