• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రిషి సునక్ భార్య అక్షత మూర్తి ఎవరో తెలుసా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
రిషి సునక్, అక్షతా మూర్తి

రిషి సునక్ బ్రిటన్ ప్రధానమంత్రిగా అధికారంలో ఎదగటం భారతదేశంలో తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది. ఆ ఆసక్తికి కారణం.. తొలి భారత లేదా ఆసియా సంతతికి చెందిన వ్యక్తి బ్రిటన్ ప్రధాని కాబోతుండటం ఒక్కటి మాత్రమే కాదు. మరో కారణం కూడా ఉంది. ఆయన భార్య అక్షతా మూర్తి.

భారతదేశానికి చెందిన కుబేరుడు, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు, ఎన్‌.ఆర్.నారాయణమూర్తి కూతురు ఆమె. కర్ణాటకు చెందిన ఎన్.ఆర్.నారాయణమూర్తిని భారతదేశపు బిల్ గేట్స్‌గా చెప్పుకుంటారు.

వేల కోట్లకు వారసరాలైన అక్షతా మూర్తి ఈ ఏడాది ఆరంభంలో వార్తల్లో నిలిచారు. బ్రిటన్‌లో ఆమెకు 'నాన్-డొమిసైల్డ్' హోదా ఉన్నట్లు బయటపడటం అందుకు కారణం.

బ్రిటన్‌లో శాశ్వత నివాసం కాకుండా, ప్రవాస నివాసం ఉండేవారిని 'నాన్-డొమిసిల్' కేటగిరీగా పేర్కొంటారు. అంటే.. ఈ కేటగిరీలో ఉన్నవారు తమకు బ్రిటన్ వెలుపల వచ్చే ఆదాయానికి బ్రిటన్‌లో పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఈ విషయం వివాదాస్పదం కావటంతో.. తన అంతర్జాతీయ ఆదాయం మీద బ్రిటన్‌కు పన్ను కట్టటానికి ఆమె అంగీకరించారు.

కుటుంబానికి అపార సంపద ఉన్నాకూడా అక్షతామూర్తి తొలి రోజులు చాలా సాదాసీదాగానే ఉండేవి.

ఆమె తండ్రి నారాయణమూర్తి.. తమ కుటుంబానికి ఒక టెలిఫోన్ ఏర్పాటు చేసుకునే స్తోమత కూడా లేని సమయంలో.. 1980 ఏప్రిల్‌లో హుబ్బళిలో అక్షతామూర్తి జన్మించినపుడు, ఆ వార్త తన సహోద్యోగి ఒకరి ద్వారా తెలుసుకున్నానని తెలిపారు. ఈ విషయం గురించి అనంతర కాలంలో తన కూతురుకు రాసిన లేఖను 2013లో ఒక పుస్తకంలో ప్రచురించారు.

''అప్పుడు మీ అమ్మ, నేను మా కెరీర్లలో నిలదొక్కుకోవటానికి తంటాలు పడుతున్నాం'' అని ఆయన ఆ లేఖలో రాశారు.

తండ్రి నారాయణమూర్తి, తల్లి సుధామూర్తిలు తమ కెరీర్లలో ముందుకు సాగుతూ ముంబై నగరానికి వెళ్లినపుడు.. కేవలం నెలల వయసు ఉన్న అక్షతా మూర్తిని ఆమె నానమ్మ, తాతయ్యల దగ్గర ఉండాలని పంపించారు.

ఓ ఏడాది తర్వాత నారాయణమూర్తి సహ వ్యవస్థాపకుడిగా ఇన్ఫోసిస్ కంపెనీని స్థాపించారు. ఈ ఐటీ సర్వీసెస్ కంపెనీ స్థాపనతో ఆయన అనతికాలంలోనే భారతదేశపు అత్యంత సంపన్నుల్లో ఒకరయ్యారు.

అక్షతా మూర్తి తల్లిదండ్రులు తమ ఇద్దరు పిల్లలను చదువు మీద, కష్టపడి పనిచేయటం మీద దృష్టి కేంద్రీకరించేలా చేశారు. పాఠాలు, పుస్తకాలు చదువుకోవటానికి, చర్చించటానికి, స్నేహితులను కలవటానికి సమయం దొరికేందుకు వీలుగా తమ ఇంట్లో టీవీని ఏర్పాటు చేసుకోలేదని నారాయణమూర్తి చెప్పారు.

అక్షతా మూర్తి కాలిఫోర్నియాలోని క్లారెమాంట్ మెక్‌కెన్నా కాలేజిలో ఎకనమిక్స్, ఫ్రెంచ్ అభ్యసించారు. ఆ తర్వాత ఒక ఫ్యాషన్ కాలేజీలో డిప్లొమా చేశారు. అనంతరం డెలాయిట్‌లో పనిచేశారు. స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చదివారు.

ఆ యూనివర్సిటీలోనే రిషి సునక్‌ను ఆమె కలిశారు. వీరిద్దరూ 2009లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

రిషి సునక్ తల్లిదండ్రులతో కలిసి అక్షతా మూర్తి

ప్రస్తుతం 42 ఏళ్ల వయసున్న అక్షతా మూర్తి కాలిఫోర్నియాలో ఫైనాన్స్ రంగంలో కెరీర్ ప్రారంభించారు. అనంతరం 2011లో తన సొంత ఫ్యాషన్ లేబుల్ 'అక్షతా డిజైన్స్' ప్రారంభించారు.

భారతదేశంలోని మారుమూల గ్రామాల్లో ఉన్న కళాకారులతో కలిసి పనిచేస్తూ తన డిజైన్లను రూపొందించానని.. ''నిఖార్సైన కళానైపుణ్యం, సుసంపన్నమైన చారిత్రక వారసత్వ పరిరక్షణ'' తన డిజైన్ల విశిష్టత అని ఆమె 'ఓగ్ ఇండియా' మేగజీన్‌తో చెప్పారు.

అయితే ఆమె వ్యాపారం మూడేళ్లలోనే కుప్పకూలినట్లు ది గార్డియన్ ఒక కథనంలో పేర్కొంది.

అక్షతా మూర్తి, రిషి సునాక్‌లు 2013లో కాటామరాన్ వెంచర్స్‌ లండన్‌ విభాగాన్ని స్థాపించారు. స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే సంస్థ ఇది.

అలాగే 'డిగ్‌మి ఫిట్నెస్' అనే జిమ్ చైన్‌ సంస్థలో కూడా అక్షతామూర్తి డైరెక్టర్‌గా ఉన్నారు.

ఈ కంపెనీ ఆదాయం కోవిడ్-19 మహహ్మారి కాలంలో పడిపోవటంతో ఈ కంపెనీని అడ్మినిస్ట్రేటర్ పరిధిలో ఉంచారు.

ఖరీదైన పురుషుల దుస్తులు విక్రయించే న్యూ అండ్ లింగ్‌వుడ్ అనే కంపెనీలో కూడా అక్షతా మూర్తి డైరెక్టర్‌గా ఉన్నట్లు ఆమె లింకిడ్ఇన్ ప్రొఫైల్ చెప్తోంది.

ఇన్ఫోసిస్ కంపెనీ తాజా వార్షిక నివేదిక ప్రకారం.. ఈ సంస్థలో అక్షతామూర్తికి 0.9 శాతం వాటా ఉంది. ఆ వాటా విలువ దాదాపు 6,500 కోట్లుగా అంచనా.

రిషి సునక్, అక్షతా మూర్తి

యుక్రెయిన్ మీద రష్యా సైనిక దండయాత్ర తర్వాత.. ఇన్ఫోసిస్ కంపెనీలో అక్షతా మూర్తి షేర్ల అంశంపై వివాదం చెలరేగింది. రష్యాలో కంపెనీ ఆపరేషన్లను నిలిపివేయాలని ఇన్ఫోసిస్ మీద ఒత్తిడి వచ్చింది. ఈ నేపథ్యంలో రష్యాలో ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు గత ఏప్రిల్‌లో బీబీసీకి చెప్పారు.

రిషి సునాక్, అక్షతా మూర్తిల భారీ సంపద కారణంగా.. సాధారణ జనంతో - ముఖ్యంగా ప్రజల జీవన వ్యయ సంక్షోభ సమయంలో - రిషి సంబంధం కోల్పోయారా అంటూ కొందరు ప్రశ్నించారు.

గతంలో కొందరు ప్రధానమంత్రుల జీవిత భాగస్వాములు ప్రచారానికి, పతాక శీర్షికలకు దూరంగా ఉండేవారు. థెరెసా మే భర్త ఫిలిప్ మే కూడా అటువంటి వారిలో ఒకరు.

టోనీ బ్లెయిర్ భార్య, మానవ హక్కుల న్యాయవాది చెరీ బ్లెయిర్ వంటి ఇంకొందరి విషయంలో చాలా ఆసక్తి రేకెత్తేది. టోనీ ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా చెరీ బ్లెయిర్ తన ఉన్నతస్థాయి ఉద్యోగాన్ని కొనసాగించారు. ఆమె తన స్వచ్ఛంద సేవ, పుస్తకాల కాంట్రాక్టులతో తరచుగా పతాక శీర్షికలకు ఎక్కేవారు.

అక్షతా మూర్తి ఇప్పటివరకూ మీడియా దృష్టిని కోరుకున్నట్లు కనిపించదు. కానీ ఇటీవలి వివాదాల కారణంగా ఆమె మీడియా దృష్టిలో నిలుస్తున్నారు.

ఇప్పుడు ఆమె భర్త బ్రిటిష్ రాజకీయాల్లో అత్యున్నత పదవికి చేరుకోవటంతో.. అక్షతా మూర్తి మీద ఆసక్తి మరింతగా పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Do you know who is Rishi Sunak's wife Akshata Murthy?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X