ఇంటర్నేషనల్ డ్రగ్స్ దందా సూత్రధారిగా ప్రముఖ నిర్మాత
భారతదేశంలో డ్రగ్స్ కు అడ్డుకట్ట వేయాలని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, ఎంతమందిపై కేసులు నమోదు చేస్తున్నా డ్రగ్స్ కు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. ఇక ఈ డ్రగ్స్ మాఫియాలో ఫిలిం ఇండస్ట్రీకి చెందినవారు ఉండడం, చాప కింద నీరులా సినీ పరిశ్రమలో డ్రగ్స్ రాకెట్లు పనిచేయడం షాక్ కు గురిచేస్తుంది.
ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్ డ్రగ్స్ మాఫియా దేశంలో చర్చనీయాంశం కాగా, తాజాగా కోలీవుడ్ లో కూడా డ్రగ్స్ మాఫియా కలకలం రేపుతుంది. తాజాగా ఒక ప్రముఖ సినీ నిర్మాత సూత్రధారిగా ఉన్న డ్రగ్స్ రాకెట్ ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఛేదించింది. ఢిల్లీలో ఇటీవల జరిపిన సోదాలలో డ్రగ్స్ తయారీకి ఉపయోగించే 50 కిలోల సూడో ఎఫెడ్రిన్ రసాయనాన్ని స్వాధీనం చేసుకొని తమిళనాడుకు చెందిన ముగ్గురిపై కేసు నమోదు చేసింది.

నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వీరు డ్రగ్స్ ను ఓడలు, విమానాలలో హెల్త్ మిక్స్ పౌడర్, కొబ్బరిపొడి వంటి డబ్బాలలో దాచి రవాణా చేస్తున్నట్టు పేర్కొంది. వీరిని విచారించిన క్రమంలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయని వెల్లడించింది. గత మూడేళ్లలో రెండు వేల కోట్ల విలువైన 3500 కిలోల సూడో ఎఫెడ్రిన్ ను వీరు 45 సార్లు పంపించినట్లుగా తేలింది.
ఈ ముఠా ఇప్పటివరకు భారత్ తో పాటు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, మలేషియా వంటి దేశాలలో లింక్స్ కలిగి ఉండి, డ్రగ్స్ రాకెట్లను నిర్వహిస్తోందని తేల్చింది. తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాత సూత్రధారిగా ఈ అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్ పనిచేస్తున్నట్టు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తెలిపింది.
ప్రస్తుతం సదరు సినీ నిర్మాత పరారీలో ఉన్నట్టు వివరించింది. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు పేర్కొంది.ఇక ప్రముఖ సినీ నిర్మాత పట్టు బడితే ఈ కేసులో అనేక కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు కోలీవుడ్ లో ఆ అగ్ర సినీ నిర్మాత ఎవరు అన్నది ఆసక్తికర చర్చగా మారింది.












Click it and Unblock the Notifications