National Herald case: సోనియా, రాహుల్ గాంధీపై ఈడీ ఛార్జ్‌షీట్.. నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక మలుపు !
కాంగ్రెస్ పార్టీకి మరోసారి చిక్కులు తప్పేలా లేదు. నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక మలుపు తిరిగింది. మనీలాండరింగ్‌కు సంబంధించి ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) కీలక ముందడుగు వేసింది .పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతోపాటు పలువురు ప్రముఖ కాంగ్రెస్ నేతలపై అధికార యంత్రాంగం ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఇటీవలే రూ.661 కోట్ల విలువైన స్థిరాస్తులను స్వాధీనం చేసుకోవాలని నోటీసులు జారీ చేసిన కొన్ని రోజులకే ఈ పరిణామ చోటుచేసుకోవడం గమనార్హం. తాజాగా ఈడీ ఛార్జీషీట్ దాఖలు చేయడంతో ఈ కేసు వ్యవహారం మరింత రాజకీయంగా వేడెక్కించనుంది.
ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ తన ఫిర్యాదును నమోదు చేసింది. నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక ద్వారా నిధుల దుర్వినియోగం జరిగినట్టు ఈడీ ఆరోపిస్తోంది. యంగ్ ఇండియా, అసోసియేటెడ్ జర్నల్స్ సంస్థల మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీల్లో అనేక అనుమానాస్పద అంశాలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో అక్రమంగా నిధులు మళ్లించినట్టు ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది.

ఈ కేసు కేంద్రంగా నిలిచిన నేషనల్ హెరాల్డ్ పత్రికను అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL) ప్రచురిస్తోంది. ఈ సంస్థ యాజమాన్యం యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు చెందింది. కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్‌లు ఇందులో కీలక భాగస్వాములుగా ఉన్నట్లు ఈడీ ఆరోపిస్తోంది.
ఈడీ సమాచారం ప్రకారం, గతంలో నవంబర్ 2023లోనే రూ.661 కోట్ల విలువైన స్థిరాస్తులతో పాటు, రూ.90.2 కోట్ల విలువైన AJL షేర్లను కూడా జప్తు చేసింది. ఇది నేరపూరిత లాభాలను భద్రపరచేందుకు, అభియుక్తులు వాటిని విక్రయించి పారిపోయే అవకాశాలను నిరోధించేందుకు తీసుకున్న చర్యగా తెలిపింది. ఈ మొత్తం వ్యవహారంలో ముడిపడి ఉన్న నేర లాభాల మొత్తం రూ.988 కోట్లు అని ఈడీ అంచనా వేసింది.
ఈడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌పై ఈనెల 25న కోర్టు విచారణ చేపట్టనుంది. రౌస్ అవెన్యూ కోర్టు తదుపరి చర్యలపై రాజకీయంగా తీవ్ర చర్చ జరుగుతోంది. గతంలో ఈ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఈడీ ఎదుట హాజరైన సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ ఆరోపణలను పూర్తిగా ఖండిస్తోంది. ఇది కేంద్రం బహిరంగంగా ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుని అడుగులు వేస్తోందని విమర్శిస్తోంది. తాజా ఛార్జ్‌షీట్ దాఖలుతో ఈ వ్యవహారం మరింత వేడెక్కే అవకాశముంది.












Click it and Unblock the Notifications