• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ కొరత లేదన్న ఇంధనశాఖ – ప్రెస్ రివ్యూ

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
విద్యుట్ టవర్

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ కొరత లేదని ఇంధన శాఖ చెప్పినట్లు సాక్షి పత్రిక ఒక కథనం రాసింది.

ఆ కథనం ప్రకారం.. దసరా తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్‌ కోతలంటూ జరుగుతున్న ప్రచారంపై విద్యుత్తు శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఉన్నతాధికారులు, డిస్కమ్‌ల సీఎండీలు స్పందించారు. ఆ ప్రచారం పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు లేవని స్పష్టం చేశారు.

అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఈనెల 10వతేదీ నుంచి 14 వరకు విద్యుత్‌ లోటు సగటున రోజుకు 1.22 మిలియన్‌ యూనిట్ల కంటే తక్కువగానే ఉంది. పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హర్యానా లాంటి రాష్ట్రాల్లో విద్యుత్‌ లోటు ఏపీ కంటే ఎక్కువగా ఉంది. అక్టోబర్‌ 14న ఏపీలో 0.76 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ లోటు ఉండగా మరుసటి రోజు నాటికి అది కూడా పోయి లోటు పూర్తిగా జీరో అయ్యింది.

దీంతో రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు లేకుండా డిస్కమ్‌‌లు పూర్తి స్థాయిలో విద్యుత్‌ పంపిణీ చేయగలుగుతున్నాయి. రానున్న రోజుల్లో కూడా రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు ఉండవని విద్యుత్‌ శాఖ హామీ ఇచ్చింది. కోతలపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించింది. విద్యుత్‌ సరఫరాపై తప్పుడు వార్తలను నమ్మవద్దని వినియోగదారులకు ఇంధనశాఖ విజ్ఞప్తి చేసింది.

సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో ఉన్న వదంతులను నమ్మవద్దని ఆంధ్రప్రదేశ్‌ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్‌), ఆంధ్రప్రదేశ్‌ మధ్యప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్‌), ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్‌) వినియోగదారులకు విజ్ఞప్తి చేశాయి.

విద్యుదుత్పత్తికి అవసరమైన బొగ్గు నిల్వలను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చడం వల్ల సరఫరాలో అంతరాయాలు, కోతలు లేవని స్పష్టం చేశాయి.

కరెంట్ కోతలంటూ జరుగుతున్న ప్రచారంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. బొగ్గు సంక్షోభం వల్ల తెలంగాణ మినహా అన్ని రాష్ట్రాల్లో సంక్షోభం ఏర్పడిందని ఆయన చెప్పారు.

ఇది ఒక్క ఏపీకి సంబంధించిన సమస్య కాదని అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేకుండా చూసేందుకు జగన్ చర్యలు తీసుకున్నారని ఆయన మీడియాకు వివరించారని సాక్షి తెలిపింది.

'మా'లో రాజకీయాలు ఉండకూడదు - మోహన్ బాబు

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు తన కార్యవర్గ సభ్యులతో శనివారం ప్రమాణస్వీకారం చేశారు. దీనిపై ఈనాడు ఒక కథనం ప్రచురించింది.

దాని ప్రకారం.. ఈ కార్యక్రమానికి తెలంగాణ సినిమాటోగ్రఫి మంత్రి తలసాని ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

''అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల స్థాయిలో మా ఎన్నికలు జరిగాయి. ఎదుటివారితో ఎలా సంస్కారంగా ఉండాలో మోహన్‌ బాబు విష్ణుకు నేర్పించారు. మోహన్‌ బాబుకి కోపం ఎక్కువ అని ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు చెప్పుకొంటారు. నిజం చెప్పాలంటే ఆ కోపంతో ఆయన ఎంతో నష్టపోయాడు. విష్ణుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తుంది. మా ఎన్నికల్లో విష్ణు గెలుస్తాడని నాకు 10 రోజుల ముందే తెలుసు'' అని మంత్రి అన్నారు.

''మా' అనేది కళాకారుల వేదిక. ఇక్కడ రాజకీయాలు ఉండకూడదు. మా అధ్యక్షుడిగా ప్రతి విషయంలో విష్ణు ఆచితూచి వ్యవహరించాలి. సభ్యుల ఇళ్ల నిర్మాణం, వాళ్ల సమస్యల పరిష్కారం కోసం త్వరలో నేనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ దగ్గరకు వెళ్లి అడుగుతాను. అలాగే ఏపీ సీఎం జగన్‌నూ కలుస్తాం'' అన్నారు మోహన్‌ బాబు.

''ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ సభ్యులు రాజీనామా చేయడం దురదృష్టకరం. మేనిఫెస్టోలో చర్చించిన ప్రతిదీ అమలు జరిగేలా కృషి చేస్తాను. ఇకపై నేను, మా సభ్యులు ఎన్నికల వ్యవహారంపై మీడియాతో మాట్లాడరు'' అని మంచు విష్ణు వివరించారు.

తెలంగాణ సీఎం కేసీఆర్

వానాకాలం వడ్లు కొంటాం - కేసీఆర్

ఈ వానకాలానికి సంబంధించిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిదని నమస్తే తెలంగాణ ఒక కథనం రాసింది.

దాని ప్రకారం.. దొడ్డు వడ్లు కొనరంటూ ఇటీవల పెద్ద ఎత్తున ప్రకటనలు వెలువడ్డాయి. దాంతో గత వానకాలంలో, యాసంగిలో మాదిరిగానే ఈసారి కూడా రైతుల నుంచి ప్రతి గింజనూ సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పంట చేతికొచ్చిన ప్రాంతాల్లో తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి ధాన్యం సేకరణ ప్రక్రియను ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.

ఈ మేరకు కొనుగోళ్లపై పౌరసరఫరాలశాఖ శనివారం మార్గదర్శకాలు జారీచేసింది. కరోనా ప్రభావం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో గతంలో మాదిరిగానే రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్రామాల్లోనే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6 వేల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయనుంది.

రికార్డుస్థాయిలో ఈ సీజన్‌లో 135 లక్షల టన్నుల ధాన్యం సేకరించే అవకాశం ఉన్నదని అధికారులు అంచనా వేశారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.

పసికందు కిడ్నాప్.. గంటల్లోనే తల్లి ఒడికి చేర్చిన పోలీసులు

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి (జీజీహెచ్‌)లో మూడు రోజుల మగ శిశువు అపహరణకు గురయ్యాడు. రంగంలోకి దిగిన పోలీసులు సుమారు 7 గంటల్లోపే కేసును ఛేదించి శిశువును తల్లి ఒడికి చేర్చారని సాక్షి తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. గుంటూరు జిల్లాకు మహేష్‌ భార్య ప్రియాంకను ప్రసవ సమయం దగ్గర పడటంతో కుటుంబ సభ్యులు ఈ నెల 11వ తేదీన జీజీహెచ్‌లో చేర్పించారు. ప్రియాంక ఈ నెల 13న మగ శిశువుకు జన్మనిచ్చింది. ఈ నెల 15వ తేదీన అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో మహేష్‌ తల్లి వార్డులో కోడలి పొత్తిళ్లలో ఉన్న శిశువు ఏడుస్తుండటంతో ఎత్తుకుని వార్డు బయటకు తీసుకొచ్చింది.

కొద్దిసేపటి తరువాత ఆ పసికందును ప్రియాంక తల్లి పార్వతమ్మ వద్ద ఉంచి బాత్‌రూమ్‌కు వెళ్లింది. కొద్దిసేపటికే పార్వతమ్మ నిద్రలోకి జారుకోగా.. బాత్‌రూమ్‌ నుంచి తిరిగొచ్చిన ఏసుకుమారికి పసికందు కనిపించలేదు. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది సహాయంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా.. కొత్తపేట ఎస్‌హెచ్‌వో శ్రీనివాసులురెడ్డి పోలీసు బృందాల్ని రంగంలోకి దింపి గాలింపు చర్యలు చేపట్టారు. ఆస్పత్రిలోని సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితులు రైల్వేస్టేషన్‌ వైపు ఉన్న మెయిన్‌ గేటు నుంచి బయటకు చేరుకుని ఆటో ఎక్కి వెళ్లిపోయినట్టు గుర్తించారు.

ఆటో ఎటు వెళ్లిందో కూపీ లాగిన పోలీసులు చివరకు ఆటో డ్రైవర్‌ను గుర్తించి అతడి సహాయంతో నిందితుల ఇంటికి వెళ్లారు. నిందితులు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం యనమదలకు చెందిన హేమవర్ణుడు, రెడ్డి పద్మజలను అరెస్ట్‌ చేసి పసికందును తల్లి ఒడికి చేర్చారు.

మగ శిశువును అపహరించి విక్రయిస్తే భారీగా సొమ్ము సంపాదించవచ్చని భావించిన హేమవర్ణుడు పథకం ప్రకారం పద్మజతో కలిసి ఈ కిడ్నాప్‌కు పాల్పడినట్లు పోలీసులు తేల్చారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
Energy department says there is no power shortage in Andhra Pradesh - Press Review
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X