విమానంలోనే ఎమ్మెల్యే టిక్కెట్ డీలింగ్, స్పెషల్ ఫ్లైట్ పంపించిన ప్రతిపక్షం, లెక్కా పక్కా !
బెంగళూరు/బెళగావి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సొంత పార్టీలో ఎమ్మెల్యే టిక్కెట్లు దక్కని రాజకీయ నాయకులు పక్కపార్టీలోకి జంప్ అవుతున్నారు. ముఖ్యంగా బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు బీజేపీ హైకమాండ్ హ్యాండ్ ఇవ్వడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు రగిలిపోతున్నారు. ఇప్పుడు మాజీ ఉప ముఖ్యమంత్రి కోసం ప్రతిపక్ష పార్టీ ప్రత్యేకంగా విమానం పంపించడం హాట్ టాపిక్ అయ్యింది.
కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ ఎమ్మెల్సీ లక్ష్మణ సవదికి అథణి నియోజక వర్గంలో పోటీ చెయ్యడానికి అవకాశం ఇవ్వకుండా బీజేపీ హైకమాండ్ వేరే వ్యక్తికి టిక్కెట్ ఇచ్చింది. దెబ్బకు రగిలిపోయిన మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ సవది నేను ఎవరినైనా రేప్ చేశానా ?, అందుకేనా నాకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వలేదు అంటూ బీజేపీ హైకమాండ్ మీద దుమ్మెత్తిపోశారు.

బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చెయ్యాలని శుక్రవారం ఆయన బెళగావి నుంచి బెంగళూరు బయలుదేరడానికి సిద్దం అయ్యారు. ఇదే సమయంలో కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ బీజేపీ రెబల్ నాయకుడు లక్ష్మణ సవది కోసం బెళగావికి ప్రత్యేక విమానం పంపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ చెన్నరాజ బెళగావి ఎయిర్ పోర్టుకు వెళ్లి లక్ష్మణ సవదిని ప్రత్యేక విమానం దగ్గరకు పిలుచుకుని వెళ్లారు.
డీకే శివకుమార్ పంపించిన ప్రత్యేక విమానంలో బెంగళూరు బయలుదేరిన లక్ష్మణ సవది మొదట బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనా చేసి తరువాత నేరుగా బెంగళూరులోని క్వీన్స్ రోడ్డులో ఉన్న కేపీసీసీ కార్యలయానికి వెళ్లనుకున్నారు. అక్కడ డీకే. శివకుమార్, సిద్దరామయ్యతో భేటీ కానున్నారు. అక్కడి నుంచి నేరుగా శుక్రవారం ప్రత్యేక విమానంలో బెళగావి వెళ్లనున్నారు.

బెళగావిలో శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఏర్పాటు చేసిన జనసంకల్ప సమావేశంలో కేపీసీసీ కార్యాధ్యక్షుడు సతీష్ జారకిహోళి నేతృత్ంలో జరగనున్న కార్యక్రమంలో లక్ష్మణ సవది పాల్గొంటారని తెలిసింది. ఇదే కార్యక్రమంలో మాజీ సీఎం సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ పాల్గొంటారు.
ఇదే సమావేశంలో మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ సవది అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు. ఇదే వేధిక మీద అథణి నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా లక్ష్మణ సవది పేరును డీకే శివకుమార్, సిద్దరామయ్య అధికారికంగా ప్రకటిస్తారని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. బీజేపీ చేతిలో వంచనకు గురైన చాలా మంది నాయకులకు కాంగ్రెస్ పార్టీ వలవేస్తోంది.












Click it and Unblock the Notifications