జమ్మూలో మరోసారి డ్రోన్ల కలకలం .. ఇప్పటివరకు 7 డ్రోన్లు, సరిహద్దులో గస్తీ పెంపు !!
జమ్మూకాశ్మీర్లో డ్రోన్ల కలకలం ఆగడం లేదు . జమ్ములోని సైనిక శిబిరాలకు సమీపంలో తాజాగా మరోమారు డ్రోన్ లు కనిపించాయి. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. డ్రోన్ల సహాయంతో దాడులకు పాల్పడాలని గత 4 రోజులుగా ఉగ్రవాదులు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. సైన్యానికి సంబంధించి కీలకమైన స్థావరాలను టార్గెట్ చేస్తూ పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులు డ్రోన్‌ల ద్వారా దాడులకు ప్రయత్నం చేయడం ఇదే మొదటిసారి.
Recommended Video
మొదట ఆదివారం తెల్లవారుజామున జమ్మూ విమానాశ్రయంలోని ఐఎఎఫ్ స్టేషన్‌లో డ్రోన్ల సాయంతో రెండు బాంబులతో దాడికి యత్నించారు. డ్రోన్ల సహాయంతో వైమానిక దళం పై దాడి చేయడానికి ప్రయత్నించారు. ఈ దాడులలో స్వల్ప నష్టం వాటిల్లింది. ఆ తర్వాత రత్నుచక్-కలుచక్ స్టేషన్ వద్ద రెండు డ్రోన్లు తిరగడంతో భద్రతా దళాలు అలర్ట్ అయ్యి 22 రౌండ్లు కాల్పులు జరిపాయి. దీంతో డ్రోన్లు అక్కడినుండి వెళ్ళిపోయాయి. ఆ డ్రోన్ల కోసం గాలింపు చేపట్టారు. మంగళవారం కూడా సుమ్మవాన్ సైనిక ప్రాంతంతో సహా జమ్మూలోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో డ్రోన్లు ఉన్నట్లు ఆర్మీ తెలిపింది.

జమ్మూలోని సైనిక శిబిరాలు సమీపంలో డ్రోన్లు ప్రత్యక్షం కావడంతో సైన్యం అలర్ట్ అయింది. గస్తీని ముమ్మరం చేసింది. జమ్ము నగరం లోని మిరాన్ సాహిబ్ , కలుచక్ , కుంజావని ప్రాంతాలలో ఈ డ్రోన్లు కనిపించడంతో సైన్యం అలర్ట్ అయింది. ఈ డ్రోన్స్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న భారత్ ఈ కేసు దర్యాప్తు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ కు అప్పగించింది. కేంద్ర హోం శాఖ ఇప్పటికే ఈ వ్యవహారంపై దృష్టిసారించింది. సమగ్ర దర్యాప్తు కు ఆదేశాలు జారీ చేసింది. జమ్ము వైమానిక స్థావరం పై డ్రోన్లతో దాడి చేసిన ఘటన నేపథ్యంలో ఎన్ఐఏ కు దీనిపై దర్యాప్తు అప్పజెప్పిన మరుసటిరోజే మరోమారు డ్రోన్లు తిరగడం మిలటరీ వర్గాలను ప్రమత్తం చేస్తోంది.
మరింత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అని భావించి బోర్డర్ లో సైనిక గస్తీని మరింత ముమ్మరం చేసింది. ఇప్పటివరకు నాలుగు రోజులుగా జమ్మూ నగరంలోని మిలిటరీ స్థావరాలు వద్ద ఏడు డ్రోన్లు లభించటం ఆందోళన కలిగిస్తున్న అంశం .ఇక ఈ డ్రోన్ల వెనుక పాకిస్తానీ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ఉన్నట్టు తెలుస్తుంది.












Click it and Unblock the Notifications