జైపూర్ అమ్మాయికి ఫేస్‌బుక్ బంపర్ ఆఫర్: రూ.2కోట్ల ప్యాకేజీ
జైపూర్: ఐఐటీ - బాంబే విద్యార్థిని ఆస్థా అగర్వాల్‌కు ఫేస్‌బుక్ రూ.2 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం ఇచ్చింది. ఇటీవల కాలంలో భారత విద్యార్థులకు గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు భారీ వేతనాలతో ప్యాకేజీలు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఏపీకి చెందిన ముగ్గురికి వివిధ కంపెనీలు భారీ ప్యాకేజీలు ఇచ్చాయి.
తాజాగా.. బాంబే ఐఐటీ విద్యార్థిని ఆస్థా అగర్వాల్‌కు సోషల్ నెట్వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్ ఏడాదికి 2 కోట్ల రూపాయల బంపర్ ప్యాకేజి ఇచ్చింది. ఆస్థా వయస్సు ఇరవై ఏళ్లు. ఈమె జైపూర్ అమ్మాయి. థర్డ్ ఇయర్ కంప్యూటర్ సైన్స్ చదువుతోంది.

ఈ విషయం తెలియగానే ఆస్థా అగర్వాల్ కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్నారు. ఆస్థా అగర్వాల్ మాట్లాడుతూ.. గత మే, జూన్ మాసాల్లో కాలిఫోర్నియాలో ఫేస్‌బుక్ సంస్థలో శిక్షణ పొందానని, వారు తన పనితీరును గుర్తించారని తెలిపారు.
సంస్థ తన పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేయడంతోపాటు భారీ వేతనంతో ఉద్యోగాన్నీ ఆఫర్ చేసిందని చెప్పారు. వారు తనకు ఆఫర్ లెటర్ పంపించారని తెలిపారు. కంప్యూటర్ సైన్స్ నాలుగో ఏడాది పూర్తైన తర్వాత వచ్చే ఏడాది అక్టోబరులో ఫేస్‌బుక్ ఉద్యోగంలో చేరుతానని తెలిపారు. ఉద్యోగంలో చేరేందుకు ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్నానని తెలిపారు.
ఆస్థా అగర్వాల్ 2009లో భారత్ తరఫున జూనియర్ సైన్స్ ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ ప్రాతినిథ్యం వహించారు. ఈమె తల్లి శోభా అగర్వాల్. శోభా అగర్వాల్ మాట్లాడుతూ.. తన కూతుళ్లకు మంచి చదువు చెప్పించాలనేదే తన కలగా ఉండేదని చెప్పారు. కాగా, ఐఐటీ - బాంబే విద్యార్థులు అయిదుగురు రూ.1.42 కోట్ల ప్యాకేజీతో క్యాంపస్ ఇంటర్వ్యూలో గతంలో సెలక్ట్ అయ్యారు.












Click it and Unblock the Notifications