దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..!
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ఇరాన్- అమెరికా మధ్య కాల్పుల విరమణ జరిగినప్పటికీ అక్కడి పరిస్థితి యుద్ధ వాతావరణాన్నే తలపిస్తోంది. లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు ముమ్మరం చేయడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఈ దాడులపై ఆగ్రహం వ్యక్తంచేసిన ఇరాన్ హర్మూజ్ జలసంధిని మరోసారి మూసేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలకు మరోసారి భారీ షాక్ తగిలింది. హార్మూజ్ జలసంధిని పూర్తిగా మూసి వేసిన నేపథ్యంలో అక్కడి వరకూ వెళ్లిన నౌకలను తిరిగి బలవంతంగా వెనక్కు మరలిస్తున్నట్లు అంతర్జాతీయ కథనాల ద్వారా వెల్లడి అవుతుంది.
అయితే చమురు సంక్షోభం నుంచి బయట పడేందుకు ఆసియాలోని అనేక దేశాలు వివిధ రూల్స్ ను పెట్టుకుని అమలు చేస్తున్నాయి. పాకిస్థాన్ లో ఇప్పటికే ఎనర్జీ లాక్ డౌన్ నడుస్తోంది. దాంతో దేశవ్యాప్తంగా మార్కెట్లు, షాపింగ్ మాల్స్ రాత్రి 8 గంటల కల్లా క్లోజ్ చేస్తున్నారు. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్, పాఠశాలలకు సెలువులు ఇచ్చారు.
ఇక శ్రీలంకలో పరిస్థితి మరోవిధంగా ఉంది. ఇంధన సంక్షోభంలో శ్రీలంకలో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంధనం, విద్యుత్ ను ఆదా చేసేందుకు అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి బుధవారం సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ప్రజలు వాహనాల వినియోగాన్ని తగ్గించుకోవాలని సూచనలు చేసింది. అంతేకాక ప్రైవేట్ వాహనాలకు ఇంధనాన్ని రేషనింగ్ చేస్తోంది.
అలాగే మరో దేశం ఫిలిప్పీన్స్ ను కూడా పశ్చిమాసియా యుద్ధం తాకింది. ఫిలిప్పీన్ దేశం దాదాపు 98 శాతం దిగుమతులపైనే ఆధార పడుతుంది. దాంతో దేశంలో ప్రస్తుతం ఎనర్జీ ఎమర్జెన్సీ విధించారు. దేశంలోని విద్యుత్ ఉత్పత్తికి అవసరం అయిన గ్యాస్ నిల్వలు పూర్తి కావడంతో దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఇక వియత్నాం కూడా తమ దేశ పౌరులపై పలు ఆంక్షలు విధించింది. ఈ దేశంలో పెట్రోల్ ధరలు 60 శాతానికి పెరిగాయి. దాంతో అనవసర ప్రయాణాలను అక్కడి ప్రభుత్వం నిషేధించింది. కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని సూచనలు చేసింది.

ఇక మయన్మార్ లో కూడా ప్రజలు చమురు కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. దాంతో మయన్మార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆడ్ ఈవెన్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ విధానం వల్ల నిర్దేశించిన రోజుల్లోనే వాహనాలు రోడ్లపైకి రావాల్సి ఉంటుంది. అలాగే భారత్ కు సరిహద్దు దేశమైన బంగ్లాదేశ్ లోనూ ఆంక్షలు భారీగా విధించారు. అక్కడ విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తూ లోడ్ షెడ్డింగ్ అమలు చేస్తున్నట్లు సమాచారం. ఈ దేశాలతోపాటు జర్మనీ, దక్షిణాఫ్రికా కూడా ఇదే విధానంలోకి జారుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక భారత్ లో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది.












Click it and Unblock the Notifications