సీమాంధ్ర మంత్రుల్లో 2 వర్గాలు: కావూరి, జైపాల్‌ల లాబీ
న్యూఢిల్లీ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ ముసాయిదా బిల్లు) విషయంలో పార్లమెంటు సాక్షిగా సీమాంధ్ర ప్రాంత కేంద్రమంత్రులు, సీమాంధ్ర ప్రాంత పార్లమెంటు సభ్యుల మధ్య విభేదాలు కనిపిస్తున్నాయి. మొదటి నుండి అధిష్టానానికి అనుకూలం వర్గం, సమైక్యాంధ్ర లేదా డిమాండ్ల కోసం పోరాడుతున్న వర్గం ఉంది. సభలో కూడా ఇప్పుడు ఆ వర్గాలు కనిపిస్తున్నాయి.
సభలో కేంద్రమంత్రులు చిరంజీవి, పురంధేశ్వరి, కావూరి సాంబశివ రావు, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, పళ్లం రాజు, జెడి శీలం వంటి వారు నిరసన తెలుపుతూ వెల్లోకి వెళ్తుంటే కిషోర్ చంద్రదేవ్, పనబాక లక్ష్మిలు తమ తమ స్థానాలకే పరిమితం అవుతున్నారు. పరిస్థితి తీవ్రంగా ఉంటే వారు తమ స్థానాల నుండి లేచి నిరసన తెలుపుతున్నారు. మంగళవారం షిండే మాట్లాడుతున్న సమయంలో రెండు వర్గాలుగా విడిపోయినట్లు స్పష్టంగా కనిపించిందంటున్నారు.

ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఇతర అధిష్టానం పెద్దల ముందు చిరు, పురంధేశ్వరి, కావూరి సహా పలువురు తమ తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. పనబాక, కిషోర్‌లు మాత్రం నిరసన తెలపడం లేదని అంటున్నారు. ఎంపీలలో కూడా అదే కనిపిస్తోందంటున్నారు. కనుమూరి బాపిరాజు, హర్ష కుమార్‌లు నిరసనలు వ్యక్తం చేస్తుండగా చింతామోహన్ మాత్రం అంతగా స్పందించడం లేదంటున్నారు.
జోరుగా లాబీయింగ్
మరోవైపు తెలంగాణ, సీమాంధ్ర ప్రాంత మంత్రులు ఢిల్లీలో జోరుగా లాబీయింగ్ చేస్తున్నారు. తెలంగాణకు మద్దతు కూడగట్టేందుకు జైపాల్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ నేతలు, సమైక్యాంధ్రకు మద్దతు కూడగట్టేందుకు కావూరి నేతృత్వంలో సీమాంధ్ర నేతలు లాబీయింగ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications