వయనాడ్ ఉపఎన్నికకు ఈసీ ఏర్పాట్లు.. భగ్గుమన్న కాంగ్రెస్!!
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేయడంతో ఖాళీ అయిన వయనాడ్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించడానికి ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేయనప్పటికీ, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు ఈవీఎంలను, వీవీప్యాట్ లను సిద్ధం చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ పలు అనుమానాలను వ్యక్తం చేస్తుంది.
ఉప ఎన్నికల సన్నాహాల్లో భాగంగా కోజికోడ్ కలెక్టరేట్లో మాక్ పోలింగ్ నిర్వహించారు. భారత ఎన్నికల సంఘం సూచనల మేరకే మాక్ పోలింగ్ నిర్వహించినట్టుగా అధికారులు తెలిపారు. ఎన్నికల ఇన్చార్జిగా ఉన్న డిప్యూటీ కలెక్టర్ ఆధ్వర్యంలో మాక్ పోలింగ్ నిర్వహించబడింది. అంతకుముందు మాక్ పోలింగ్ కు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరుకావాలని ఎన్నికల అధికారులు నోటీసులు జారీ చేశారు.

ఇక వయనాడ్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ సిద్ధం కావడంపై ఇప్పుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా రాజకీయ కుట్రలో భాగంగానే చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అయితే పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టులో వేసిన పిటిషన్ పెండింగ్లో ఉన్నప్పటికీ ఈసీ ఉప ఎన్నికకు సన్నాహాలు చేస్తుండడం పైన కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
లోక్సభలో అదానిపై మాట్లాడటం వల్లనే రాహుల్ గాంధీపై బీజేపీ ప్రభుత్వం కక్ష పెంచుతుందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఎవరి సూచనల మేరకు ఎన్నికల సంఘం ఉప ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోందో భారత ప్రజలకు చెప్పాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇందులో ఏదో రహస్యం ఉందని, ఇది కచ్చితంగా అనుమానించాల్సిన విషయమేనని వారు అంటున్నారు.
రాహుల్ గాంధీని టార్గెట్ చేసి బీజేపీ వేసిన ఎత్తుగడ వల్ల రాహుల్ గాంధీకి వచ్చిన నష్టం లేదని, ఆయన మరింత స్ట్రాంగ్ అయ్యారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మరి వయనాడ్ ఉపఎన్నిక విషయంలో ముందు ముందు ఏం జరగనుందో అన్ని రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది.












Click it and Unblock the Notifications