వెంటనే హనుమాన్ చాలీసా పారాయణాన్ని ఆపండి
బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ఆరంభం కానుంది. అయిదు కోట్ల మందికి పైగా ఉన్న ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోబోతోన్నారు. మొత్తం 224 నియోజకవర్గాలకు బుధవారం ఒకే విడతలో పోలింగ్ జరుగనుంది. 13వ తేదీన ఓట్ల లెక్కింపు.
పోలింగ్‌ను పకడ్బందీగా నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, ఇతర పోలింగ్ సామాగ్రిని సిద్ధం చేసింది. ఈ సాయంత్రం పోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన కేంద్రాలను బయలుదేరి వెళ్లనున్నారు. కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారికి రవాణా వసతిని కల్పించింది. ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది.

రాష్ట్రవ్యాప్తంగా సమస్యాత్మక, సున్నిత ప్రాంతాలను ఇదివరకే గుర్తించింది కేంద్ర ఎన్నికల కమిషన్. అలాంటి చోట్ల అదనపు పోలీసు బలగాలను మోహరించనుంది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ నిర్వహించనుంది. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండటానికి ముందు జాగ్రత్త చర్యలను తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్‌ను విధించింది. మద్యం అమ్మకాలపైనా నిషేధం విధించింది.
ఈ పరిణామాల మధ్య విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు కర్ణాటక వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. బెంగళూరు విజయనగరలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి కర్ణాటకకే చెందిన కేంద్ర మంత్రి శోభా కరంద్లాజె దీనికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
పలువురు బీజేపీ నాయకులు ఇందులో పాల్గొన్నారు. హుబ్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై పాల్గొన్నారు. స్థానిక ఆంజనేయస్వామి ఆలయంలో ఈ ఉదయం హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. హనుమాన్ చాలీసాను పఠించారు. ఆ సమయంలో ఆయన వెంట పలువురు బీజేపీ నాయకులు ఉన్నారు.

ఇది కొనసాగుతుండగానే కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. వెంటనే హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలన్నింటినీ నిలిపివేయాలంటూ విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులను ఆదేశించారు. తమ ఆదేశాలను కాదని దీన్ని కొనసాగించితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 144 సెక్షన్ అమలులో ఉందని అయిదుమంది కంటే ఎక్కువ మంది గుమికూడదని సూచించారు.












Click it and Unblock the Notifications