ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ నాయక్ మళ్లీ సస్పెండ్
ముంబై: ముంబై నగరంలో గ్యాంగ్ స్టర్ ల గుండెలలో నిద్రపోయిన పోలీసు అధికారి, ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ మీద మళ్లీ సస్పెన్షన్ వేటు పడింది. ఆయన విధులకు హాజరు కాలేదని, సస్పెండ్ చేస్తున్నామని శుక్రవారం మహారాష్ట్ర పోలీసు శాఖ ఆదేశాలు జారీ చేసింది.
2014వ సంవత్సరంలో దయా నాయక్ ను బాంద్రా నుండి నాగ్ పూర్ కు బదిలీ చేశామని, అయితే ఆయన అక్కడ విధులకు హాజరు కాలేదని, అందుకే సస్పెండ్ చేశామని మహారాష్ట్ర పోలీసు అధికారులు తెలిపారు. దయా నాయక్ 1995 బ్యాంచ్ పోలీసు అధికారి.
ముంబై నగరంలో ఆయన అనేక చోట్ల పని చేశారు. ఆ సందర్బంలో దయా నాయక్ ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారని పాత్రికేయుడు కేతన్ తిరోద్కర్ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన ఏసీబీ అధికారులు 2006వ సంవత్సరంలో దయా నాయక్ ను అరెస్టు చేసి జైలుకు పంపించారు.

2009లో దయా నాయక్ మీద ఉన్న ఆరోపణలుకు తమ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని అప్పటి డీజీపీ ఎస్ఎస్ విర్క్ వెల్లడించారు. అన్ని కేసుల నుండి దయా నాయక్ కు విముక్తి కలిగింది. దయా నాయక్ మీద నమోదు అయిన మోకా చట్టం కేసును 2010లో సుప్రీం కోర్టు కొట్టి వేసింది.
క్లీన్ చిట్ ఉన్న దయా నాయక్ ను 2012లో మళ్లి పోలీసు శాఖ సర్వీసులోకి తీసుకుంది. తరువాత ముంబై లోని బాంద్రా-అంథేరి ఆయుధ విభాగంలో విధులు అప్పగించారు. గత సంవత్సరం దయా నాయక్ ను నాగ్ పూర్ కు బదిలి చేశారు.
అయితే దయా నాయక్ అక్కడ విధులలో చేరలేదు. దయా నాయక్ ఇప్పటి వరకు ముగ్గురు లష్కర్- ఏ- తోయిబా ఉగ్రవాదులతో సహ 80 మంది గ్యాంగ్ స్టర్ లు, గూండాలను ఎన్ కౌంటర్ లో అంతం చేశారు. దయా నాయక్ చేతిలో పేరు మోసిన గ్యాంగ్ స్టర్ లు రఫిక్ డబ్బా, వినోద్ మట్కర్, సాధిక్ కాలియా తో సహా పలువురు అంతం అయ్యారు. దయానాయక్ జీవిత చరిత్ర ఆదారంగా దేశంలోని దాదాపు అన్ని భాషలలో సినిమాలు నిర్మించారు.












Click it and Unblock the Notifications