మోడీ వ్యతిరేక మెసేజ్, అరెస్ట్: ఇదేంటని మండిపడ్డ డిగ్గీ
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రిగా ఎన్నికైన నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్లలో వ్యాఖ్యలు పోస్టు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై కేసులు నమోదు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తప్పుబట్టారు. పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ మోడీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారన్నారు.
మన్మోహన్ సింగ్‌ను దుర్భాషలాడుతూ ఎంతోమంది వ్యాఖ్యలు చేసినప్పుడు పోలీసులు, దర్యాప్తు సంస్థలు ఏమయ్యాయని, ప్రజలకు భావ ప్రకటనా స్వేచ్ఛ లేదా అని ట్విట్టర్‌లో ప్రశ్నించారు. మోడీ వ్యతిరేక సందేశాలను వాట్సప్ మెసెంజర్ సర్వీసు ద్వారా వ్యాప్తి చేశారన్న ఆరోపణలపై బెంగళూరు పోలీసులు విద్యార్థులను అరెస్టు చేసినట్టు వార్తలు వెలువడటంతో దిగ్విజయ్ స్పందించారు.

కాగా, మోడీకి వ్యతిరేకంగా ఎంఎంఎస్‌ను పంపిణీ చేశాడనే ఆరోపణపై పోలీసులు ఎంబిఎ విద్యార్థిని అరెస్టు చేశారు. సయీద్ వాఖాస్ అనే 24 ఏళ్ల విద్యార్థితో పాటు మరో నలుగురిని వసంత్‌నగర్‌లో స్థానిక సైబర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారించిన తర్వాత నలుగురిని పోలీసులు విడుదల చేశారు. సయీద్‌ను మాత్రం ఐటి చట్టం కింద అరెస్టు చేశారు. ఎప్పుడు అతన్ని అరెస్టు చేశారనే విషయాన్ని మాత్రం పోలీసులు వెల్లడించడం లేదు.
సయీద్ ఉత్తర కన్నడ జిల్లాలోని భత్కల్ కాలేజీలో చదువుతున్నాడు. అతను ఇతర విద్యార్థులతో కలిసి వసంత్‌నగర్‌లో అద్దెకు ఉంటున్నాడు. అతని మొబైల్ నెంబర్‌ను పోలీసులు కనిపెట్టారు. ఆర్‌టిఐ కార్యకర్త జయంత్ తినైకర్ పోలీసులకు ఎంఎంఎస్ పంపిణీపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు పోలీసులకు మే 16వ తేదీన అందింది. పేస్‌బుక్‌లో నరేంద్ర మోడీపై గోవాలో ఓ వ్యక్తి అసభ్యకరమైన వ్యాఖ్యలు పోస్టు చేసిన రెండు రోజుల తర్వాత ఈ సంఘటన చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications