హృదయవిదారకం: కొడుకు మృతదేహం ఇవ్వటం కోసం లంచం డిమాండ్.. భిక్షాటన చేస్తున్న వృద్ధదంపతులు
బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఓ వృద్ధ దంపతులు ఇంటింటికీ తిరుగుతూ యాచిస్తున్న ఘటన అందరి మనసులను కలచివేసింది. చనిపోయిన తమ కుమారుడి మృతదేహాన్ని ఆసుపత్రి నుండి తిరిగి ఇవ్వడం కోసం రూ.50,000 చెల్లించాలని ఆస్పత్రి ఉద్యోగి లంచం డిమాండ్ చేయడంతో ఆ డబ్బుల కోసం వృద్ధ దంపతులు ఇంటింటికి తిరుగుతూ భిక్షాటన చేస్తున్నారు.

కొడుకు మృతదేహం కోసం లంచం ఇవ్వటానికి తల్లిదండ్రుల భిక్షాటన
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న హృదయ విదారక వీడియోలో, వృద్ధ దంపతులు, మహేష్ ఠాకూర్ మరియు అతని భార్య తమ కుమారుడి మృతదేహాన్ని పొందడం కోసం, ఆసుపత్రి ఉద్యోగికి చెల్లించడానికి లంచం కోసం డబ్బు ఇవ్వమని ప్రజలను వేడుకుంటూ ఇల్లిల్లు తిరుగుతున్నారు. ఈ ఘటన మన సమాజంలో వేళ్ళూనుకున్న అవినీతికి అద్దం పడుతుంది. కనీసం మానవత్వం కూడా లేకుండా ప్రవర్తించిన ఆస్పత్రి సిబ్బంది నిర్వాకానికి నిదర్శనంగా నిలుస్తుంది.
కొడుకు మృతదేహం ఇవ్వాలంటే 50 వేలు ఇవ్వాలని లంచం డిమాండ్ చేసిన ఆస్పత్రి సిబ్బంది
ఇక విషయం ఏమిటంటే మహేష్ ఠాకూర్ కుమారుడు కొంతకాలం క్రితం కనిపించకుండా పోయాడు. అతని కోసం వెతుకుతున్న క్రమంలో ఒకరోజు అతని మృతదేహం సదర్ ఆసుపత్రిలో ఉందని వారికి తెలియజేసే కాల్ వచ్చింది. వారి చిన్న కుమారుడి మరణం వారిని తీవ్ర ఆవేదనకు గురి చేసింది. తమ కుమారుడి మృతదేహాన్ని ఇవ్వాలని ఆస్పత్రి సిబ్బందిని కోరగా వారు 50వేల రూపాయల లంచం డిమాండ్ చేశారు. అంత డబ్బులు ఇచ్చి కొడుకు మృతదేహం తీసుకురాలేని ఆర్ధిక స్థితి వారిది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న భిక్షాటన వీడియో
మహేష్ ఠాకూర్ మరియు అతని భార్య కుమారుడి మృతదేహాన్ని తీసుకువచ్చి అతని మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే వారి వద్ద ఆస్పత్రి సిబ్బంది అడిగినంత లంచం లేకపోవటంతో ఆ డబ్బుల కోసం ఇల్లిల్లూ తిరుగుతూ భిక్షాటన చేస్తున్నారు. కొడుకు చనిపోయిన పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రుల దయనీయ పరిస్థితి స్థానికుల మనసులను కలచివేస్తుంది. ఇక వీరు భిక్షాటన చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

లంచం అడిగిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న ఆస్పత్రి ఉన్నతాధికారులు
సదర్ ఆసుపత్రి ఉద్యోగి నా కొడుకు మృతదేహాన్ని ఇవ్వటానికి 50,000 ఇవ్వాలని అడిగారు . మేం పేదవాళ్లం, ఇంత మొత్తం ఎలా చెల్లించాలి? అందుకే యాచిస్తున్నాం అని మహేష్ ఠాకూర్ చెప్పారు. తమకు తమ కుమారుడి మృతదేహం అప్పగించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వ్యవహారం సదర్ ఆస్పత్రి ఉన్నతాధికారులకు తెలిసింది. డాక్టర్ ఎస్.కె. చౌదరి సమస్తీపూర్ సివిల్ సర్జన్ ఈ విషయం తెలిసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.












Click it and Unblock the Notifications