ట్రంప్ ఆగమన్నా ఆగకుండా వెళ్లిపోయిన ప్రధాని మోదీ?
Donald Trump- Asmi Munir Lunch meeting: పాకిస్తాన్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి నిప్పులు చెరిగారు. ఘాటు వ్యాఖ్యలు చేశారు. కెనడా కననాస్కిస్ లో ఏర్పాటైన జీ7 ఔట్రీచ్ సమ్మిట్ లో పాక్ ను ఎండగట్టారు. సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోన్నందుకు పాకిస్తాన్ కు తరచూ రివార్డులు సైతం లభిస్తోన్నాయంటూ చురకలు అంటించారు.
ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలు సాగిస్తోన్న పోరాటంలో ఎటువంటి ద్వంద్వ ప్రమాణాలకు అవకాశం ఉండకూడదని, దీనికి భిన్న పరిస్థితులు నెలకొన్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదానికి బహిరంగంగా మద్దతు ఇచ్చే దేశాలకు తరచుగా రివార్డులు లభిస్తున్నాయని అన్నారు. ఈ భేటీ ముగిసిన అనంతరం ప్రధాని మోదీ క్రొయేషియా పర్యటనకు బయలుదేరి వెళ్లారు.

నిజానికి- జీ7 సమ్మిట్ సైడ్ లైన్స్ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ప్రధాని మోదీ ముఖాముఖి భేటీ కావాల్సి ఉంది. ఈ సందర్భంగా ఆయనతో చర్చించాల్సిన అంశాలను సైతం రూపొందించుకున్నారు మోదీ. పహల్గామ్ ఉగ్రవాదుల దాడి, పాకిస్తాన్ పై యుద్ధం, ఆపరేషన్ సింధూర్ వంటి విషయాలపై చర్చించాల్సి ఉంది.
ఈ భేటీ రద్దయింది. ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రతరం కావడం వల్ల డొనాల్డ్ ట్రంప్ తన జీ7 పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకున్నారు. ప్రారంభ ఉపన్యాసం అనంతరం ఆయన స్వదేశానికి తిరుగుముఖం పట్టారు. యుద్ధంపై అత్యవసర సమీక్ష నిర్వహించారు.
ట్రంప్ తన పర్యటనను కుదించుకోవాల్సి రావడం వల్ల మోదీతో ముఖాముఖి భేటీ సాధ్యపడలేదు. అక్కడ చెప్పదలచుకన్న విషయాలన్నింటినీ ఫోన్ ద్వారా వెల్లడించారు మోదీ. సుమారు 35 నిమిషాల పాటు ట్రంప్ తో మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ చేపట్టడానికి గల కారణాలను వివరించారు.
ఈ చర్చల సారాంశాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వెల్లడించారు. అలాగే- పాక్ తో యుద్ధాన్ని కొనసాగించడం లేదా నిలిపివేసే విషయంలో ఏ స్థాయిలో కూడా తాము ఎవరి సహాయాన్ని గానీ, మధ్యవర్తిత్వాన్ని గానీ కోరలేదని ప్రధాని మోదీ తెగేసి చెప్పారు. థర్డ్ పార్టీ ప్రమేయాన్ని తాము ఎప్పుడూ అడగలేదని మోదీ వివరించినట్లు మిస్రీ పేర్కొన్నారు.
అమెరికా వాణిజ్య ఒప్పందాల గురించి చర్చలు జరపలేదని అన్నారు. అదే సమయంలో కెనడాలో జీ7 సమ్మిట్ ముగిసిన అనంతరం తిరుగు ప్రయాణంలో.. అమెరికాకు రావాల్సిందిగా ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్.. ప్రధాని మోదీని ఆహ్వానించారు.
వాషింగ్టన్ లో ఆగాలని, కెనడాలో రద్దయిన ముఖాముఖి సమావేశాన్ని వైట్ హౌస్ లో కొనసాగిద్దామని సూచించారు. దీన్ని సున్నితంగా తిరస్కరించారు ప్రధాని మోదీ. ముందుగా నిర్ధారించుకున్న అధికారిక కార్యక్రమాల వల్ల తాను అమెరికా రాలేకపోతున్నానని తెలిపారు. మరోసారి కలుద్దామని బదులిచ్చారు.












Click it and Unblock the Notifications