ఫిబ్రవరి 10న తొలివిడత పోలింగ్.. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంపై ఈసీ సడలింపులు
దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికారాన్ని కైవసం చేసుకునేందుకు ప్రధాన పార్టీలన్నీ తహతహలాడుతున్నాయి. తొలి విడత ఎన్నికలు జరిగే స్థానాలలో ప్రచారానికి మరో రెండు రోజులే గడువు ఉంది. దీంతో తమ వ్యూహ, ప్రతి వ్యూహాలతో పార్టీలు ముందుకు వెళ్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు పోటా పోటీగా ఉచిత హామీలు గుప్పించాయి. ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహిస్తున్నాయి.

ఎన్నికల నిబంధనలు సడలింపు
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంపై ఎన్నికల కమిషన్ కొన్ని రోజుల కిందట ఆంక్షలు విధించింది. సభలు, సమావేశాలు, ర్యాలీలపై నిబంధనలు అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తాజాగా వాటిని కాస్త సవరించింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం బహిరంగ సభలకు సంబంధించిన నిబంధనలను ఈసీ సవరించింది. సమావేశ మందిరాల్లో 50 శాతం సీటింగ్ కెపాసిటీతో నిర్వహించుకోవచ్చని తెలిపింది. బహిరంగ సభలను 30 శాతం సామర్థ్యంతోనూ ఉత్తర్వులు జారీ చేసింది.

కరోనా వ్యాప్తి, పోలింగ్‌పై సమీక్ష
ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తిపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శితో పాటు ఆ రాష్ట్రాల ప్రభుత్వ కార్యదర్శులు, ప్రత్యేక పరిశీలకులతో ఎన్నికల కమిషన్ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించింది. కరోనా విజృంభణ, పోలింగ్ ఏర్పాట్లపై సమీక్షించింది. ఎన్నికల ప్రచార నిబంధనలను కొంత సడలిస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా పరిస్థితి చెప్పుకోదగ్గ స్థాయిలో మెరుగుపడిందని, పాజిటివ్ కేసుల సంఖ్య బాగా తగ్గిందని అధికారులు ఈసీ దృష్టికి తీసుకువచ్చారు. కరోనాతో రోగులు ఆసుపత్రిలో చేరవలసిన అవసరం కూడా తగ్గిందని ఈ అధికారులు చెప్పినట్లు సమాచారం.

ఫిబ్రవరి 10 నుంచి ఎన్నికలు
ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ కు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 10 నుంచి ఈ ఎన్నికలు జరుగుతాయి. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మరో నాలుగు రోజులే ఎన్నికల పోలింగ్‌కు సమయం ఉంది. ఈ నేపథ్యంలో పోలింగ్ ఏర్పాట్లుపై ఈసీ కీలక సమావేశం ఏర్పాటు చేసింది. కట్టుదిట్టమైన భద్రత నడుమ పోలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications