ప్రయాణికులకు హెచ్చరికలు జారీ చేసిన రైల్వే
Deepavali 2024: ఇంకొద్ది రోజుల్లో దీపావళి పండగ రాబోతోంది. ఈ నెల 31వ తేదీన దేశవ్యాప్తంగా దీవాళీ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకోనున్నారు ప్రజలు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య బాణాసంచా కాల్చుతూ సందడి చేయడానికి సిద్ధమౌతున్నారు.
వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు పేర్లతో మూడు రోజుల పాటు ఈ పండగను జరుపుకుంటుంటారు. ఛోటీ దీపావళి, మహాలక్ష్మి వ్రతం, గోవర్ధన పూజ, భాయ్ దూజ్ వంటి శుభ కార్యాలను నిర్వహిస్తుంటారు. తోడబుట్టిన వాళ్ల క్షేమాన్ని కోరుకుంటూ భాయ్ దూజ్‌ను జరుపుకొనే సంప్రదాయం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉంది.

దీపావళి పండగకు తోడు వరుస సెలవులు రానుండటంతో నగరాలు ఖాళీ అవుతున్నాయి. తమ సొంతూళ్లకు ప్రయాణం కట్టారు ప్రజలు. ఫలితంగా ప్రయాణ ప్రాంగణాలు ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. భారీ తాకిడి నెలకొంది. ప్రత్యేకించి ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లే రైళ్లకు డిమాండ్ ఏర్పడింది.
రైల్వే స్టేషన్లల్లో ప్రయాణికుల రద్దీని నివారించడానికి అధికారులు పలు చర్యలు తీసుకున్నారు. ప్లాట్ ఫామ్‌లపై అదనపు సిబ్బందిని మోహరింపజేశారు. రైలు ఎక్కేటప్పుడు తోపులాట, తొక్కిసలాట సంభవించకుండా ముందు జాగ్రత్త చర్యలను చేపట్టారు. క్యూ లో నిల్చొని రైలు ఎక్కేలా ఏర్పాట్లు చేశారు.
ఈ సందర్భంగా రైల్వే అధికారులు ప్రయాణికులకు పలు సూచనలను జారీ చేశారు. రైళ్లల్లో ఎలాంటి బాణాసంచాలను తీసుకెళ్లకూడదని విజ్ఞప్తి చేశారు. బాణాసంచా, వాటిని తయారు చేయడానికి వినియోగించే వస్తువులు, మందుగుండు సామాగ్రిని తరలించడం మంచిది కాదని, వాటిని ప్రయాణికులు తమ వెంట తీసుకెళ్లకూడదని సూచించింది.

బాణాసంచా, గ్యాస్ సిలిండర్లు, యాసిడ్, పెట్రోలో, కిరోసిన్ వంటి పేలుడు, మండే స్వభావం ఉన్న ఏ ఒక్క వస్తువు కూడా తీసుకెళ్లకూడదని పేర్కొంది. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై రైల్వే యాక్ట్ 1989 ప్రకారం కఠిన చర్యలను తీసుకుంటామని రైల్వే అధికారులు హెచ్చరించారు. మూడేళ్ల జైలు శిక్ష, భారీ జరిమానా పడుతుందని అన్నారు.
వాటి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కొన్ని సందర్భాల్లో బాణాసంచా, ఇతర పేలుడు వస్తువులను తీసుకెళ్లిన ప్రయాణికులు ఈ రెండింటికీ అర్హులు అవుతారని వెల్లడించారు. తోటి ప్రయాణికులు ఇబ్బందులు సృష్టించకుండా, రైల్వే ఆస్తులకు నష్టాన్ని కలిగించకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications