వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గృహహింస: ‘ప్రేమ, అభిమానం లేని భర్తతో సెక్స్ ఎలా సాధ్యం? నాకు ఆయనతో కలవాలనే కోరికెలా కలుగుతుంది’

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
గృహహింస

"ఒక మహిళ జీవితంలో కోరుకునేది ఏంటి? కాస్తంత ప్రేమ, నాలుగు కబుర్లు, సుఖ దుఃఖాలలో భరోసా ఇచ్చే ఒక ఆత్మీయ తోడు. కానీ,ఇవన్నీ నాకు మాత్రం ఎండమావులే. అవి ఎప్పటికైనా అందుతాయనే ఆశ కూడా లేదు".

"నా ఓపిక నశించింది. ఆ రోజు కొట్టిన దెబ్బలకు నా పెదవి చిట్లి రక్తం వచ్చింది. అప్పటికే 20 ఏళ్లుగా భరిస్తూ వస్తున్న గాయాల నొప్పంతా కలిపి నన్ను మెలిపెట్టింది. నా సహనం నశించింది" అని 49 ఏళ్ల షబ్నమ్ (పేరు మార్చాం) చెప్పారు. ఆమె గత 20 ఏళ్లుగా భర్త చేతిలో శారీరక, మానసిక హింసను భరిస్తున్నారు.

షబ్నమ్ జీవితంలో ఏమి జరిగింది? ఆమె ఆ హింస నుంచి బయటకు రాగలిగారా? లేదా అదే బంధంలో కొనసాగుతున్నారా? ఆమె బీబీసీ న్యూస్ తెలుగు ప్రతినిధి పద్మ మీనాక్షితో మాట్లాడారు.

గృహహింస

"పెళ్ళైన రెండవ రోజు నుంచే మొదలయింది"

నాకు 26 ఏళ్లకే వివాహమైంది. అప్పటికే నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. మాది పెద్దలు కుదిర్చిన వివాహమే.

ఆయనకు నాపై ప్రేమ లేదని, పెళ్లయిన రెండో రోజే బయటపడింది. భార్యా భర్తలు ఎంతో సన్నిహితంగా గడపాల్సిన రాత్రులు భర్త చేతిలో దెబ్బలు తింటూ గడపాల్సి వచ్చింది.

ఒక్క దెబ్బ కాదు, ఆయనకు చేతులు నొప్పి వచ్చేంత వరకూ నా జుట్టును పట్టుకుని, నేను ప్రతిఘటించకుండా చేసి కొడుతూనే ఉండేవారు. ఎందుకు కొడుతున్నారని అడిగితే మరింత రెచ్చిపోయి కొట్టేవారు. నేలపై పడేసి కాళ్లతో తన్నేవారు.

తెల్లవార్లూ కొట్టిన దెబ్బలకు నా శరీరం కమిలిపోయేది. పొద్దున్న వేడి నీళ్లతో స్నానం చేస్తుంటే ఆ గాయాలు నన్ను మరింత బాధపెట్టేవి.

స్నేహితులు లేరు, ఉమ్మడి కుటుంబంలో ఉండేదానిని. ఫోన్ లేదు. అమ్మా నాన్నలతో చెబితే పెళ్లయిన వెంటనే ఫిర్యాదులు చేస్తున్నానని అనుకుంటారేమోననే భయం. ఇవన్నీ నన్ను నోరెత్తకుండా చేశాయి.

ఇంట్లో అత్తగారికి దెబ్బలు చూపిస్తే, ఎవరికీ చూపించకు. నేను మాట్లాడతాను అంటూ నా నోరు మూయించేవారు. ఒకసారి మా మామగారు మాత్రం నా కన్నీటిని చూసి నా భర్తను బాగా చీవాట్లు పెట్టారు.

కానీ, ఆ మందలింపుల పర్యవసానాలు నేనే అనుభవించాల్సి వచ్చేది . మా నాన్నతో చెబుతావా అంటూ తిరిగి కొట్టేవారు ఆయన.

వివాహం అంటే ఒకేసారి జరుగుతుంది, కష్టమైనా సుఖమైనా వివాహ బంధంలోనే ఉండి తీరాలనే విలువలను మాత్రమే నేర్పిన కుటుంబ వాతావరణం నుంచి వచ్చాను.

గత 20 ఏళ్లుగా ప్రతి రోజూ నేను వివాహ బంధంలో ఉన్నాననే కంటే మానసిక శారీరక హింస అనే వలయంలో చిక్కుకుని ఉన్నానని చెప్పవచ్చు.

ఇంట్లో పనులు చేసుకుంటూ , భర్త నడిపే ట్యూషన్ సెంటర్‌కు వెళ్లి పాఠాలు చెప్పేదానిని. కానీ, సెంటర్‌కు 5 నిమిషాలు ఆలస్యంగా వెళ్లినా నన్ను పిల్లల్ని దండించినట్లు క్లాసు బయట నిల్చోబెట్టి శిక్ష వేసేవారు. పిల్లలు, ఇతర టీచర్ల ముందు ఇదంతా నాకు చాలా అవమానకరంగా ఉండేది.

"నాదే తప్పని అనుకునేదానిని"

నా కుడి కంటికి చిన్న దృష్టి లోపం ఉంది. ఆ లోపాన్ని కప్పిపుచ్ఛి ఆయన్ను పెళ్లి చేసుకున్నానని అంటూ నన్ను మానసికంగా, శారీరకంగా హింస పెట్టేవారు. అయితే, డాక్టర్లను అడిగినప్పుడు, ఆ సమస్య పెళ్లికేమి అడ్డు కాదని చెప్పారు. అది కూడా నాకు పుట్టుక నుంచి వచ్చింది కాదు.

దాంతో, నాకు నేను తప్పు చేశానేమో అనుకుంటూ, నా తప్పుకు ఈ శిక్షను నేను అనుభవించాలని అనుకుంటూ ఉండేదానిని. కొట్టడం తప్పు కాదు, నేను నిజాన్ని దాచిపెట్టడమే తప్పు అని అనుకునేలా చేశారు.

"భర్తను ఆకర్షించడం రాదు"

మా మధ్య ప్రేమతో నిండాల్సిన రాత్రులు హింసతో నిండిపోతుంటే మా మధ్య వేరే సంబంధం ఎందుకుంటుంది?

ఇక మాకు పిల్లలెలా పుడతారు. ఇది చాలా వ్యక్తిగత విషయం. ఎవరితోనూ చెప్పలేకపోయేదానిని.

ఇంటి పరువు కాపాడడమే నా బాధ్యత అనుకునేదానిని. అదే నాకూ, నా భర్తకూ గౌరవం అనుకునేదానిని.

మరో వైపు పిల్లలు లేరనే సూటి పోటీ మాటలు కూడా వినాల్సి వచ్చేది.

"నీకు భర్తను ఆకర్షించడం రాదు. ఆకర్షించే దుస్తులు వేసుకోకుండా, ఒళ్లంతా కప్పుకొంటే నీ దగ్గరకు రావాలనే కోరిక ఆయనకెందుకు కలుగుతుంది" అని ఇరుగు పొరుగు వారు ఉచిత సలహాలు ఇస్తూ ఉండేవారు. ఆ సలహాలను వినడం ఇంకొక హింసలా ఉండేది.

ప్రేమ, అభిమానం లేని భర్తతో సెక్స్ ఎలా సాధ్యం? ఒక వ్యక్తి ప్రేమతో స్పర్శించలేనప్పుడు, నాకు ఆయనతో కలవాలనే కోరికెలా కలుగుతుంది?

మహిళ కార్టూన్

"ఇక బయటకు వెళ్లు"

'నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు. నువ్వంటే ఇష్టం లేదు. నువ్వు బయటకు వెళ్లు’ అని పదే పదే అనే వారు.

ఇలా ఒక సంవత్సరం పాటు భరించిన తర్వాత మా అమ్మ నాన్నలను పిలిచి ఈ విషయాన్ని చెప్పాను. కానీ, పెద్దవాళ్లంతా కలిసి 'మేం చూసుకుంటాం. కాస్త ఓపిక పట్టు’ అని నాకు సర్ది చెప్పారు.

పుట్టింటికి ఒక్క రోజు కూడా కూడా పంపేవారు కాదు. ఆఖరికి నా తమ్ముళ్ల పెళ్లిళ్లకు కూడా నన్నొక అతిథిలా పంపారు.

పుట్టింట్లో ఏమైనా చెబితే, చావైనా, బతుకైనా భర్తతోనే అని కచ్చితంగా చెప్పేవారు. వాళ్ళు పరువు గురించి, చుట్టు పక్కల వాళ్ళు ఏమంటారో అనే విషయం గురించి ఎక్కువ భయపడుతూ ఉండేవారు.

ఆఖరుకు నా బ్యాంకు అకౌంట్‌ను కూడా క్లోజ్ చేయించి ఆ డబ్బును కూడా తీసేసుకున్నారు. డబ్బులుంటే నాకు తెలివితేటలు పెరిగి ఏమైనా చేయాలనే ఆలోచనలు వస్తాయని అంటూ ఉండేవారు.

పిల్లల కోసం డాక్టర్ల దగ్గరకు వెళితే, నన్ను పరీక్షించి నా గర్భసంచికి ఇన్ఫెక్షన్ అయిందని చెప్పారు. ఇదంతా ఆయన నన్ను పొత్తికడుపులో తన్నడం వల్లే అని డాక్టర్లకెలా చెప్పగలను? డాక్టర్లకు నా పరిస్థితి అర్థమవుతూ ఉండేది. కానీ, నేను పెదవి విప్పందే వారేమి చెప్పగలరు ? ఇక పిల్లలను కనే అవకాశం లేదని డాక్టర్లు చెప్పారు.

ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది. శస్త్రచికిత్స చేసి గర్భసంచి తొలగించారు. దాంతో, ఒక బాబును పెంచుకున్నాను.

మహిళ కార్టూన్

"పరిస్థితుల్లో ఎటువంటి మార్పూ లేదు"

ఒక రోజు నా భర్త కొట్టిన దెబ్బలకు నా పెదవి చిట్లిపోయింది. దాంతో, డాక్టర్ దగ్గరకు వెళితే, ఆమె గృహ హింస కేసు అని రాశారు.

"ఇక భరించలేను", ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకుని 2017లో పోలీసు స్టేషన్‌కు వెళ్లి గృహ హింస కేసు పెట్టాను.

ధైర్యం చేసుకుని పుట్టింటికి వచ్చేశాను. కానీ, పుట్టింట్లో కూడా నేను వారికి భారం అవుతానేమో అన్నట్లే చూసేవారు తప్ప, నా నిర్ణయానికి మద్దతు లభించేది కాదు.

విడాకులు కూడా తీసేసుకోవాలని నిర్ణయించేసుకున్నాను.

కానీ, లోక్ అదాలత్‌లో రెండు మూడు కౌన్సెలింగ్‌లు అయిన తర్వాత మేమిద్దరం ఒప్పందం కుదుర్చుకుని కలిసి బతికేందుకు రాజీకి వచ్చాం

"నా పెళ్ళాం నేను కొడతాను, మధ్యలో మీరెవరు అడిగేందుకు" అని ఆయన ఫ్యామిలీ కౌన్సెలర్‌ను కూడా ప్రశ్నించారు.

కానీ, అందరూ కేసు పెద్దదవుతుందని బెదిరించడంతో కలిసి ఉండేందుకు అంగీకరించారు. ఆయన వైఖరిలో మాత్రం మార్పు లేదు.

ఈ మధ్యలో మా అత్తగారు, మామగారు, మా నాన్న కూడా చనిపోయారు.

హింసను భరించే మహిళలు

"ఇక ఇప్పుడు మానసిక హింస"

అడుగులు అయితే బయటకు పడ్డాయి కానీ, ఇప్పటికీ మానసిక హింసకు మాత్రం అంతం లేదు.

"నీకు గతి లేక, మరో దారి లేక నాతో వచ్చావు" అని అంటూ ఉంటారు.

ఇప్పటికీ ఇంట్లో ఆయనకు నచ్చిన వంట మాత్రమే చేయాలి. అర్ధరాత్రి 12 గంటలకు కూడా బిరియాని వండి పెట్టమని అడుగుతూ ఉంటారు.

నాకు వంట రాదని సాధిస్తారు. నేను బాధపడితే ఆయన కళ్ళల్లో కాంతి కనిపిస్తుంది .

నేను చదువుకున్నాను అనే విషయం మర్చిపోయాను. రోజులు మర్చిపోయాను. నేనేంటో మర్చిపోయాను.

మా తమ్ముళ్లు ఇచ్చిన మద్దతుతో ఒక చిన్న ఉద్యోగంలో చేరాను".

గృహహింస

"నన్ను నేనే మార్చుకున్నాను"

నా బాబు కోసం ఆయనతో కలిసి మిగిలిన జీవితాన్ని గడిపేందుకు సిద్ధమైపోయాను. ఒక బాబును పెంచే బాధ్యత తీసుకున్నప్పుడు వాడికి కుటుంబం లేకుండా చేసే హక్కు నాకు లేదని అనుకున్నాను.

"అతనిలో మార్పు వస్తుందని ఎదురు చూడకుండా, నన్ను నేను మార్చుకున్నాను. నాకు నేనే ధైర్యం తెచ్చుకున్నాను. కానీ, 20 ఏళ్ల జీవితాన్ని కోల్పోయాను. ప్రేమకు కరువయ్యాను. ఈ సమయం తిరిగి లభిస్తుందా?" అని షబ్నమ్ వెక్కి వెక్కి ఏడుస్తూ నన్ను అడిగారు.

ఆమె నాతో మాట్లాడుతున్నంత సేపూ దుఃఖం ఆపుకోలేక కన్నీరు పెడుతూనే ఉన్నారు.

"భర్త కొట్టడం తప్పు లేదు"

ఇటీవల విడుదలైన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదిక ప్రకారం 13 రాష్ట్రాల్లో మహిళలు అత్తమామలను గౌరవించకపోతే భర్త భార్య పై చేయి చేసుకోవడాన్ని సమర్ధించారు. ఈ సర్వేను 18 రాష్ట్రాల్లో నిర్వహించారు.

ముఖ్యంగా, గృహహింసను సమర్థించేవారి శాతం ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అధికంగా ఉంది.

తెలంగాణలో 83.8 శాతం మంది మహిళలు గృహ హింసను, భర్త చేతిలో జరిగే హింసను సమర్థించారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా 83.6 శాతం మంది గృహ హింసను సమర్థించారు.

కర్ణాటకలో 81.9 శాతం మంది పురుషులు గృహ హింస ఆమోదయోగ్యమైనదే అని అభిప్రాయపడ్డారు.

భార్య భర్తతో వాదించినా.. ఇంటిని, పిల్లల బాధ్యతలను నిర్లక్ష్యం చేసినా, ఆమె విశ్వసనీయంగా లేదని భర్తకు అనుమానం కలిగినా, ఆమె వంట సరిగ్గా చేయకపోయినా, అత్తమామలకు మర్యాద ఇవ్వకపోయినా కూడా భార్యను కొట్టవచ్చని సమర్థిస్తూ కొందరు కారణాలను పేర్కొన్నారు.

ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్ (2015-2016) సర్వేలో కూడా 52 శాతం మంది భర్త భార్యను కొట్టడం సరైందే అని సమర్థించారు.

సాయి పద్మ

మహిళలు హింసాత్మక బంధాల్లో ఎందుకు కొనసాగుతారు?

ఆర్థిక స్వాతంత్య్రం లేని మహిళలు మాత్రమే కాదు, సమాజంలో అత్యున్నత స్థాయిలో ఉన్న మహిళలు కూడా హింసాత్మక బంధాల్లో కొనసాగుతున్నారు. ఒక్క ఆర్థిక స్వాతంత్య్రం మాత్రమే కాకుండా దీనికి చాలా సామాజిక కోణాలున్నాయని లీగల్ కౌన్సెలర్, సామాజిక కార్యకర్త సాయి పద్మ అంటారు.

"హింసను ఎదుర్కొనేందుకు ఆర్థిక స్వాతంత్య్రం లేకపోవడం ఒక కారణమైతే, హోదా, పరువు, లైఫ్ స్టైల్ వదులుకోలేకపోవడం, భర్త లేకుండా తమకు ఉనికి లేదనుకోవడం చాలా మంది మహిళలను బయటకు రావడానికి అవరోధాలుగా నిలుస్తూ ఉంటాయి" అని అన్నారు.

"ఆధునిక కాలంలో కూడా మహిళ బయటకు వస్తే స్వేచ్ఛగా బతికే పరిస్థితులు లేవు. కాలం ఏదైనా, మహిళలు కుటుంబం అనే చట్రం దాటి బయటకు వస్తే జీవించేందుకు వారి ముందున్న అవకాశాలు మాత్రం తక్కువే".

"దీంతో, బయట సమాజం చూసే చూపులు, వేసే ప్రశ్నలు భరించే కంటే, నాలుగు గోడల మధ్య చోటు చేసుకునే హింసను భరించడమే మంచిదని అనుకుంటూ జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు".

"మహిళకు ఆర్ధిక స్వాతంత్య్రం కంటే కూడా కావాల్సింది మానసిక, సామాజిక స్వాతంత్య్రం" అని అన్నారు.

"ఇక బయటకు వెళితే తిరిగి జీవితం నిర్మించుకోవడానికి, స్వాతంత్య్రం కోసం మహిళలు చాలా పోరాటం చేయవలసి వస్తోంది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు చాలా మంది మహిళలు సిద్ధంగా లేరు" అని అభిప్రాయపడ్డారు.

ఒంటరిగా మూడు పదులు, లేదా నాలుగు పదుల వయసులో జీవితాన్ని నిర్మించుకోలేమేమో అనే భయం, పిల్లలకు కుటుంబ రక్షణ దొరకదేమోననే భయం వారిని వెంటాడే ప్రశ్నలు. వారిని గడప దాటి బయటకు రానివ్వవు".

"మహిళలకు చేంజ్ మేనేజ్మెంట్ ఎవరూ నేర్పలేదు. ఎప్పుడూ ఒకే బంధంలో ఉండటమే నీ స్త్రీతత్వానికి ప్రతీక అనే విలువను నరనరాల్లో జీర్ణింపచేసింది పితృస్వామ్యం" అని అన్నారు.

"99 శాతం మంది మహిళలు తమ కోసం తాము కాకుండా కుటుంబం కోసమే బ్రతుకుతున్నారు. మన కోసం మనం బ్రతకాలి అనే ఆలోచన వచ్చిన నాడు సగం సమస్యలు పరిష్కారమవుతాయేమో" అని అభిప్రాయపడ్డారు.

"పోలీసులు వేసే ప్రశ్నలు, లాయర్ల చుట్టూ తిరిగే ధైర్యం లేక కొందరు హింసాత్మక బంధాల్లోనే ఉండిపోతున్నారు".

"అమ్మాయిలకు విద్య అవసరమా? అనే ప్రశ్న నుంచి ఈ రోజు మహిళల పై హింస ఎందుకు చోటు చేసుకుంటోంది? అనే ప్రశ్న వేసుకుంటున్నాం అంటే, మనం పురోగమన దిశగా వెళుతున్నామా? వెనక్కి నడిచి వెళుతున్నామా? అని అర్ధం కావడం లేదు" అని విచారం వ్యక్తం చేశారు.

"గృహహింస కేసు నమోదు చేసిన తర్వాత పోలీసు స్టేషన్‌లో రాజీకి వచ్చినా, ఇంటికి వచ్చిన తర్వాత హింస రెట్టింపు అవుతుంది తప్ప, తగ్గటం లేదు. దాంతో కొన్ని కొన్ని కేసులు విడాకులకు దారి తీస్తున్నాయి. మరి కొన్ని హింసలోనే కొనసాగుతున్నాయి" అని సాయి పద్మ అన్నారు.

పెరుగుతున్న గృహ హింస

మరోపక్క దేశంలో మహిళలపై జరుగుతున్న నేరాలు, వేధింపుల కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) లెక్కల ప్రకారం 2020లో గృహహింస చట్టం కింద 446 గృ‌హహింస కేసులు రిపోర్టయ్యాయి.

గృహ హింస చట్టం 2005 ప్రకారం గృహ హింస బాధితులు ఫిర్యాదులు చేసేందుకు, సహాయం అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ఒక స్వచ్చంద సంస్థ సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. ఈ పిటిషన్ కు సమాధానం చెప్పమని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.

దీనికి ప్రభుత్వం డిసెంబరు 06, 2021 నాటికి సమాధానం చెప్పాలి.

భారతదేశంలో గృహహింసకి సంబంధించి హెల్ప్ లైన్ 1091/1291 టోల్ ఫ్రీ నెంబర్‌కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వవచ్చు.

జాతీయ మహిళా కమిషన్ వాట్సాప్ నెంబర్: 72177-35372

ఇతర హెల్ప్ లైన్ల గురించిన సమాచారం కోసం జాతీయ మహిళా కమిషన్ వెబ్‌సైట్‌లో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Domestic violence: ‘How is it possible to have sex with an unloving husband?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X