Maharastra: మళ్లీ నేనే సీఎం- మనసులో మాట చెప్పేసిన షిండే-ఎన్డీయే భేటీ రద్దు..!
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించినా ఇప్పటివరకూ సీఎంను ఎంచుకోలేని పరిస్ధితుల్లో ఉన్న ఎన్డీయేకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే ఇవాళ గట్టి షాక్ ఇచ్చారు. ఇప్పటికే కీలకమైన ముఖ్యమంత్రి ఎంపిక సమావేశాలకు హాజరు కాకుండా తప్పించుకుని సొంత గ్రామానికి వెళ్లిపోయిన షిండే.. ఇవాళ మాత్రం ఏకంగా మనసులో మాట చెప్పేశారు. దీంతో ఇవాళ జరగాల్సిన కీలకమైన ఎన్డీయే సమావేశం రద్దయింది.
నవంబర్ 23న మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడిన వారం రోజుల తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రిపై కొనసాగుతున్న సస్పెన్స్ మధ్య ఏక్ నాథ్ షిండే కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ప్రజల ముఖ్యమంత్రినని, నిజానికి తాను ముఖ్యమంత్రిని కాదని, సామాన్యుడిని అని చెప్పుకునేవాడిని అని షిండే ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో తెలిపారు. సామాన్యుడిగా ప్రజల సమస్యలు, బాధలను అర్థం చేసుకుని వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నించానన్నారు. సామాన్యుడిగా పనిచేశానని, తాను ముఖ్యమంత్రిని కావాలని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు.

ఎన్నికల ఫలితాల తర్వాత ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో చర్చలు జరిపిన షిండే.. మహాయుతి ప్రభుత్వ ఏర్పాటుకు తాను అడ్డంకిగా వ్యవహరించనని చెప్పారు. ఏ నిర్ణయమైనా తనకు ఆమోదయోగ్యమైనదేనని, తన పార్టీకీ అదే ఆమోదయోగ్యమని షిండే స్పష్టం చేశారు. ఇప్పుడు ప్రజలు తననే సీఎంగా కోరుకుంటున్నారని చెప్పడం ద్వారా ఎన్డీయే కూటమిలో కలకలం రేపారు. దీంతో ఇవాళ నిర్వహించాల్సిన ఎన్డీయే కూటమి భేటీ కాస్తా వాయిదా పడింది. మరోవైపు తాను ఉపముఖ్యమంత్రి పదవి తీసుకుంటానంటూ జరుగుతన్న ప్రచారాన్ని షిండే కుమారుడు శ్రీకాంత్ ఖండించారు.












Click it and Unblock the Notifications