ఢిల్లీ గుసగుసలు: మధ్య ప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెబుతోంది ఎవరో తెలుసా..?
మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం ముగిసింది. పోలింగ్ అక్కడ ముగియడంతో ఇక ఏపార్టీ అధికారంలోకి వస్తుందా అని పందెం రాయుళ్లు జోరుగా బెట్టింగ్ చేస్తున్నారు. మళ్లీ బీజేపీనే అధికారంలోకి వస్తుందని కొందు పందాలు కాస్తుండగా మరికొందరు కాంగ్రెస్ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చి తీరుతుందని మరికొందరు బెట్టింగ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఫలితాలు వెలువడక ముందే మధ్యప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ అనే ప్రకటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఇది చెబుతున్నది మరెవరో కాదు... సాక్షాత్తు బీజేపీ నేతలే. మరికొందరు బ్యూరోక్రాట్లు ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌తో విసుగెత్తిపోతున్నారట... ఇంకొందరు పార్టీలో కీలకంగా ఉన్న లాయర్లు ఎన్నికల ప్రచారానికి వెళ్లకుండా ఉండేందుకు సాకులు వెతుకుతున్నారట .ఎందుకో తెలుసా..?

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌దే అధికారం అంటున్న బీజేపీ సీనియర్ నేత
మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందంటూ ఓ సీనియర్ బీజేపీ నేత భావిస్తున్నారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రుల్లో ఒకరు సీనియర్ హస్తం పార్టీ నాయకుడితో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందంటూ క్యాబినెట్‌లో నీకు తప్పక చోటు లభిస్తుందంటూ జోస్యం చెప్పారట. ఇక అధికారికంగా ఫలితాలు వెలువడక ముందే బీజేపీ ఓటమిని ఒప్పుకున్నట్లయ్యింది. ఇందుకు కారణం పోలింగ్ రోజున బీజేపీ కార్యకర్తలు ఓటువేసేందుకు పెద్ద సంఖ్యలో రాలేదని ఈ మాజీ ముఖ్యమంత్రి వివరణ ఇచ్చారట. ఇందుకోసమే ఇప్పటి నుంచే కాంగ్రెస్ నాయకులను బీజేపీ నేతలు మచ్చిక చేసుకుంటున్నట్లు వినికిడి. ఎందుకంటే ఒకవేళ ప్రభుత్వం మారినా సరే తమ పనులకు ఆటంకం కలగకుండా కాంగ్రెస్ నేతలతో బీజేపీ నేతలు దోస్తీ కడుతున్నట్లు సమాచారం.

రాజస్థాన్‌లో ఎటూ బీజేపీ గెలవదు... మేము వెళ్లి ఏం చేస్తాం: నేతలు
ఇక మధ్యప్రదేశ్‌లో ఎన్నికలు ముగియడంతో ఇక్కడి సీనియర్ నేతలు రాజస్తాన్‌కు వెళ్లి ప్రచారం నిర్వహించాల్సిందిగా పార్టీ అధిష్టానాలు ఆదేశాలు ఇస్తున్నాయి. అయితే రాజస్థాన్‌కు వెళ్లి తమ వంతు ప్రచారం చేయడం వల్ల బీజేపీకి ఒక్క ఓటు కూడా లాభం చేకూరదని చెబుతున్నారట మధ్యప్రదేశ్ బీజేపీ నేతలు. ఈ సారికి తమకు ప్రచారం నుంచి మినహాయింపు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారట బీజేపీ నేతలు. అయితే ఇందుకు హైకమాండ్ ఒప్పుకోవడం లేదట. మరో వైపు లాయరు అయిన మరో కాంగ్రెస్ సీనియర్ నేత రాజస్థాన్‌కు వెళ్లి ప్రచారం చేసేందుకు మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారట. తనకు కోర్టు పనులు చాలా ఉన్నాయనే సాకు చూపుతున్నారట. అయితే రాజస్థాన్‌లో ఎలాగూ కాంగ్రెస్ వస్తుంది కాబట్టి తను వెళ్లడం ఎందుకని ప్రశ్నిస్తున్నారట. అయితే త్వరలోనే లోక్‌సభ ఎన్నకలు జరుగుతుండటంతో తప్పకుండా వెళ్లి ప్రచారం చేయాల్సిందేనని హైకమాండ్ పట్టుబడుతున్నట్లు సమాచారం.

యోగీతో చాలా ఇబ్బందులు పడుతున్న బ్యూరోక్రాట్లు
బీజేపీకి ప్రధాని నరేంద్ర మోడీ తర్వాత స్టార్ క్యాంపెయినర్‌గా ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఉన్నారు. యోగీ ఆదిత్యనాథ్ ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే రాత్రి ఎంత ఆలస్యమైనా సరే ప్రచారం ముగించుకుని లక్నోకు చేరుకుంటారు. ఆ తర్వాత నేరుగా సీఎం కార్యాలయానికి వెళ్లి అక్కడ రోజువారీ జరిగిన అంశాలపై సమీక్ష నిర్వహిస్తారు. దీంతో అర్థరాత్రి వరకు బ్యూరోక్రాట్లు తమ కార్యాలయాల్లోనే ఉంటూ ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఎన్నికలు ఎంత త్వరగా అయిపోతే అంత బాగుంటుందని కాసేపు విశ్రాంతి తీసుకునే వీలుంటుందని భావిస్తున్నారట. మరికొందరు బ్యూరోక్రాట్లు ఒక్క అడుగు ముందుకు వేసి యోగీ ఆదిత్యనాథ్‌కు భార్యా పిల్లలా... తమకు మాత్రం ఇళ్లల్లో కుటుంబాలు ఎదురుచూస్తుంటాయని బాహాటంగానే కామెంట్ చేస్తున్నారట.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!