డబుల్ షాక్: వంటగ్యాస్ సిలిండర్‌పై భారీగా బాదుడు: పెట్రో రేట్లు పెంచిన మరుక్షణమే
న్యూఢిల్లీ: చమురు సంస్థలు వినియోగదారులకు ఒకేసారి డబుల్ షాక్ ఇచ్చాయి. తొలుత- పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచాయి. లీటర్ ఒక్కింటికి ఏకంగా 80 పైసల మేర పెంచాయి. ఈ షాక్ నుంచి ఏ మాత్రం తేరుకోనివ్వలేదు వినియోగదారులను. ఆ వెంటనే గృహావసరాల కోసం వినియోగించే వంటగ్యాస్ ఎల్పీజీ సిలిండర్ల రేట్లపై పడ్డాయి. ఒక్కో వంటగ్యాస్ సిలిండర్ రేటును కూడా అదే స్థాయిలో పెంచేశాయి. ఒక్కో ఎల్పీజీ సిలిండర్‌పై 50 రూపాయల భారాన్ని మోపాయి.

డబుల్ షాక్ ఇలా..
తొలుత పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచాయి. లీటర్ ఒక్కింటికి పెట్రోల్, డీజిల్ మీద 80 పైసలను పెంచేశాయి. ఆ వెంటనే ఎల్పీజీ సిలిండర్ రేట్లను సవరించాయి. పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌పై 80 పైసల పెంపు ఇదివరకు ఎప్పుడూ లేదు. రష్యా-ఉక్రెయిన్ మధ్య 27 రోజులుగా కొనసాగుతూ వస్తోన్న భీకర యుద్ధ ప్రభావం వల్ల అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ రేట్లు పెరిగిన విషయం తెలిసిందే. ఒకదశలో బ్యారెల్ రేటు 140 డాలర్లను దాటిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడా పరిస్థితి లేదు. బ్యారెల్ రేటు 110 డాలర్లకు అటు ఇటుగా ఉంటోంది.

ఎల్పీజీపై..
డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ల రేట్లు పెరగడం ఆరు నెలల తరువాత ఇదే తొలిసారి. చివరిసారిగా గత సంవత్సరం అక్టోబర్ 6వ తేదీన చమురు సంస్థలు గృహావసర వంటగ్యాస్ సిలిండర్ రేట్లను పెంచాయి. తాజా పెరుగుదలతో దేశ రాజధానిలో వంట్యాస్ సిలిండర్ దర రూ. 949.50 పైసలకు చేరింది. కోల్‌కతలో 976 రూపాయలు పలుకుతోంది. చెన్నైలో రూ.915.50 పైసల నుంచి రూ.965.50 పైసలకు పెరిగింది. లక్నోలో ఎల్పీజీ సిలిండర్ ధర 938 రూపాయల నుంచి రూ. 987.50 పైసలకు చేరింది.

అక్కడ వెయ్యికి పైగా..
పాట్నాలో దీని ధర వెయ్యి రూపాయలను దాటేసింది. ఇదివరకు 998 రూపాయలుగా ఉన్న రేటు.. తాజా పెంపుదలతో రూ.1,039.50 పైసలకు చేరింది. అయిదు కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర 349 రూపాయలు, 10 కేజీల కాంపోజిట్ బాటిల్ 669 రూపాయలకు చేరింది. కొంతకాలంగా ముడి వస్తువుల ధరలు పెరిగినప్పటికీ- చమురు సంస్థలు మాత్రం పెరుగుదల జోలికి వెళ్లలేదు. అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలే దీనికి కారణం అనేది ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. ఇప్పుడా పరిస్థితి లేకపోవడంతో ధరలను అమాంతం పెంచేశాయి.

కమర్షియల్ గ్యాస్.. రూ.2,000 వరకు..
గత సంవత్సరం చమురు సంస్థలు ఎల్పీజీ కమర్షియల్ వంటగ్యాస్ సిలిండర్లపై భారీగా భారాన్ని మోపిన విషయం తెలిసిందే. 205 రూపాయల వరకు ఒక్కో సిలిండర్‌పై భారం మోపాయి. అప్పట్లో గృహావసర వంటగ్యాస్ రేట్లను పెంచలేదు. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే సిలిండర్ల రేట్లను రెండుసార్లు పెంచాయి. ఫలితంగా దాదాపు అన్ని నగరాల్లోనూ కమర్షియల్ సిలిండర్లు 2,000 రూపాయలను దాటేశాయి.












Click it and Unblock the Notifications