రైతు ఉద్యమంలో కీలక మలుపు -సాగు చట్టాలపై సుప్రీం కమిటీ సీల్డ్ కవర్ రిపోర్టు -ఏప్రిల్ 5న భవితవ్యం
వ్యవసాయ రంగంలో అద్భుత సంస్కరణలంటూ ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతోన్న రైతులు ఓవైపు, చట్టాలను వెనక్కి తీసుకోబోమని మొండికేసిన మోదీ సర్కార్ మరోవైపు.. కనీసం చర్చలు కూడా లేకుండా దాదాపు డెడ్ లాక్ పరిస్థి నెలకొన్నవేళ నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది.
స్మగ్లింగ్ దందాలో సీఎం -సర్కారీ ఆస్తుల అమ్మకం -ప్రశాంత కేరళలో రాజకీయ హింస: పినరయిపై ప్రియాంక ఫైర్
రైతు ఉద్యమకారులతో సంప్రదింపులు జరిపేందుకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల కమిటీ బుధవారం తన తుది నివేదికను అందజేసింది. మొత్తం 85 రైతు సంఘాలతో చర్చలు, సంప్రదింపులు జరిపి కమిటీ తయారు చేసిన తుది రిపోర్టును సీల్డ్ కవర్ లో సుప్రీంకోర్టుకు అప్పగించింది. ప్రస్తుతం సుప్రీంకోర్టుకు హోలీ సెలవులు నడుస్తున్నందున, ఏప్రిల్ 5న జరగబోయే విచారణలో సీజేఐ జస్టిస్ బాబ్డే ధర్మాసనం ఈ రిపోర్టును తెరవనుంది.

సాగు చట్టాలకు వ్యతిరేకంగా వేల మంది రైతులు దేశ రాజధాని ఢిల్లీ శివారుల్లో భారీ నిరసనకు దిగగా, దానికి మద్దతుగా దేశవ్యాప్తంగా ఆందోళనలను జరిగాయి. రైతు సంఘాల నేతలతో కేంద్రం జరిపిన చర్చలు విఫలమై, ఉద్యమం మరింత తీవ్రతరం కావడంతో ఈఏడాది జనవరిలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. సాగు చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపేస్తూ సంచలన ఉత్తర్వులిచ్చిన కోర్టు.. రైతులతో సంప్రదింపుల కోసం ఓ కమిటీని ఏర్పాటు చేయడం తెలిసిందే.
డాక్టర్ అశోక్ గులాటి, డాక్టర్ ప్రమోద్ జోషి, అనిల్ ఘన్వాట్ లు సభ్యులుగా ఉన్న ఈ ప్యానెల్.. గడిచిన మూడు నెలలుగా వివిద రైతు సంఘాలతో చర్చలు జరిపి, వారి డిమాండ్లను, సాధ్యమయ్యే పరిష్కార మార్గాలను అడిగితెలుసుకుంది. మొత్తం విషయాన్ని క్రోడీకరించి, రిపోర్టు రూపంలో బుధవారం సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఏప్రిల్ 5న జరగబోయే విచారణలో ఈ రిపోర్టుపై సుప్రీంకోర్టు ఇవ్వబోయే తీర్పును బట్టి రైతు ఉద్యమం భవితవ్యం తేలనుంది.