జయలలిత మేనకోడలు దీపాకు జై: శశికళకు షాక్ జిల్లా మొత్తం ఖాళీ
చెన్నై: అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ నాయకత్వంలో తాము పని చెయ్యలేమని తమిళనాడులోని దిండిగల్ జిల్లాలోని అన్నాడీఎంకే పార్టీ ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలు తేల్చి చెప్పారు. అందుకే తాము పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నామని బుధవారం మీడియాకు చెప్పారు.
జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ నాయకత్వంలో తాము పని చేస్తామని అన్నారు. ఇప్పటికే తాము దీపా పేరవై సంస్థ సభ్యులుగా చేరామని, దిండిగల్ జిల్లాలోని వేలాధి మంది కార్యకర్తలను దీపా పేరవైలో చేర్చుతున్నామని ఆ ప్రాంతంలోని అన్నాడీఎంకే నాయకులు చెప్పారు.

ఇప్పటికే శశికళ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న కొన్ని వేల మంది అన్నాడీఎంకే పార్ కార్యకర్తలు దీపా పేరవైలో సభ్యత్వం తీసుకున్నారు. బుధవారం నుంచి దీపా పేరవై సభ్యత్వం జోరందుకుంది. దిండిగల్ జిల్లాలో ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్), జయలలిత, దీపా ఫోటోలతో భారీ బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
జయలలిత జయంతి రోజు ( ఫిబ్రవరి 24వ తేది)లోపు జిల్లాలో అన్నాడీఎంకే కార్యకర్త కనపడకుండా చేస్తామని, శశికళ, ఆమె అనుచరులకు తగిన గుణపాఠం చెబుతామని దీపా అభిమానులు సవాలు విసిరారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు నిజమైన వారసురాలు ఆమె మేనకోడలు దీపానే, ఆమె నాయకత్వంలో తాము పని చేస్తామని దిండిగల్ అన్నాడీఎంకే పార్టీ నాయకులు, కార్యకర్తలు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications