వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Draupadi Murmu: కొత్త రాష్ట్రపతి సొంత ఊరు ఊపర్‌బేడా పరిస్థితి ఎలా ఉంది - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ఊపర్‌బేడా

ఒడిశాలోని ఊపర్‌బేడా గ్రామానికి మేం ఉదయం చేరుకునేసరికి అక్కడి మహిళలు తమ ఇళ్లలో వంట చేస్తూ కనిపించారు.

మగవారు పొలాలకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. పిల్లలు స్నానాలు చేస్తున్నారు. గ్రామంలోని కొన్ని షాపులు తెరిచే ఉన్నాయి. మరికొన్ని మూసి కనిపించాయి. పట్టణానికి వెళ్లేందుకు కొంతమంది పసుపు రంగు టెంపో (ఆటో)లో కూర్చున్నారు.

భారత రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ జరుగుతోందని టీవీ, రేడియో, ఇంటర్నెట్‌లలో వార్తలు వస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ద్రౌపది ముర్ము గెలుస్తారని అప్పటికే దాదాపుగా ఖాయమైంది.

భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచిన తర్వాత, ఒక గిరిజన వ్యక్తి రాష్ట్రపతి పదవిని చేరుకోవడం ఇదే తొలిసారి.

ఈ విషయంలో ఊపర్‌బేడా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ద్రౌపది ముర్ము ఈ గ్రామానికి చెందినవారే. ఆమె బాల్యం ఇక్కడే సాగింది. ఇక్కడే ఆమె ఇల్లు కూడా ఉంది.

ఊపర్‌బేడా

ఊపర్‌బేడా గ్రామ విశేషాలివీ..

ఒడిశా రాష్ట్రంలోని మయూర్‌భంజ్ జిల్లా కుసుమీ బ్లాక్‌లో ఊపర్‌బేడా ఉంటుంది. ఈ గ్రామం జనాభా దాదాపు 3,500.

గ్రామానికి కాస్త దూరంలోనే జార్ఖండ్ సరిహద్దులు కనిపిస్తాయి. అక్కడే ఇనుము ముడి ఖనిజం గనులు కూడా ఉన్నాయి. కొండలు, చెరువుల మధ్య ఈ గ్రామం ఉంటుంది.

భారత్‌లోని ఇతర గ్రామాల్లానే ఇక్కడి ప్రజలకు తమ అవసరాలు, కష్టాలు ఉన్నాయి. మరి ఈ గ్రామం ప్రత్యేకత ఏమిటంటే.. ఒక రాష్ట్రపతిని భారత్‌కు ఈ గ్రామం అందిస్తోంది.

ఊపర్‌బేడా‌లో మూసివున్న ఆసుపత్రి

రాయ్‌రంగ్‌పుర్ ఎమ్మెల్యేగా..

ద్రౌపది ముర్ముపై వార్తలు రావడం, ఇక్కడి ప్రజలు ఆమె గురించి మాట్లాడుకోవడం ఇదేమీ తొలిసారి కాదు. రాయ్‌రంగ్‌పుర్ ఎమ్మెల్యేగా, ఒడిశా ప్రభుత్వంలో మంత్రిగా, జార్ఖండ్ గవర్నర్‌గా ఆమె పనిచేశారు.

ఆమె సొంత ఊరు ఊపర్‌బేడాతోపాటు ఆమె అత్తింటి ఊరు పహాడ్‌పుర్ కూడా రాయ్‌రంగ్‌పుర్ నియోజకవర్గంలోనే ఉంటుంది.

అయితే, ఇప్పటికీ ఇక్కడి ప్రజలకు విద్యుత్, తాగు నీరు, రోడ్లు, కాలేజీలు, ఆసుపత్రులు, బ్యాంకులు లాంటి మౌలిక సదుపాయాలు పూర్తిగా ఎందుకు అందడం లేదు?

ఈ ప్రశ్నపై ఊపర్‌బేడా సర్పంచ్ ఖేలారామ్ హాంసదా బీబీసీతో మాట్లాడారు. ఇక్కడ అభివృద్ధి జరగలేదని అనుకోకూడదని ఆయన అన్నారు. ద్రౌపది ముర్ము ఎమ్మెల్యే అయిన తర్వాత, ఇక్కడ కొత్త రోడ్లు నిర్మించారని, విద్యుత్ సౌకర్యం కూడా కల్పించారని ఆయన వివరించారు.

సర్పంచ్ ఖేలారామ్ హాంసదా

''గ్రామంలో తాగునీటి పైప్‌లైన్‌లు వేశారు. గ్రామానికి వెళ్లే దారిలో కాన్హు నదిపై ఒక వంతెన కూడా నిర్మించారు. ఇక్కడ ఒక జంతువుల ఆసుపత్రిని తెరిచారు. చాలా ప్రభుత్వ పథకాలు ఇక్కడి ప్రజలకు అందుతున్నాయి. అయితే, చేయాల్సింది ఇంకా చాలా ఉంది'' అని ఆయన చెప్పారు.

''ఊపర్‌బేడా ఒక డిజిటల్ గ్రామం. అయితే, డిజిటల్ గ్రామంలో ఉండాల్సిన సౌకర్యాలన్నీ ఇక్కడ లేవు. ఒక బ్యాంకును ఏర్పాటు చేయాలి. హైస్కూలును హైయర్ సెకండరీ స్కూలుగా మార్చాలి. అప్పుడు 12వ తరగతి వరకు ఇక్కడే చదువుకోవచ్చు. గ్రామ ఆసుపత్రిలో 14 బెడ్‌లు ఉండేలా చూడాలి'' అని ఖేలారామ్ వివరించారు.

''ఇక్కడ సరిపడా వైద్యులు, నర్సులను నియమించాలి. మౌలిక సదుపాయాలను మెరుగు పరచాలి. ఎందుకంటే ఆసుపత్రికి తీసుకెళ్లే 108 వాహనం కోసం ఎదురుచూస్తూ కూర్చుంటే ప్రాణాలు పోయే ప్రమాదముంది'' అని ఆయన అన్నారు.

ఝిగ్గీ నాయక్

కాలేజీ కోసం 20 కి.మీ. దూరం వెళ్లాలి..

కాలేజీకి వెళ్లాలంటే ఊపర్‌బేడా నుంచి 20 కి.మీ. దూరం ప్రయాణించాలి. దీంతో చాలా మంది అమ్మాయిలు స్కూల్ పూర్తయిన తర్వాత చదువు మానేస్తున్నారు. కొందరు మాత్రం సైకిల్ మీద అంత దూరం ప్రయాణించి రోజూ కాలేజీకి వెళ్తున్నారు.

ద్రౌపది ముర్ము ఇంటికి పొరుగునుండే ఝిగ్గీ నాయక్ డిగ్రీ చదువుతున్నారు. రోజూ కాలేజీకి అంత దూరం వెళ్లడం కాస్త కష్టంగానే ఉంటుందని ఆమె చెప్పారు.

''ఈ గ్రామంలోని అబ్బాయిలు బైక్ లేదా సైకిల్ మీద వెళ్తుంటారు. కానీ, మేం కాలేజీకి వెళ్లడానికి చాలా కష్టపడాల్సి వస్తోంది. మొదట్లో నేను కూడా సైకిల్ మీద వెళ్లేదాన్ని. ఇప్పుడు ప్రధాన రహదారి వరకు వచ్చి బస్సు ఎక్కి వెళ్తున్నా. మేం కాలేజీలో చదువుకోవాలి. ఇక్కడే ఆ కాలేజీని ఏర్పాటుచేస్తే, ఇన్ని సమస్యలు ఉండవు'' అని ఆమె బీబీసీతో అన్నారు.

''మా గ్రామం జనాభా కూడా ఎక్కువే. ఇక్కడ కాలేజీని తెరిస్తే, ఊపర్‌బేడాతోపాటు చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులకూ చాలా ఉపయోగంగా ఉంటుంది. ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా బాధ్యతలు తర్వాత ఈ సమస్య పరిష్కారం అవుతుందని అనుకుంటున్నా'' అని ఆమె ఆశాభావం వ్యక్తంచేశారు.

జగన్నాథ్ మండల్

విద్యుత్ మాత్రం..

ఊపర్‌బేడాకు ఏళ్ల క్రితమే విద్యుత్ వచ్చింది. అయితే, కేవలం గ్రామంలోని ఒకవైపు ఇళ్లకు మాత్రం ఇటీవల విద్యుత్ సరఫరా వచ్చింది. ద్రౌపది ముర్మును ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాతే విద్యుత్ సరఫరా మొదలైందని గ్రామస్థులు చెబుతున్నారు.

''డుంగరీసాయీ టోలె ప్రాంతంలోని ఇళ్లకు ఇంతకుముందు వరకు విద్యుత్ ఉండేది కాదు. ఇక్కడున్న 35 ఇళ్లూ రాత్రిపూట లాంతరులోనే గడిపేవి'' అని ఇక్కడ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న జగన్నాథ్ మండల్ చెప్పారు.

''విద్యుత్ విభాగం అధికారులు గత నెలలో ఆగమేఘాలపై ఇక్కడ విద్యుత్ సరఫరా చేశారు. ఇప్పుడు ప్రజలకు ఇళ్లలో విద్యుత్ ఉంది. అయితే, చాలా మందికి పక్కా ఇళ్లు లేవు'' అని ఆయన తెలిపారు.

ఎందుకిలా?

విద్యుత్ సరఫరాపై కుసుమీ బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (బీడీవో) లాఖ్మన్ చరణ్‌తో బీబీసీ మాట్లాడింది. ''ఊపర్‌బేడా గ్రామానికి ఎప్పటినుంచో విద్యుత్ సరఫరా చేస్తున్నాం. అయితే, ప్రజలు తక్కువగా నివసించే కొన్ని ప్రాంతాలకు కొంత కాలం ముందువరకు విద్యుత్ ఉండేది కాదు. తాజాగా ఆ ప్రాంతాలకు కూడా లైన్లు వేశాం'' అని ఆయన అన్నారు.

''కొన్ని కొత్త ఇళ్లకు విద్యుత్ సరఫరాకు కొంత సమయం పడుతుంది. ఇప్పుడు పనుల్లో వేగం పెంచాం'' అని ఆయన వివరించారు.

ద్రౌపది ముర్ము చదువుకున్న స్కూల్

ద్రౌపది ముర్ము స్కూల్ ఇదీ..

గ్రామం మధ్యలో ఉండే స్కూలుకు ఈ మధ్య కాలంలో చాలా మంది వచ్చిపోతున్నారు. ఇక్కడే ప్రాథమిక విద్యను ద్రౌపది ముర్ము అభ్యసించారు.

ఇక్కడ చాలా కొత్త భవనాలు నిర్మించారు. అయితే, స్కూలు భవనం ముందున్న గదులకు పైకప్పులు లేవు. ఇక్కడే ఒకప్పుడు ద్రౌపది చదువుకున్నారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మనోరంజన్ ముర్మూ

పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మనోరంజన్ ముర్ముతో బీబీసీ మాట్లాడింది. ''అప్పట్లో ఈ స్కూలులో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు మాత్రమే ఉండేది. వేరే స్కూలులో ఆరు, ఏడు తరగతులు ఉండేవి. ఇప్పుడు ఆ రెండు స్కూళ్లను కలిపేశారు. ఈ స్కూల్‌లోనే ద్రౌపది ముర్ము చదువుకోవడం మాకు చాలా గర్వంగా ఉంది'' అని ఆయన అన్నారు.

మరోవైపు ఇక్కడ ఏడో తరగతి చదువుతున్న తునుశ్రీ ఒరామ్ కూడా మాట్లాడింది. ద్రౌపది ముర్ము స్కూలులో తాను చదువుకోవడం చాలా ఆనందంగా ఉందని తను చెప్పింది. అయితే, పెద్దయిన తర్వాత తను సైన్యంలో చేరతానని వివరించింది.

ద్రౌపదీ ముర్మూ ఇల్లు

ద్రౌపది ముర్ము ఇల్లు ఎలా ఉంది?

ద్రౌపది ముర్ము పుట్టిన ఇల్లు ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. అక్కడ ఒక పసుపు రంగు పక్కా ఇల్లు కనిపిస్తోంది. అయితే, ఇంటి లోపల ప్రాంతాలు మాత్రం ద్రౌపది చిన్నప్పుడు ఎలా ఉండేవో ఇప్పటికీ అలానే ఉన్నాయి. ఇప్పుడు ద్రౌపది అన్నయ్య కోడలు దులారీ టుడూ ఇక్కడ జీవిస్తున్నారు.

ద్రౌపది ముర్ము

''ద్రౌపది చిన్ననాటి జ్ఞాపకాలు పదిలంగా ఉండేలా చూసేందుకు ఆ ఇంటి లోపల అన్ని ప్రాంతాలనూ అలానే ఉంచేశాం. ఆమె ఇక్కడకు వచ్చినప్పుడు వీటిని చూసి చాలా సంతోష పడుతుంటారు. ప్రత్యేక వంటకమైన పఖల్ అంటే ఆమెకు చాలా ఇష్టం. రాష్ట్రపతిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా ఆమె ఇక్కడకు రావాలని మేం కోరుకుంటున్నాం. ఆమె రాష్ట్రపతి అవుతున్నారని ఈ గ్రామంలో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు'' అని దులారీ చెప్పారు.

''అసలు ఊహించలేదు''

ద్రౌపది ముర్ముకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయుడు విశ్వేశ్వర్ మహంతోతోనూ బీబీసీ మాట్లాడింది. ఇప్పుడు ఆయన వయసు 82 ఏళ్లు. చిన్నప్పటి నుంచి ద్రౌపది చాలా చురుగ్గా ఉండేవారని, గొప్ప వ్యక్తుల ఆత్మకథలు చదవడమంటే ఆమెకు చాలా ఇష్టమని ఆయన అన్నారు.

''సరైన సమయానికి ద్రౌపది పాఠశాలకు వచ్చేది. అడిగిన అన్ని ప్రశ్నలకూ సరైన సమాధానాలు చెప్పేది. ఒకవేళ తనకు ఏమైనా అర్థంకాకపోతే, వెంటనే ప్రశ్నలు అడిగేది. బాగా చదువుకొని ఆమె మంచి అధికారిణి అవుతుందని మేం భావించాం. కానీ, ఇప్పుడు ఏకంగా ఆమె రాష్ట్రపతి అయ్యారు. ఆమె ఇంత ఎత్తుకు వెళ్తారని మేం ఎప్పుడూ ఊహించలేదు'' అని ఆయన వివరించారు.

స్నేహితులు ఏం అంటున్నారు?

ఊపర్‌బేడా గ్రామస్థులు ఒకవైపు సంతోషం వ్యక్తంచేస్తూనే మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని కూడా అడుగుతున్నారు.

అలా అడిగిన వారిలో గోవింద్ మాంఝీ ఒకరు. ద్రౌపది ముర్ముతో కలిసి మాంఝీ ఐదో తరగతి వరకు చదువుకున్నారు. వారిద్దరూ బాల్య స్నేహితులు.

''ఆమె దేశానికి తొలి గిరిజన రాష్ట్రపతి అయ్యారు. ఇంతకంటే విశేషం ఏముంటుంది. అదే సమయంలో గిరిజనుల భాష, మతాల కోసం రాజ్యాంగంలో కొత్త నిబంధనలు తీసుకొచ్చేందుకు ఆమె కృషి చేయాలి'' అని మాంఝీ అన్నారు.

తల్లితో ద్రౌపది ముర్ము

ప్రజల ఆశలు, ఆకాంక్షల నడుమ ఊపర్‌బేడా కోలాహలంగా కనిపిస్తోంది. దేశానికి ఒక రాష్ట్రపతిని ఇస్తున్నామన్న ఉత్సాహం ఈ గ్రామవాసుల్లో నిండుగా ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Draupadi Murmu: How is the new President's hometown Ooperbeda - BBC Ground Report
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X