మాములు కేడీలు కాదు కదా.. రూ.21 కోట్లు అక్రమంగా విత్ డ్రా. ఈపీఎఫ్‌వోలో దొంగలు
దేశవ్యాప్తంగా వివిధ సంస్థల ఉద్యోగుల భవితవ్యం కోసం ఏర్పాటు చేసిన ఉద్యోగ భవిష్య నిధి సంస్థలో దొంగలు పడ్డారు. ముంబై ఈపీఎఫ్‌వో మోసం జరిగింది. ముంబై ఈపీఎఫ్‌వో ఆఫీసులోని కొందరు ఉద్యోగులు ఒక్కటి అయ్యారు. ఈపీఎఫ్‌వో పూల్‌లో ఉండే నిధుల నుంచి రూ.21.5 కోట్లు స్వాహా చేశారు. ఈ మేరకు ఓ వార్తా కథనం ప్రచురితమైంది.
ఈపీఎఫ్‌వో కందివాలీ ఆఫీసులో క్లర్క్‌గా పని చేస్తున్న చందన్ కుమార్ సిన్హా దీనికి సూత్రధారి అని తేలింది. 817 బ్యాంకు ఖాతాలను ఉపయోగించి ఈపీఎఫ్‌వోలోని పీఎఫ్ కామన్ పూల్ నిధుల నుంచి సొమ్ము విత్ డ్రా చేశారు. ఖాతాల్లో అత్యధికం వలస కార్మికులవే కావడం గమనార్హం. 90 శాతం సంబంధిత వ్యక్తుల ఖాతా నుంచి కూడా తీసేసుకున్నారని ఈపీఎఫ్‌వో అంతర్గత దర్యాప్తులో తేలింది. అంతర్గత అడిటింగ్ ముగిసిన తర్వాత కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించనున్నట్లు సమాచారం.

కోట్ల రూపాయల విలువ చేసే స్కాం బయటపడటంతో సూత్రధారి అయిన చందన్ కుమార్ సిన్హాను, మరో నలుగురిని ఈపీఎఫ్‌వో సస్పెండ్ చేసింది. అప్పటినుంచి వీరంతా పరారీలో ఉన్నారు. వీరు ప్రతి నెలా ఈపీఎఫ్‌వోలో రిజిస్టర్డ్ సంస్థలు డిపాజిట్ చేసే కామన్ పూల్ నిధులను స్వాహా చేశారు. ఈ నిధులను సాధారణంగా ప్రభుత్వ సెక్యూరిటీస్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఏ ఒక్కరి వ్యక్తిగత పీఎఫ్ ఖాతా నిధులు దుర్వినియోగం కాలేదు. ఈపీఎఫ్‌వో పూల్ సొమ్ము నష్టపోయాం.. ఏ ఒక్క వ్యక్తిదీ నష్టపోలేదు. ఇది బ్యాంకు దోపిడితో సమానం అని ఈపీఎఫ్‌వో సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఈ ఏడాది మార్చి నుంచి జూన్ మధ్య ఈ కుంభకోణం జరిగి ఉంటుందని సంస్థ అధికారులు భావిస్తున్నారు.
కరోనా మహమ్మారి నేపథ్యంలో ఉద్యోగాలు కోల్పోయిన వారు, వేతనాల కోతకు గురైన వారు ఈపీఎఫ్‌వో నుంచి నిధులు విత్ డ్రా చేసుకున్నారు. భారీ మొత్తంలో విత్‌డ్రాయల్స్ నమోదు చేసుకున్నాయి. సంబంధిత ఈపీఎఫ్‌వో సభ్యుల రిక్వెస్ట్‌లను వెరిఫై చేసి ధ్రువీకరించడానికి సంస్థలోని కొందరు ఉద్యోగులకు పలు బాధ్యతలు అప్పగించారు. ఇందుకు నిబంధనలను సడలించారు. లాక్‌డౌన్‌లో వర్క్ ఫ్రం హోం సేవలు అందిస్తున్న ఉద్యోగులకు సీనియర్ అధికారులకు ఈ ఖాతాల నిర్వహణ, బట్వాడా సంబంధించిన పాస్‌వర్డ్‌లను అందజేశారు. చందన్‌కుమార్ సిన్హా స్కాంలో కొందరు సెక్షన్ అధికారుల పాత్ర ఉన్నట్లు ఈపీఎఫ్‌వో అంతర్గత దర్యాప్తులో తేలింది.
పలు బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు పాస్‌వర్డ్‌లు ఇచ్చిన అధికారులు తర్వాత వాటిని మార్చకపోవడంతోనే ఈ కుంభకోణం చోటు చేసుకుందనే అనుమానాలు ఉన్నాయి. ఇది సంబంధిత అధికారుల నిర్లక్ష్యమేనని సంస్థ సీనియర్ అధికారి చెప్పారు. అక్రమంగా నిధులు మళ్లించిన 817 బ్యాంకుల ఖాతాలను స్తంభింపజేయాలని ఆయా బ్యాంకులకు ఈపీఎఫ్‌వో లేఖ రాసింది. మొత్తం కుంభకోణంలో రూ.2 కోట్లు మాత్రమే రికవరీ అయ్యాయని ఈపీఎఫ్‌వో అధికారులు చెప్పినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications