దేశ 15వ రాష్ట్రపతిగా: ప్రమాణ స్వీకారం టైమ్ లైన్ ఇదే: సీజేఐ ఎన్వీ రమణ
న్యూఢిల్లీ: దేశ కొత్త రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము సోమవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల గవర్నర్లు, లెప్టినెంట్ గవర్నర్లు, ముఖ్యమంత్రులకు ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. అన్ని పార్టీల సభాపక్ష నేతలకు ఆహ్వానపత్రాలను పంపించారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీ కాలం ఇవ్వాళ్టితో ముగియబోతోంది. ఈ సందర్భంగా ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ధన్యవాదాలను తెలియజేయనున్నారు.

ప్రధాన కార్యాలయాలు మూసివేత..
ఉదయం 10:15 నిమిషాలకు పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేస్తారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేయనున్నారు. తెల్లవారు జామున 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మూసివేయాలంటూ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ) ఇదివరకే ఆదేశాలు జారీ చేసింది.

అన్ని బ్లాక్‌లు..
కేంద్ర ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలు కొనసాగుతున్న సౌత్ బ్లాక్, నార్త్ బ్లాక్, రైల్ భవన్, కృషి భవన్, శాస్త్రి భవన్, సంచార్ భవన్, పీటీఐ బిల్డింగ్, ఆల్ ఇండియా రేడియో, సేనా భవన్, వాయు భవన్, ఉద్యోగ్ భవన్, నిర్మాణ్ భవన్ ఈ జాబితాలో ఉన్నాయి. ఉదయం 9:17 నిమిషాలకు ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం కార్యక్రమం మొదలవుతుంది. ముర్ము స్వాగతం పలకడానికి ఆయన కమిటీ ఆఫ్ కావేరి వద్దకు చేరుకుంటారు.

టైమ్ లైన్ ఇదే..
9:22 నిమిషాలకు ద్రౌపది ముర్ము నార్త్ కోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడ ఆమెకు ఏడీసీ ఘన స్వాగతం పలుకుతారు. అనంతరం కమిటీ ఆఫ్ కావేరీ వద్ద రామ్‌నాథ్ కోవింద్ ఆమెకు ఆహ్వానం పలుకుతారు. 9:37 నిమిషాలకు రాష్ట్రపతి భవన్ మిలటరీ సెక్రెటరీ, బాడీగార్డుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. 9:42 నిమిషాలకు రామ్‌నాథ్ కోవింద్‌తో కలిసి దర్బార్ హాల్‌కు బయలుదేరి వెళ్తారు. దర్బార్ హాల్‌లో గౌరవ వందనం కార్యక్రమం ముగిసిన తరువాత రాష్ట్రపతి భవన్ నుంచి పార్లమెంట్ హౌస్‌కు వెళ్తారు.

సీజేఐ ఎన్వీ రమణ..
సెంట్రల్ విస్టా మీదుగా పార్లమెంట్ హౌస్‌కు చేరుకుంటారు. 10:11 పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమం మొదలవుతుంది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన నోట్‌ను హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి చదివి వినిపిస్తారు. 10:14 నిమిషాలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ.. ద్రౌపది ముర్ముతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. నాలుగు నిమిషాల పాటు ప్రమాణ స్వీకారం కొనసాగుతుంది. 10:18 నిమిషాలకు రిజిస్టర్‌లో సంతకం చేస్తారు. 10:23 నిమిషాలకు తొలి ప్రసంగం ఉంటుంది. 10:35 నిమిషాలకు ఈ కార్యక్రమం ముగుస్తుంది.

గవర్నర్లు, ముఖ్యమంత్రులు..
ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల గవర్నర్లు, ముఖ్యమంత్రులకు ఆహ్వానం పంపించారు. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కే చంద్రశేఖర్ రావు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. వైఎస్ జగన్ ఢిల్లీకి వెళ్లడం దాదాపు ఖాయమైంది. వరద ప్రాంతాల పర్యటనను కూడా మంగళవారానికి వాయిదా వేసుకున్నారు. ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే కొందరు కేంద్ర మంత్రులను కలుస్తారు.












Click it and Unblock the Notifications