60లక్షల నకిలీ ఓటర్లు: కాంగ్రెస్ ఆరోపణలపై విచారణకు ఆదేశించిన ఈసీ!
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ ఓటర్ల జాబితాలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితాపై విచారణకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
విచారణ కోసం రెండు టీమ్స్ ను నియమించిన ఈసీ.. జూన్ 7వ తేదీ లోగా నివేదికను సమర్పించాల్సిందిగా కోరింది. దీంతో మధ్యప్రదేశ్ లోని నరేలా, భోజ్ పూర్, సియోని-మాల్వా, హోషంగాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ కార్డుల అవకతవకలపై ఈసీ నియమించిన టీమ్స్ విచారణ జరపనున్నాయి.

కాగా, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ బీజేపీపై పలు ఆరోపణలు చేసింది. 2019ఎన్నికల కోసం బీజేపీ భారీ ఎత్తున నకిలీ ఓటర్ కార్డులను తయారుచేస్తోందని ఆరోపించింది. రాష్ట్రంలో దాదాపు 60లక్షల బోగస్ ఓట్లు ఉన్నట్టుగా ఆరోపించింది. దీనికి సంబంధించిన ఆధారాలను కూడా ఈసీకి సమర్పించింది.
'ఈసీకి మేము ఆధారాలు సమర్పించాం. రాష్ట్రంలో దాదాపు 60లక్షల నకిలీ ఓటర్ కార్డులు ఉన్నాయి. ఇది రాష్ట్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆదేశాల మేరకే సాగింది.' అని కాంగ్రెస్ నేత కమల్ నాథ్ ఆరోపించారు. ఇదే విషయంపై మరో కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య తీవ్రంగా మండిపడ్డారు.
'గత 10ఏళ్లలో రాష్ట్ర జనాభా 24శాతం పెరిగితే ఓటర్లు మాత్రం 40 శాతం పెరగడమేంటి?.. ఇదెలా సాధ్యం?.. చాలాచోట్ల మేము పరిశీలించాం. ఒక్క ఓటరు పేరు 26 ఓటర్ లిస్టుల్లో నమోదైంది.' అని ఆరోపించారు.












Click it and Unblock the Notifications